‎‎మెదక్ MLC ఎన్నికపై టెన్షన్ టెన్షన్.. కేసీఆర్‌‌కు షాకిచ్చిన ఇంటెలిజెన్స్ నివేదిక..!

by  |
CM KCR
X

దిశ, గజ్వేల్ : ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఎన్నికల్లో ఘోర పరాభవం లాంటి ఫలితాలు మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్ట చర్యలకు పూనుకున్నట్టు సమాచారం. అభ్యర్థి గెలుపు కోసం పటిష్ట వ్యూహన్ని రూపోందించినట్టు వినికిడి. గెలుపు ధీమా అంచనాలను పక్కన పెట్టి ప్రజా క్షేత్రంలో విస్తృత పర్యటనలు చేయాలని అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తోంది. అభ్యర్థి నేపథ్యం, నియోజకవర్గాల్లోని ప్రజా ప్రతినిధుల వైఖరులు, పార్టీ పై ఉన్న అభిమాన పర్వంపై ఆరా తీసేందుకు ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ బృందాలను గ్రామీణ ప్రాంతాలకు పంపి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఆఫర్ చేసిన స్థానం కావడంతో వ్యూహాత్మక గెలుపు సాధించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యేలకు అధినేత గీతోపదేశం చేసినట్లు తెలుస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ స్థానంపై దృష్టి సారించినట్టు లీక్స్ వస్తున్నాయి.

వివరాల్లోకెళితే.. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రసవత్తర రాజకీయ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. మొదటి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో తెరాసకు ఎదురులేదనే వాదన ఓ వైపు బలంగా వినిపించింది. ఇది కాక ప్రతిపక్ష పార్టీలు సైతం ఈ ఎన్నికల అంశంలో దూరంగా ఉంటున్నాయనే సంకేతాలిచ్చి, ఓ దశలో మెదక్ ఎమ్మెల్సీ కూడా ఏకగ్రీవమే అన్నంతగా ప్రచారం జరిగిపోయింది. కానీ, ఒక్కసారిగా ఎవ్వరూ ఊహించని విధంగా హస్తం పార్టీ నుంచి తూర్పు నిర్మల జగ్గారెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో సీన్ రివర్స్ అయ్యింది. దీనికి తోడూ స్వతంత్ర అభ్యర్థులు, రెబల్స్ పోరూ కారుకు సరేసరి. ఇదిలావుంటే కాంగ్రెస్ పార్టీ ఉద్దండ నేతల సూచనలు, పక్కా వ్యూహంతోనే నిర్మల జగ్గారెడ్డి నామినేషన్ దాఖలు చేశారన్న విషయాన్ని హస్తం నేతలు ధృవీకరించడం గమనించదగ్గ అంశం. నిర్మల సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి కావడం కూడా హస్తం పార్టీకి కాస్త కలిసోచ్చే అంశంగా చెబుతున్నారు విశ్లేషకులు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో జగ్గారెడ్డికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండటం, అంతకు మించి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో మంత్రులుగా, ప్రస్తుతం హస్తం పార్టీలో రాష్ర్ట ముఖ్య నేతలుగా ఉన్న గీతారెడ్డి, అందోల్ దామోదర రాజ నర్సింహ్మ, గజ్వేల్ నర్సారెడ్డి, దుబ్బాక శ్రీనివాస్ రెడ్డిల త్రయం ప్రభావం వారి సొంత నియోజకవర్గాల్లో అధికంగా ఉందట. హస్తం నేతలు గెలుపు ధీమాను వ్యక్తం చేయడంలో ఈ అంశాన్ని ప్రధానంగా ఉటంకిస్తున్నారు. తెరాస అంచనాలు తారుమారు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నందు వల్లే అధినేత దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంతకు మించి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ సైతం పార్టీ వైరం మరిచి తమకే మద్దతిస్తాడనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి హస్తం శ్రేణులు. ఇదంతా ఒక ఎత్తైతే గత కొంత కాలంగా తెరాస అధిష్టానంపై నిధులు, విధులు అంశంలో అసంతృప్తితో ఉన్న ఎంపీటీసీలు, ఎంపీపీలను ప్రసన్నం చేసుకునేందుకు హస్తం పార్టీ నేతలు ముందుండటంలో అసలు వార్ మొదలయ్యిందట. ఇటీవలే ఎంపీటీసీల రాష్ర్ట గౌరవ అధ్యక్షుడు దేవీ రవీందర్ నేతృత్వంలో ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ప్రత్యేక సమావేశంలో తమ వేదనను వెళ్ళగక్కిన ఫలితం లేకపోవడంతో ఎంపీటీసీలు తీవ్ర నిరాశకు లోనయ్యారట.

లక్షలు ఖర్చు చేసి ప్రజా మద్దతుతో గెలిస్తే కనీస గౌరవానికి నోచుకోని దుస్థితి నెలకొందంటూ మదన పడుతున్నారట. ఉత్సవ విగ్రహాల్లాగే మిగిలామా? అంటూ తమ ఆవేదనను బాహాటంగానే వెళ్ళగక్కుతున్నారట. ఇదే అదునుగా చూసి వారి అసంతృప్తిని ‘ఓటు’ చేసుకునేందుకు చాప కింద నీరులా కాంగ్రెస్ పనిచేస్తుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సీఎం కేసీఆర్‌కు అందినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఎం దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్టు తెలుస్తోంది. గెలుపు ఆశలపై స్థిరంగా ఉంటూనే ప్రజాక్షేత్రంలో విస్తృతంగా పర్యటించాలని గులాబీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు సూచించారట. తెరాస అభ్యర్థి గెలుపుకోసం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు విధిగా సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఓటు కల్గిన నాయకులను ఎట్టి స్థితిలో చేజారనివ్వద్దని తెరాస అధినేత ఉద్బోద చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎంపీటీసీలకు ముఖ్యమంత్రి తీపి కబురు చెప్పనున్నారనే వార్తలు తెరాస రాష్ర్ట నాయక గణం ఘంటా పథంగా చెబుతున్నది. ఉపసంహరణల అనంతరం ఓ శుభ ముహుర్తంలో సీఎం ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీటీసీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెరాస శ్రేణులు పేర్కొంటున్నాయి.చూద్దాం మరీ తెరాస ప్రయత్నాలు, అధినేత ఆదేశాలు ఏ మేరకు పని చేసి అభ్యర్థికి విజయం కట్టబెడుతాయో వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed