టాయ్‌లెట్ పక్కనే మీడియా పాయింట్

by  |
టాయ్‌లెట్ పక్కనే మీడియా పాయింట్
X

దిశ, న్యూస్ బ్యూరో: ప్రతీ రాష్ట్రానికి పరిపాలనకు గుండెకాయ సచివాలయం. కానీ తెలంగాణ రాష్ట్రానికి సచివాలయమే లేదు. పాత సచివాలయాన్ని ప్రభుత్వం సమాధి చేసింది. కొత్త సచివాలయ నిర్మాణం ఇంకా డిజైన్ల ఖరారు దశలోనే ఉంది. తాత్కాలిక సచివాలయంగా బూర్గుల రామకృష్ణారావు భవన్‌ను ప్రభుత్వం ప్రకటించినా అందులో అన్ని శాఖలూ, విభాగాలు సర్దుకునే అవకాశం లేకపోవడంతో చెట్టుకొకటి పుట్టకొకటిగా తరలిపోయాయి. దాదాపు సంవత్సరకాలంగా తాత్కాలిక సచివాలయంలోకి మీడియాకు అనుమతి నిషేధమే అయింది. ప్రస్తుతానికి బీఆర్‌కేఆర్ భవన్‌కు సమీపంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఒక మీడియా సెంటర్‌ను ఏర్పాటుచేస్తానని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి నెలలు గడుస్తున్నా ఎక్కడి గొంగళి అక్కడే అనే చందంగా మారిపోయింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మీడియా ప్రతినిధులు కలిసి మీడియా పాయింట్ అవసరాన్ని నొక్కిచెప్పగా తప్పకుండా సమకూరుస్తానని హామీ ఇచ్చి సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌కు ఆదేశాలిచ్చారు. బీఆర్‌కేఆర్ భవన్‌లోనే ఒక గదిని ఏర్పాటుచేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. కానీ ఇవన్నీ నీటిమీద రాతలుగానే మారిపోయాయి. చివరకు తన చేతిలో ఏమీ లేదని, మీడియా పాయింట్ గురించి ముఖ్యమంత్రితోనే మాట్లాడి ఫైనల్ చేయించుకోవాలంటూ ప్రధాన కార్యదర్శి తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. పారదర్శక పాలన అంటూ ఒకవైపు ముఖ్యమంత్రి మొదలు అధికారుల వరకు గొప్పగా ప్రసంగాలు, ప్రకటనలు చేయడమే తప్ప ఆచరణ మాత్రం అందుకు విరుద్ధంగా అంతా గోప్యంగా, రహస్యంగా సాగుతోంది.

మీడియా లేకుంటే రాజకీయ పార్టీలు ఉంటయా, ప్రభుత్వాలు మనగలుగుతాయా అంటూ ముఖ్యమంత్రి చాలా గంభీరమైన ప్రకటనలు చేస్తారుగానీ చివరకు మీడియాను ఏ కార్యాలయంలోకి వెళ్ళనీయకుండా అప్రకటితంగా నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. చివరకు చేసేదేమీ లేక బీఆర్‌కేఆర్ భవన్‌కు ఎదురుగా ఉన్న ఒక ప్రైవేటు పబ్లిక్ టాయ్‌లెట్ గోడనే మీడియా పాయింట్‌గా ఏర్పాటుచేసుకున్నారు జర్నలిస్టులు. మరో మార్గమేదీ లేకపోవడంతో ప్రభుత్వానికి ఈ తరహాలో నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నాల్గవ మూలస్థంభంగా ప్రకటనలు చేయడమే తప్ప దాన్ని ఆచరించడానికి మనసురాని ప్రభుత్వాలు ప్రభుత్వ పథకాలకు, సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి, ప్రజలకు చేరవేయాల్సిన అవసరాలకు మాత్రమే వాడుకుంటూ కరివేపాకు తీరులో వ్యవహరించే ప్రభుత్వ వైఖరికి మీడియా ప్రతినిధులు ఈ తీరులో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed