వరుసగా మూడో నెలలో డీలాపడ్డ సేవల రంగం

by  |
వరుసగా మూడో నెలలో డీలాపడ్డ సేవల రంగం
X

దిశ, వెబ్‌డెస్క్: వ్యాపార కార్యకలాపాలు, కొత్త ఆర్డర్లు, ఉపాధి మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలో దేశీయ సేవల రంగ కార్యకాలాపాలు వరుసగా మూడో నెలలో ప్రతికూలంగా నమోదైనట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఏడాది జులై నెలకు సంబంధించి సేవల రంగం కొనుగోలు నిర్వాహకుల సూచీ(పీఎంఐ) 45.4గా ఉన్నట్టు బుధవారం నివేదిక తెలిపింది. కొవిడ్ ఆందోళనలు, స్థానిక ప్రాంతాల్లో ఆంక్షల కారణంగా సేవల రంగం సాధారణం కంటే తక్కువగా నమోదైనట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ పేర్కొంది. అంతకుముందు జూన్‌లో సేవా రంగ పీఎంఐ 41.2తో పోలిస్తే కొంతమేర పెరగడం విశేషం. పీఎంఐ స్కోరు 50కి పైన ఉంటే వృద్ధిని సూచిస్తుంది. 50కి దిగువన నమోదైతే క్షీణతగా పరిగణిస్తారు.

కాగా, ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం.. సేవల రంగంలో ఉపాధి క్షీణించడం వరుసగా ఇది ఎనిమిదో నెల అని, రానున్న మరికొన్ని నెలలపాటు ఈ రంగంలో ఉద్యోగాల నియామకాలు ప్రతికూలంగా కొనసాగే అవకాశాలున్నాయని వివరించింది. అంతేకాకుండా ద్రవ్యోల్బణం కూడా సేవల రంగంపై ఒత్తిడిని పెంచిందని, ఈ నేపథ్యంలో సేవల రంగంలోని సంస్థలు భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు నివేదిక తెలిపింది. ఈ ఏడాది కొవిడ్ సెకెండ్ వేవ్ మహమ్మారి భారత ఆర్థికవ్యవస్థకు కీలకమైన సేవల రంగం పనితీరుపై ప్రభావం కొనసాగిస్తూనే ఉంది. కొత్త వ్యాపారాలు పడిపోవడంతో జూలై గణాంకాలు నిరాశపరిచాయి. కరోనా పరిస్థితులపై అనిశ్చితి ఏర్పడటం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు జూలైలో సేవల రంగం విశ్వాసాన్ని దెబ్బతీశాయి. సర్వీస్ ప్రొవైడర్లు ఓ ఏడాదిలో మొదటిసారి వ్యాపార కార్యకలాపాల దృక్పథంపై నిరాశతో ఉన్నారని ఐహెచ్ఎస్ మార్కిట్ ప్రతినిధి వెల్లడించారు.


Next Story