చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి సానుకూలం

by  |
చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి సానుకూలం
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి భారత ఆర్థికవ్యవస్థ బయట పడుతోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి సానుకూలంగా నమోదవుతుందని నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. రెండో త్రైమాసికంలో జీడీపీ 7.5 శాతం ప్రతికూలంగా వెల్లడైన తర్వాత ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ దిశగా మారుతోందని, మూడో త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిస్థాయిలో కొనసాగడం ద్వారా సానుకూలతకు మారుతుందని నమ్ముతున్నట్టు ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల నేపథ్యంలో గతేడాది స్థాయిలో లేకపోయినప్పటికీ నాలుగో త్రైమాసికంలో సానుకూల వృద్ధిని చూడగలమని చెప్పారు. ప్రస్తుత సంస్కరణలు 2021-22 నుంచి ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని, రాబోయే సంవత్సరాల్లో మహమ్మారి ప్రతికూల వృద్ధిని అధిగమించి స్థిరమైన వృద్ధి పథంవైపు పయనించనున్నట్టు రాజీవ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

గత మూడు నెలల్లో జీఎస్టీ వసూళ్లు పెరగడం, పండుగ డిమాండ్ నేపథ్యంలో ఉత్పాదక రంగం మెరుగైన పనితీరును కొనసాగించడంతో సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థికవ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంది. తయారీ రంగం వేగంగా కోలుకోవడంతోనే జీడీపీ 7.5 శాతం ప్రతికూలానికి పరిమితమైందని చెప్పారు. వినియోగదారుల డిమాండ్ నేపథ్యంలో మరింత మెరుగుదల ఉంటుందనే ఆశలున్నాయని రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు.



Next Story

Most Viewed