మూడో త్రైమాసికంలో వృద్ధి సానుకూలం : ఆర్‌బీఐ, ఎన్ఎస్ఓ!

by  |
మూడో త్రైమాసికంలో వృద్ధి సానుకూలం : ఆర్‌బీఐ, ఎన్ఎస్ఓ!
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత ఆర్థికవ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా కోలుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో స్వల్ప సానుకూల వృద్ధిని సాధించవచ్చని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. అయితే, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రెట్టింపు ప్రయత్నాలను కొనసాగించాలని, తద్వారా ఇది వృద్ధిని దెబ్బతీయదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తెలిపింది. ‘ప్రస్తుత ఏడాదికి సంబంధించి పలు రేటింగ్ ఏజెన్సీలు తమ అంచనాలను సవరిస్తున్నాయని, ప్రస్తుత వేగం కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆశించిన దానికంటే బలంగానే వృద్ధి ఉండవచ్చని’ ఆర్‌బీఐ పేర్కొంది.

అదేవిధంగా కరోనా కారణంగా దేశ ఆర్థికవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి బయటపడుతోందని జాతీయ గణాంకాల విభాగం(ఎన్ఎస్ఓ) పేర్కొంది. అంచనాలకు మించి పురోగతి ఉన్నప్పటికీ, పలు సమస్యలు ఇంకా వేంటాడుతున్నట్టు ఎన్ఎస్ఓ వెల్లడించింది. దీనికోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఆర్థికవ్యవస్థ కుదేలైందని, సెప్టెంబర్ త్రైమాసికంలో వేగంగా కోలుకుందని ఎన్ఎస్ఓ తెలిపింది. ఈ పరిణామాలను గమనిస్తే డిసెంబర్‌తో ముగిసే మూడో త్రైమాసికంలో జీడీపీ సానుకూలానికి పరిణమించి 0.1 శాతం వృద్ధిని చూడగలదని అభిప్రాయపడింది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితులు బలపడుతున్నాయని, బ్యాంకుల్లో రుణాలకు డిమాండ్ పెరుగుతోందని ఎన్ఎస్ఓ తెలిపింది. మరోవైపు ప్రైవేట్ పెట్టుబడులు మరింత పెరగాల్సి ఉంది. ఆర్థిక రికవరీ కొనసాగడానికి ప్రైవేట్ రంగంలో సామర్థ్య వినియోగం, పెట్టుబడుల వ్యయం, విస్తరణ అంశాలపై కంపెనీలు దృష్టి సారించాలని ఎన్ఎస్‌వో తెలిపింది.

Next Story