పూణే ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్.. నిందితుడికి ఆలస్యంగా వైద్య పరీక్షలు..!

by Shamantha N |
పూణే ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్.. నిందితుడికి ఆలస్యంగా వైద్య పరీక్షలు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: పూణే పోర్ష్ కార్ ప్రమాద ఘటనలో సంచలనాలు బయటకొస్తున్నాయి. జైళ్లో యువకులకు పిజ్జా, బర్గర్ పెట్టారన్న వార్తలు మరవకముందే మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున 2.15గంటలకు ప్రమాదం జరగగా.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, పోలీసులు నిందితుల్ని ఎరవాడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి.. అక్కడే చాలాసేపు ఉంచినట్లు తెలుస్తోంది. కొన్ని గంటల వరకు యువకులకు వైద్యపరీక్షలు నిర్వహించలేదని పలువురు ఆరోపిస్తున్నారు. నిందితులకు పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారని మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతకుముందు, పూణే యాక్సిడెంట్ నిందితుడికి పోలీసు స్టేషన్‌లో పిజ్జా, బర్గర్, బిర్యానీ తినిపించారని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.

పన్నెండో తరగతి పరీక్షలు పాస్ అయ్యామన్న ఆనందంలో.. ఆదివారం అర్ధరాత్రి పలువురు బాలురు బార్‌లో మద్యం తాగారు. ఆ తర్వాత అతి వేగంతో పోర్షే కారును నడపడంతో ఇద్దరు టెకీలు ప్రాణాలు కోల్పోయారు. ఈకేసులో యువకుడితో పాటు ఆయన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు.

మరోవైపు మృతుల తల్లిదండ్రులు ఈ కేసు దర్యాప్తు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు, విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. విచారణను మహారాష్ట్రలో కాకుండా బాధితుల స్వస్థలం మధ్యప్రదేశ్ లో జరపాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు.

Next Story
null