ఇండియాలో కరోనా కేసుల నమోదు తీరు..!

by  |

దిశ, వెబ్ డెస్క్ : కరోనా కేసుల నమోదు మందకొడిగా మొదలై ఇప్పుడు వేగాన్ని సంతరించుకున్నది. మన దేశంలో మొదటగా మూడు కేసులు నమోదవ్వగా.. తర్వాత దాదాపు నెల రోజులపాటు ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదు. అటు తర్వాత రోజురోజుకు కేసులు పెరుగుతూ వచ్చాయి. మనదేశంలోకి కరోనా ఎంటర్ అయినప్పటి నుంచి దాని వ్యాప్తి ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం..

ఇండియాలో మొట్ట మొదటి కేసు కేరళలో జనవరి 30న నమోదయింది. చైనాలోని వుహాన్ లో చదువుతున్న విద్యార్థి సెలవుల్లో కేరళలోని స్వగ్రామానికి చేరినప్పుడు ఈ కేసు వెలుగుచూసింది. తర్వాత ఫిబ్రవరి 3వరకు ఇంకో రెండు కేసులు వెలుగు చూశాయి. అవి కూడా.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించిన కేసులే. తర్వాత దాదాపు నెలపాటు ఒక్క కరోనా కేసు కూడా రిపోర్ట్ కాలేదు. మార్చి 2న ఢిల్లీలో ఒకటి తెలంగాణలో ఒకటి చొప్పున రెండు కేసులు నమోదయ్యాయి. ఇక అది మొదలు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

మార్చి 10 నుంచి 20వ తేదీల మధ్య.. 10 రోజుల్లో ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు 50 నుంచి 196కు పెరిగాయి. 25వ తేదీ నాటికి ఈ కేసులు 606కు చేరాయి. అంటే రోజుకు వంద చొప్పున కొత్త కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఆ నెల చివరి వరకు 1,397 కరోనా కన్ఫామ్ కేసులు నమోదయ్యాయి. తర్వాతి ఐదు రోజుల్లోనూ ఈ కేసులు గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ 4 నాటికి దాదాపు 120 శాతం కేసులు హెచ్చి 3,072కు చేరాయి. కాగా, సోమవారం ఉదయానికి (6వ తేదీ) కరోనా బాధితుల సంఖ్య 4,027కు చేరినట్టు కేంద్రం వెల్లడించింది.

రికవరీ సంఖ్య ఆశాజనకం

కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నట్టే దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు 300 మంది కొవిడ్ 19 నుంచి కోలుకున్నారు. కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా 292 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. కరోనా మహమ్మారి వ్యాప్తి వేగానికి అనుగుణంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ మహమ్మారి విస్తరణకు అడ్డుకట్ట వేసేందుకు మూడు వారాల పాటు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కరోనా కోసం ల్యాబ్స్, ఆస్పత్రిలో పడకల సంఖ్యను పెంచుతోంది. అదనంగా ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు కూడా చేస్తున్నది.

Tags: Coronavirus, india, spread, report, cases, recovery, lockdown


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed