'ఎస్‌బీఐ తరహాలో నాలుగైదు పెద్ద బ్యాంకులు ఆర్థిక వ్యవస్థకు అవసరం'

by  |
ఎస్‌బీఐ తరహాలో నాలుగైదు పెద్ద బ్యాంకులు ఆర్థిక వ్యవస్థకు అవసరం
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి పరిస్థితుల్లో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత వేగవంతం చేసేందుకు, అవసరాలను తీర్చేందుకు దేశీయంగా పెద్ద పరిమాణంలో బ్యాంకులు అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. ముంబైలో జరిగిన భారత బ్యాంకుల అసోసియేషన్ 74వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ఆమె.. బ్యాంకింగ్ పరిశ్రమలో పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి, దేశంలోని అన్ని ఆర్థిక కేంద్రాలను కలిపి ఉంచేలా బ్యాంకింగ్ స్థాయిని పెంచాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను వేగవంతం చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తరహా బ్యాంకులు కనీసం నాలుగైదు ఉండాలని తెలిపారు. కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే ఆర్థికవ్యవస్థ రికవరీ మార్గంలోకి పయనిస్తోంది.

ఈ క్రమంలో నగదు చెలామణి కోసం మరిన్ని బ్యాంకులు కావాలని, ఆర్థిక లావాదేవీలు అధికంగా జరిగే అన్ని చోట్ల డిజిటల్, ప్రత్యక్ష బ్యాంకులు ఉండాలని వివరించారు. దేశంలోని ప్రభుత్వ బ్యాంకులన్నిటినీ విలీనం చేయడం ద్వారా పెద్ద బ్యాంకులు ఏర్పడతాయని ఆర్థిక మంత్రి వివరించారు. దేశ ఆర్థికవ్యవస్థ పునర్‌నిర్మాణ దశలో ఉందని, అత్యుత్తమ ఆర్థిక సేవలను అందించడం ద్వారా బ్యాంకులు దీనికి వెన్నెముకగా నిలుస్తాయని ఆమె వెల్లడించారు.


Next Story

Most Viewed