పెగాసస్ రచ్చ.. లోక్‌సభ నిరవధిక వాయిదా

by  |
పెగాసస్ రచ్చ.. లోక్‌సభ నిరవధిక వాయిదా
X

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా జరిగిన లోక్‌సభ సమావేశాలు బుధవారం నిరవధిక వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు ఎప్పట్లానే పెగాసస్‌పై చర్చించాలంటూ నినాదాలు చేయడంతో ప్రారంభమైన కొన్ని నిమిషాలకే లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13వరకు సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ, ప్రతిపక్షాల తీరుతో చర్చకు ఆస్కారం లేనందున రెండు రోజుల ముందుగానే నిరవధిక వాయిదా వేస్తున్నట్టు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. కాగా, గతనెల 19న ప్రారంభమైన లోక్‌సభ సమావేశాలు సెషన్ మొత్తంలో 96 గంటలపాటు సాగాల్సి ఉండగా, కేవలం 21 గంటల 14 నిమిషాలపాటే పనిచేసిందని ఓం బిర్లా స్పష్టం చేశారు. దీంతో లోక్‌సభ సమయం దాదాపు 75గంటలు వృథా అయిందని తెలిపారు. సెషన్ మొత్తంలో బిజినెస్ ప్రొడక్టివిటీ 22శాతమే ఉందని పేర్కొన్నారు. లోక్‌సభలో ఓబీసీ బిల్లు సహా మొత్తం 20 బిల్లులకు ఆమోదం లభించిందని ట్విట్టర్‌లో వివరించారు.

సెషన్ అంతా ‘పెగాసస్’ నినాదాలే

పార్లమెంట్ సమావేశాలకు సరిగ్గా ఒకరోజు ముందు(జూలై 18) ‘పెగాసస్ వ్యవహారం’ వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయిల్‌కు చెందిన ఈ స్పైవేర్‌ను ఉపయోగించి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మేనల్లుడు అభిజిత్ బెనర్జీ, ఉన్నతాధికారులు సహా దాదాపు 300 మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారంటూ ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. దీంతో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు నుంచే ఉభయ సభలు పెగాసస్ నినాదాలతో దద్దరిల్లాయి. ఓబీసీ బిల్లుపై చర్చించిన రోజు(బుధవారం) మినహా ఏ ఒక్కరోజూ చివరివరకు సాగలేదు. పెగాసస్, సాగు చట్టాలు, కొవిడ్‌ నియంత్రణ చర్యలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడం, కేంద్రం ససేమిరా అనడం, దీంతో విపక్ష నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం, వెల్‌లోకి దూసుకురావడం, ఫ్లకార్డులతో నిరసనలు, పేపర్లు చింపి ఆందోళన చేయడం పరిపాటిగా మారింది. ఈ వర్షాకాల సమావేశాల్లో ఆసాంతం వాయిదాల పర్వమే కొనసాగింది. కొవిడ్ విజృంభణ సమయంలో గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన వర్షకాల సమావేశాల్లో లోక్‌సభ 167శాతం బిజినెస్ ప్రొడక్టివిటీ సాధించగా, ఈసారి 22శాతానికే పరిమితమైంది.

చాలా బాధగా ఉంది: ఓం బిర్లా

ఈసారి లోక్‌సభ సమావేశాలు ఆశించిన స్థాయిలో జరగలేదని స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తంచేశారు. సెషన్‌ ప్రతిష్ఠంభనతో ప్రజా సమస్యలపై చర్చ పక్కదారి పట్టడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సభ హుందాగా కొనసాగేందుకు, ప్రజా ప్రయోజనాలు చర్చకు వచ్చేందుకు తాను అన్ని విధాలా ప్రయత్నిస్తుంటానని, కానీ ప్రస్తుతం కొనసాగుతున్న సమావేశాలు అందుకు సహకరించడం లేదని వెల్లడించారు. ప్రతిపక్షాలు లోక్‌సభ వెల్‌లోకి దూసుకురావడం, ప్లకార్డులు పట్టుకోవడం, నినాదాలు చేయడం సభ సంప్రదాయం కాదని అన్నారు. ఈసారి 17రోజులపాటు సాగిన సభలో 13 బిల్లులు ప్రవేశపెట్టగా, గతంలో ప్రవేశపెట్టిన బిల్లులతో కలిపి 20బిల్లులు పాస్ అయ్యాయని వివరించారు.

ప్రజలు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు

లోక్‌సభ నిరవధిక వాయిదా పడటంపై కాంగ్రెస్ స్పందించింది. ప్రతిపక్ష పార్టీల నుండి ఎన్నికైన ప్రతినిధులను ప్రజా ప్రాముఖ్యత ఉన్న సమస్యలను లేవనెత్తడానికి అనుమతించని ప్రభుత్వం దేశానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదని విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ప్రజలకు ఆందోళన కలిగించే ధరల పెరుగుదల, రైతుల నిరసనలు వంటి సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్షానికి అనుమతించలేదని తెలిపారు. సమావేశాల తొలిరోజు నుంచే వీటిపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయని కానీ, వాటిని ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. ఎలాంటి చర్చ లేకుండానే నిమిషాల్లో బిల్లులు పాస్ చేసుకుని ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించిందని ఎద్దేవా చేశారు. సభను ఈ నెల 13వరకు నడపాలని ప్రభుత్వానికి ముందే చెప్పామని, కానీ, ప్రభుత్వం మాత్రం ఆకస్మికంగా బుధవారం ముగించేసిందని విమర్శించారు. నిజాన్ని దాచి, ప్రతిపక్షాన్ని చెడు వెలుగులో నిలపడానికి దొరికిన ప్రతి అవకాశాన్నీ అధికార విజయవంతంగా ఉపయోగించుకుందని తెలిపారు.


Next Story

Most Viewed