మెదక్ జిల్లాకు ఏమైందీ.. ఇలా జరుగుతోందీ ?

by  |
మెదక్ జిల్లాకు ఏమైందీ.. ఇలా జరుగుతోందీ ?
X

దిశ ప్రతినిధి, మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లాలో కొవిడ్ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. ఒకే రోజులో సుమారు 200 పైగా కేసులు నమోదువుతున్నాయి. దీంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. మొదట పట్టణాలకే పరిమితమైన వైరస్ ప్రస్తుతం పల్లెల్లోనూ విజృంభిస్తోంది. ఫలితంగా గ్రామాల్లోనూ బాధితుల సంఖ్య ఎక్కువవుతోంది. శుక్రవారం విడుదలయిన బులెటిన్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 192 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కరోనా వైరస్ ఉమ్మడి మెదక్ జిల్లాలో అంతకంతకూ పెరుగుతోంది. ప్రతి రోజూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడమే తప్పా తగ్గడం లేదు. అదే రీతిలో మృతుల సంఖ్య సైతం పెరుగుతోంది. మొదటగా పట్టణ ప్రాంతాలకే పరిమితమైన పాజిటివ్ కేసులు ప్రస్తుతం పల్లెల్లోనూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒకే రోజు 226 కోవిడ్ కేసులు నమోదవ్వగా, శుక్రవారం ఉదయం ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 192 మందికి వైరస్ సోకింది. ఇది కేవలం అధికారిక లెక్కలు మాత్రమే వాస్తవానికి బాధితుల సంఖ్య మరింత ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల్లో సంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిస్తే, సిద్దిపేట జిల్లా రెండో స్థానం, మెదక్ జిల్లా మూడో స్థానంలో ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 226 కేసులు నమోదుయ్యాయి. ఉమ్మడి జిల్లాలో మృతుల సంఖ్య 156 కాగా, 211 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 4127 మంది బాధితులు ఉండగా, అనధికార లెక్కల ప్రకారం పాజిటివ్ కేసుల సంఖ్య సుమారు 7వేలు దాటిందని సమాచారం.

గురువారం, శుక్రవారం ఉదయం ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ఆధారంగా..

సిద్దిపేట జిల్లాలో 179 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జిల్లాలో వైరస్‌తో 20 మంది మృతి చెందారు. వీటిలో సిద్దిపేట అర్బన్ మండలంలో 36 మంది, దుబ్బాక, వర్గల్‌లో 13 చొప్పున కేసులు నమోదయ్యాయి. గజ్వేల్‌లో ఏడుగురు, సిద్దిపేట గ్రామీణం, కొమురవెల్లి, చిన్నకోడూరులో ఐదుగురు చొప్పున, జగదేవపూర్, మిరుదొడ్డి, చేర్యాల, కొండపాకలో నలుగురు చొప్పున, నంగునూరు, తొగుటలో ముగ్గురు, హుస్నాబాద్ , కోహెడ, మద్దూరు, రాయపోల్ లో ఇద్దరు, దౌల్తాబాద్, ములుగులో ఒక్కొరు చొప్పున వైరస్ బారిన పడ్డారు. వర్గల్ మండలంలోని వేలూరులో ఓ మహిళ కరోనాతో మృతిచెందింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామంలో నెల రోజుల క్రితం కేవలం ఒక్క కేసు నమోదు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య రెండంకెలు దాటింది. 15 రోజులు‌గా ప్రతి రోజూ గ్రామంలో రెండు నుంచి మూడు కేసులు నమోదు కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

మెదక్ జిల్లాలో 84 మందికి వైరస్ సోకింది. ఇప్పటివరకు జిల్లాలో 504 మందికి కరోనా సోకగా, 311 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ఆస్పత్రిలో 15 మంది చికిత్స పొందుతున్నారు. 158 మంది కరోనా నుంచి కోలుకోగా 16 మంది మృతి చెందారు. ఈ రెండు రోజుల్లో జిల్లా కేంద్రంలోని తారకరామనగర్ కాలనీకి చెందిన 57 ఏండ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందగా.. నర్సాపూర్ పట్టణంలో పదినెలల చిన్నారితో పాటు మరో నలుగురికి కరోనా సోకింది. వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. ఇక జిల్లా కేంద్రంలో 12 మందికి, రామాయంపేటలో ఆరుగురు, పాపన్నపేటలో ముగ్గురు, కొల్చారంలో నలుగురు, వెల్దుర్తిలో ఇద్దరు, తూప్రాన్, నార్సింగి మండలాల్లో ఒక్కొక్కరు, కౌడిపల్లిలో నలుగురు, చేగుంటలో ముగ్గురు, హవేళిఘణపూర్‌లో నలుగురు వైరస్ బారిన పడ్డారు. కలెక్టరేట్‌లో 38 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా ఇద్దరు ఉద్యోగులకు పాజిటివ్ అని తేలింది.

సంగారెడ్డి జిల్లాలో 185 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో 159, పటాన్‌చెరులో 136 మంది నమూనాలు సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపారు. కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చెందొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

Next Story

Most Viewed