రియల్ ఎస్టేట్‌ రంగంపై కరోనా ఎఫెక్ట్

by  |
రియల్ ఎస్టేట్‌ రంగంపై కరోనా ఎఫెక్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని రంగాలు కరోనా వైరస్ వ్యాప్తితో చిన్నాభిన్నమవుతున్నాయి. ప్రధానంగా ఉత్పాదక రంగంపై విపరీతంగా ఉంది. దాంతో పాటు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇప్పుడప్పుడే కోలుకోకుండా చేసింది. రూ.వేల కోట్ల లావాదేవీలకు వీలుండే ఈ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కరోనా వైరస్ బారీన పడి ఎన్నో కుటుంబాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అలాగే ప్రతి అంశం కరోనాతోనే ముడిపడిపోయింది. ధరల పెరుగుదల, తగ్గుదల, ఉత్పాదక శక్తిపై ప్రభావం వంటి అంశాల గురించి మాట్లాడుకోవాలంటే కొవిడ్ సెకండ్ వేవ్ ప్రామాణికంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నది కూడా రియల్ ఎస్టేట్ రంగమే. అలాంటి దానిపై కొవిడ్ దుష్ప్రభావం అంతా ఇంతా కాదు. ఎప్పుడు కోలుకుంటుందో కూడా చెప్పడం కష్టంగా మారింది.

ప్రతి ఒక్కరూ ఆర్థికంగా నిలదొక్కుకోవడం ద్వారానే తిరిగి భవన నిర్మాణ రంగం పూర్వవైభవం పొందుతుందంటున్నారు. జాతీయ స్థాయిలో లాక్ డౌన్ ఎత్తేసినా కార్మికులను, మెటీరియల్‌ను సమకూర్చుకునేందుకు రియల్ ఎస్టేట్ రంగానికి కొన్ని నెలల పాటు సమయం పడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో నిర్మాణ రంగానికి లాక్ డౌన్ నుంచి వెసులుబాటు కల్పించాయి. కానీ కార్మికులు వారి సొంతూర్లకు వెళ్లిపోయారు. అన్ని ప్రధాన నగరాల్లో ఈ సమస్య ఉంది. మొదటి వేవ్ కరోనాతోనే సప్లయి చైన్ తెగిపోయింది. రెండో వేవ్ తోనూ లాక్ డౌన్ విధింపునతో మరింత సమస్య తలెత్తింది. నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడిందని క్రెడాయ్ అభిప్రాయపడింది. ప్రాజెక్టులను నిర్ధిష్ట సమయంలో పూర్తి చేయకపోతే రెరా నిబంధనలను ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తారు. ర్యాపిడ్ వాక్సినేషన్‌తోనే కరోనా వైరస్ వ్యాప్తి, మరణాల రేటు తగ్గుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టుల సైట్లకు తిరిగి కార్మికులు రావాలంటే అదొక్కటే మార్గంగా చెప్పారు.

మొదటి వేవ్ పరిస్థితుల ప్రభావ అనుభవంతో రెండో వేవ్ నుంచి కోలుకోవడానికి కనీసం 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని క్రెడాయ్ స్పష్టం చేసింది. రుణాలపై కనీసం ఆరు నుంచి 12 నెలల పాటు మారటోరియం విధించాలని అభ్యర్థిస్తోంది. టైర్ 1 సిటీల కింద ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగుళూరు, ముంబాయి, పూణె, చెన్నై, హైదరాబాద్, కోల్ కత్తాల్లో సర్వే చేశారు. అలాగే టైర్ 2 కింద 102 పట్టణాలు, టైర్ 3 కింద 214 పట్టణాలను తీసుకున్నారు. మే 24 నుంచి జూన్ మూడో తేదీ వరకు అధ్యయనం చేశారు. 13 వేల శాంపిళ్ల ద్వారా నివేదికను రూపొందించారు. 12 ప్రశ్నలతో సర్వే చేశారు. దీన్ని బట్టి అన్ని ప్రధాన నగరాల్లోనూ రియల్ ఎస్టేట్ పై తీవ్ర ప్రభావం పడినట్లు తెలుస్తోంది. దానికి తోడు పెరిగిన ధరలు కూడా అగాధంలోకి నెట్టేసినట్లు స్పష్టమవుతోంది.

అధ్యయనం ఫలితాలివే

– సైట్స్ దగ్గర కార్మికుల కొరత సమస్యను ఎదుర్కొంటున్నట్లు 92 శాతం మంది డెవలపర్స్ చెప్పారు.
– సెకండ్ వేవ్ తో 50 శాతం కార్మికులతోనే పనులు చేయిస్తున్నట్లు 83 శాతం.
– ప్రాజెక్టులు పూర్తి చేయడంలో ఆలస్యమవుతుందని 95 శాతం డెవలపర్స్ భావిస్తున్నారు.
– నిర్మాణ రంగంలో ఖర్చులు 10 శాతానికి పైగా పెరిగినట్లు 88 శాతం డెవలపర్స్ అభిప్రాయపడ్డారు.
– నిర్దిష్ట సమయంలో ప్రాజెక్టు అప్రూవల్స్ రావడం లేదని 82 శాతం మంది ప్రకటించారు.
– ప్రాజెక్టు ఫైనాన్స్, రుణాల విషయంలో ఇబ్బందులు పడుతున్నట్లు 77 శాతం డెవలపర్స్ తెలిపారు.
– వినియోగదారుల నుంచి అమౌంట్ రావడం లేదని 85 శాతం అభిప్రాయం.
– ప్రాజెక్టుల సందర్శనకు వచ్చే వినియోగదారుల సంఖ్య తగ్గిపోయిందని 98 శాతం బిల్డర్లు తెలిపారు.
– 75 శాతానికి పైగానే కస్టమర్ల ఎంక్వయిరీలు పడిపోయినట్లు 42 శాతం మంది అభిప్రాయం.
– సెకండ్ వేవ్ తో వినియోగదారులు కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు 95 శాతం మంది చెప్పారు.
– రుణాల మంజూరు, కస్టమర్ల హోం లోన్స్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు 69 శాతం మంది డెవలపర్స్ చెప్పారు.
– సెకండ్ వేవ్ కరోనాతో రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని 90 శాతం మంది అభిప్రాయపడుతున్నారు.
– స్టాంప్ డ్యూటీ మాఫీ చేయాలని, తగ్గించాలని 78 శాతం మంది డెవలపర్స్ కోరుతున్నారు.
– జీఎస్టీ తగ్గించడం వల్ల ప్రాజెక్టులకు ఆర్ధిక వెసులుబాటు లభిస్తుందని 75 శాతం విన్నపం.
– లోన్ రీస్ట్రక్చరింగ్ చేయడం వల్ల డెవలపర్స్ కు మేలు కలుగుతుందని 75 శాతం చెప్పారు.
– సిమెంటు, స్టీలు, అల్యూమినియం, కాపర్, పీవీసీ, ప్లాస్టిక్ ధరలు పెరిగాయి.
– ప్రాజెక్టుల అప్రూవల్స్, వర్క్ కమెన్స్మెంట్ లకు సింగిల్విండో విధానంలో చేయడం ద్వారా ప్రాజెక్టులు నిర్ధిష్ట సమయంలో పూర్తి చేసేందుకు దోహదపడుతుందన్నారు.

జాతీయ స్థాయి, తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితి

1. కార్మికుల కొరత సమస్యను ఎదుర్కొంటున్నారా?
– అవును: 92 శాతం(91 శాతం), కాదు: 8 శాతం(9 శాతం)

2. సెకండ్ వేవ్ తర్వాత పనికొస్తున్న కార్మికులు?
25 శాతం లోపు: 43 శాతం(41 శాతం)
25 నుంచి 50 శాతం లోపు: 40 శాతం(37 శాతం)
50 నుంచి 75 శాతం లోపు: 14 శాతం(19 శాతం)
75 శాతానికి పైగా: 3 శాతం(3 శాతం)

3. సెకండ్ వేవ్ తర్వాత ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఆలస్యమవుతుందా?
అవును: 95 శాతం(96 శాతం), కాదు: 5 శాతం(4 శాతం)

4. నిర్మాణ రంగంలో మెటీరియల్, లేబర్ కాస్ట్ ఎంత శాతం పెరిగింది?
5 నుంచి 10 శాతం: 12 శాతం(8 శాతం)
10 నుంచి 20 శాతం: 45 శాతం(41 శాతం)
20 శాతానికి పైగా: 12 శాతం(51 శాతం)

5. అనుమతులు నిర్ధిష్ట సమయంలో వస్తున్నాయా?
అవును: 18 శాతం(20 శాతం)
కాదు: 82 శాతం(80 శాతం)

6. రుణాల చెల్లింపుల్లో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా?
అవును: 77 శాతం(56 శాతం)
కాదు: 23 శాతం(20 శాతం)

7. వినియోగదారుల నుంచి సక్రమంగా పేమెంట్స్ వస్తున్నాయా?
వస్తున్నాయి: 15 శాతం(16 శాతం)
లేదు: 85 శాతం(84 శాతం)

8. సెకండ్ వేవ్ తర్వాత వినియోగదారుల రాక ఎంత పడిపోయింది?
25 నుంచి 50 శాతం: 29 శాతం(29 శాతం)
50 నుంచి 75 శాతం: 27 శాతం(22 శాతం)
75 శాతానికి పైగానే: 42 శాతం(49 శాతం)
వినియోగదారుల రాక తగ్గలేదు: 2 శాతం(1 శాతం)

9. వినియోగదారులు కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారా?
అవును: 95 శాతం(92 శాతం)
కాదు: 5 శాతం( 8 శాతం)

10. వినియోగదారులకు రుణాలు మంజూరు కావడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా?
అవును: 69 శాతం(74 శాతం)
కాదు: 28 శాతం(25 శాతం)
వర్తించదు: 3 శాతం(1 శాతం)

11. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారంపై అత్యధిక ప్రభావం పడిందా?
అవును: 90 శాతం(90 శాతం)
లేదు: 10 శాతం(10 శాతం)

12. వ్యాపారానికి ఎలాంటి రిలీఫ్ కావాలి?
స్టాంపు డ్యూటీ మాఫీ: 78 శాతం(71 శాతం)
లోన్ రీస్ట్రక్చరింగ్: 66 శాతం(65 శాతం)
జీఎస్టీ మాఫీ: 75 శాతం(78 శాతం)

నెల గడిస్తేనే ఫలితం:

కరోనా వేవ్ 1, 2 లతో రియల్​ఎస్టేట్ రంగంపై ఎంత ప్రభావం పడిందన్న విషయం మరో నెల గడిస్తేనే చెప్పగలం. వేవ్​1 నుంచి హైదరాబాద్​మార్కెట్​త్వరగానే కోలుకున్నది. ఇప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేం. ఐతే కొనుగోలుదార్లు ముందుకు రావాలంటే కరోనా వైరస్​వ్యాప్తి తగ్గాల్సిందే. ఎవరైనా సైట్​విజిట్​చేయకుండా కొనుగోలు చేయరు. గతంలో లాక్​డౌన్​పీరియడ్​చాలా ఎక్కువ. ఇప్పుడు చాలా తక్కువే. పైగా నిర్మాణ రంగంలో పని చేసేందుకు అనుమతిచ్చారు. కార్మికులు పెద్దగా వెళ్లపోలేదు. అందుకే పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఏదైనా క్వాలిటీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కారు కొనడం లగ్జరీ కిందికి వస్తుంది. కానీ ఇల్లు అనేది కనీస అవసరం. అందుకే రియల్​ఎస్టేట్​రంగం త్వరగానే కోలుకుంటుంది. -పి.శ్రీనివాస్​రెడ్డి, డైరెక్టర్, రాజపుష్ప బిల్డర్స్​

వినియోగదారులను ప్రోత్సహించాలి:

దేశ వ్యాప్తంగా రియల్​ఎస్టేట్​బాగా పడిపోయింది. ఐతే తెలంగాణలో కొంత బెటర్. ఇక్కడా అమ్మకాలు పడిపోయాయి. కానీ నిర్మాణాలు ఆగలేదు. ప్రభుత్వం వినియోగదారులను ప్రోత్సహించాలి. స్టాంప్ డ్యూటీని 2 లేదా 3 శాతానికి తగ్గించాలి. నిర్ధిష్ట కాల పరిమితిలో కొనేవారికి ఈ ఛాన్స్​ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. 6 నుంచి కాస్త తగ్గించడం వల్ల ఎంతో రిలీఫ్​ఉంటుంది. మహారాష్ట్రలో స్టాంపు డ్యూటీ తగ్గించడం ద్వారా రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ఎలాగూ బ్యాంకులు హోం లోన్లకు కనీస వడ్డీ 6.5 శాతంగా వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సహించడం వల్ల మేలు కలుగుతుంది. సంక్షోభ సమయంలో రియల్​ఎస్టేట్ రంగానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వానికి కూడా మేలు కలుగుతుంది. -జి.రాంరెడ్డి, నేషనల్​వైస్​ప్రెసిడెంట్, క్రెడాయ్​


Next Story

Most Viewed