గోదావరిఖనిలో జోరుగా కల్తీ మద్యం.. అక్రమ సిట్టింగులు

by  |
గోదావరిఖనిలో జోరుగా కల్తీ మద్యం.. అక్రమ సిట్టింగులు
X

దిశ, గోదావరిఖని : ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా గోదావరిఖని పట్టణంలో కొందరు అక్రమ సిట్టింగులు ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. వీటి ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అయినా కూడా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు సంబంధిత శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా తనిఖీలు జరపలేదు. కనీసం ఒకటి రెండు కేసులు నమోదు చేసిన దాఖలాలు కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ సిట్టింగుల వెనక సంబంధిత అధికారులకు భారీ ఎత్తున ముడుపులు అందాయని తెలుస్తోంది.

గోదావరిఖని పట్టణంలోని పలు ప్రాంతాల్లో బెల్టు షాపులు ఏర్పాటు చేసి అక్రమ సిట్టింగులు నిర్వహించడం వలన ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటిపై పలు చోట్ల ఫిర్యాదులు వచ్చినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఆయా కాలనీల్లో మందు బాబుల సృష్టిస్తున్న వీరంగం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కొందరు కల్తీ మద్యాన్ని తయారుచేసి విక్రయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని పలు కాలనీలలో నిర్వహిస్తున్న బెల్టు షాపులు సంబంధిత అధికారులకు కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సాధారణ ప్రజలు కోరుతున్నారు.


Next Story