గోదావరి నదుల నుంచి తోడేస్తున్నారు..!

by  |
గోదావరి నదుల నుంచి తోడేస్తున్నారు..!
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక దందా జోరుగా సాగుతోంది. గోదావరి, స్వర్ణ నదుల నుంచి అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. సమీప ప్రాంతాల్లో డంపులు పోస్తున్నారు. తర్వాత వాటిని పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.. పోలీసు, రెవెన్యూ అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. గోదావరి, స్వర్ణ పెనుగంగ ప్రాణహితతో పాటు చిన్నా, పెద్ద వాగులు వొర్రెలు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. మైనింగ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే.. అక్రమ తవ్వకాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. గోదావరి స్వర్ణ నదీ పరివాహక ప్రాంతాల్లో పెద్దఎత్తునా ఇసుక తవ్వకాలు చేస్తోండగా.. వీటికి నదీ పరివాహక గ్రామాల గ్రామాభివృద్ధి కమిటీల టెండర్లు వేలంపాట నిర్వహించి డబ్బులు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిర్మల్ జిల్లాలోని గోదావరి నదిపై బాసర, ముధోల్, లోకేశ్వరం, నర్సాపూర్, దిలావర్పూర్, సోన్, నిర్మల్ రూరల్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్ మండలాల్లో.. స్వర్ణవాగుపై సారంగాపూర్, సోన్, నిర్మల్ రూరల్ మండలాలలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు.

ట్రిప్పర్‌కు 13వేలు.. ట్రాక్టర్‌కు 5వేలు..

స్వర్ణ గోదావరి నదుల పరివాహక ప్రాంత గ్రామాల్లో కొందరు యంత్రాలతో ఇసుకను తవ్వి సమీప ప్రాంతాల్లో డంపులు చేస్తున్నారు.. అక్కడి నుంచి వేరే వారు టిప్పర్లలో పట్టణాలకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ.3వేల వరకు అవుతుండగా రూ.6వేల చొప్పున టిప్పర్ విక్రయిస్తున్నారు. డంప్ సెంటర్ల నుంచి తీసుకెళ్లిన వారు పట్టణాల్లో టిప్పర్ ఇసుకకు రూ.12-13 వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతాన పట్టాభూముల పేరిట ఇసుక దందా సాగిస్తున్నారు. పట్టాదారులకు డ్రైవర్ల ఒక్కో ట్రాక్టర్‌కు రూ.వెయ్యి లేబర్ కు రూ.వెయ్యి చొప్పున చెల్లించి బయట మార్కెట్లో రూ.4-5 వేల చొప్పున విక్రయిస్తున్నారు. యంత్రాల సువ్వీ లేబర్‌తో ఇసుక ట్రాక్టర్లు నింపి బయటకు పంపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పట్టా భూముల్లో అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నా.. అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.

ఫిర్యాదు చేసినప్పుడే హడావుడి…

జిల్లాలో స్వర్ణ, గోదావరితోపాటు ఇతర వాగులు నదులపై అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నా.. పోలీస్, రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేసిన సమయంలో మాత్రమే దాడులు చేసి పట్టుకున్నారు. ఇటీవల మామడ మండలం ఆదర్శనగర్ కొత్తూరు వద్ద పెద్ద ఎత్తున ఇసుక డంపులు ఉన్నాయనే విషయాన్ని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో దాడులు చేసి పట్టుకుని రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించారు. ఈ ఇసుక డంపులను డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం వినియోగించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ నెల 7-9వరకు పది వాహనాలకు మాత్రమే ఇసుక తరలించేందుకు అనుమతి ఇచ్చారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Next Story

Most Viewed