అక్రమ దందాలకు కేరాఫ్ గా 'చిట్యాల'.. గుప్పుమంటున్న గుట్కా, గుడుంబా

by  |
chityala news
X

దిశ, చిట్యాల: అక్రమ దందాలను అరికట్టాల్సిన అధికారులే వాటికి కొమ్ముకాస్తున్నారు. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల వ్యాప్తంగా అక్రమ దందాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా నవాబుపేట, కాల్వపల్లి వాగుల నుంచి అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. జూకల్ కేంద్రంగా దొడ్డు బియ్యం దందా, చిట్యాల, నైన్ పాక లో గుట్కా దందా, ప్రతి గ్రామంలో గుండుబా అమ్మకాలకు అడ్డు అదుపులేకుండా పోతుంది. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు దాడులు జరిపిన దాఖలాలు కనిపించడంలేదు. ఇక గుట్కా వ్యాపారాన్ని అడ్డుకున్న నాధుడే లేదు. యథేచ్ఛగా షాపుల్లో విక్రయాలు చేపడుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.

అర్ధరాత్రి అక్రమ బియ్యం, ఇసుక దందా..

అర్ధరాత్రి అక్రమ బియ్యం, ఇసుకదందా వ్యాపారం జోరుగా నడుస్తున్నాయి. దొడ్డు బియ్యం వ్యాపారానికి గ్రామస్థాయిలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మరీ దందాను”రారాజు”కొనసాగిస్తున్నాడు. మరోవైపు కాల్వపల్లి, నవాబుపేట చలి వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా ఇసుక రవాణా యథేచ్ఛగా జరుగుతుంది. దీనిపై రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

పల్లెల్లో గుప్పుమంటున్న గుడుంబా..

చిట్యాల మండల వ్యాపంగా గుడుంబా గుప్పుమంటుంది..పల్లెల్లో గుడుంబా విచ్చలవిడిగా లభిస్తుండడంతో నాటుసారా వ్యసనపరులు పండుగ చేసుకుంటున్నారు. అయితే తమ జేబులను గుల్ల చేసుకుని, ఆర్థికంగా, శారీరకంగా నష్టపోతూ చివరికి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. గుడుంబా మహమ్మారి ఇంతలా గ్రామాలను పట్టి పీడిస్తుంటే, సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు స్పందించకపోవడం పట్ల మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో గుట్కా యథేచ్ఛగా విక్రయాలు..

గ్రామీణ ప్రాంతాల్లో గుట్కా విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం వాటిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులకు ప్రతినెలా గుట్కా వ్యాపారులు ముడుపులు చెల్లించి ఈ దందాను కొనసాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గుట్కా వ్యాపారులు, స్థావరాలపై దాడులు జరిగితే కానీ గుట్కా వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేమని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కిరాణా దుకాణాల్లో గుట్టు చప్పుడు కాకుండా గుట్కా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

మామ్ముళ్లతో కాలక్షేపం చేస్తోన్న అధికారులు..

చిట్యాల మండలం రోజురోజుకూ అక్రమ దందాలకు కేరాఫ్ గా మారుతున్నా మామూళ్ల మత్తులో సంబంధిత అధికారులు కాలం వెళ్లదీస్తున్నారు. గుట్కా, ఇసుక, గుడుంబా, బియ్యం వ్యాపారులతో నెలకు రేటు మాట్లాడుకుని అక్రమ దందా కు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేయకపోతే రానున్న రోజుల్లో అక్రమ దందా లకు మరింత ఆజ్యం పోసిన వారుగా అధికారులు మిగిలిపోతారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి అక్రమ దందా లను అరికట్టాలని కోరుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed