నా పుట్టిన రోజున బొకేలు, కేకులు వద్దు.. సేవ చేయండి : కేటీఆర్

by  |
KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ నెల 24న తన పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ పేదలకు సహాయం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు. గతేడాది తన సొంత నిధులతో అంబులెన్సులను అందించిన విధంగానే ఈసారి తాను స్వయంగా 100 త్రిచక్ర వాహనాలను దివ్యాంగులకు అందజేస్తానని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో పాల్గొంటూ కేటీఆర్ జన్మదిన సందర్భంగా తాము సైతం భాగస్వాములం అవుతామని పలువురు రాష్ట్ర మంత్రులు, పార్టీ నాయకులు, అభిమానులు గురువారం ప్రకటించారు.

గతేడాది తాను 6 అంబులెన్సులను ప్రభుత్వానికి అందజేశానని, పార్టీ నాయకులు, శ్రేణులు మరో 100 అంబులెన్సులను తమ వ్యక్తిగత నిధులతో అందజేశారని, ఈ అంబులెన్స్ లు కరోనా సంక్షోభంలో ఉపయుక్తంగా నిలిచాయన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా తమకు తోచిన విధంగా ఇతరులకు సహాయం చేయడంతో పాటు ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమంలో భాగంగా కనీసం ఒక మొక్కను నాటాలని కేటీఆర్ కోరారు. పుష్పగుచ్ఛాలు, కేకులు, హోర్డింగులు ప్రకటనల పైన ఖర్చు చేయకుండా సేవా కార్యక్రమాలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్సీ నవీన్ రావు 100, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి 60 చొప్పున, మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ విప్ 50 చొప్పున, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, గాదరి కిషోర్ 20, త్రిచక్ర వాహనాలను కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని అందించేందుకు ముందుకు వచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, శానంపూడి సైదిరెడ్డి, జీవన్ రెడ్డి పలువురు తమ వ్యక్తిగత స్థాయిలో త్రిచక్ర వాహనాలను అందజేస్తామని తెలిపారు.

పాట ఆవిష్కరణ

మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక పాటను తెలంగాణ భవన్‌లో గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగు మహేందర్, కిషోర్ గౌడ్, పాట డైరెక్టర్ పూర్ణచందర్, నిర్మాత కోణతం లక్ష్మణ్, ప్రణయ్, సంగీత దర్శకుడు బాజీ, రచయిత మానుకోట ప్రసాద్, ఎడిటర్ వెంకీ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

గత మూడ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ కోరారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో గురువారం ఆయన మాట్లాడారు. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రభావం చూపే పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. నిర్మల్ వంటి చోట్ల భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో జరుగుతున్న సహాయక చర్యలపై స్థానిక జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
హైదరాబాద్‌లో మరో రెండ్రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం సహాయ చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పనిచేసే డిజాస్టర్ రెస్పాన్స్ దళం సైతం అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలన్నారు. ఈ వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు పురపాలక శాఖ అధికారులు, ఉద్యోగులు విధుల్లో ఉంటూ స్థానికంగా అందుబాటులో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని పురపాలక శాఖ యంత్రాంగానికి మంత్రి సూచించారు.

పాత భవనాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పౌరులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. అవసరమైతే వారందర్నీ సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.


Next Story

Most Viewed