కంపు కొడుతున్న గ్రేటర్ నగరం..

35

దిశ, తెలంగాణ బ్యూరో :

వానలు, వరదలు తగ్గాయి. మూసీ నది ఉధృతి కూడా తగ్గింది. రెండు రోజుల పాటు నగర ప్రజలకు ఉపశమనం లభించింది. కానీ ఇప్పటికీ వరద ముంపునకు గురైన కాలనీ ప్రజలకు మాత్రం ప్రతీరోజూ నరకమే కనిపిస్తోంది. కరెంటు రాలేదు. నడుము లోతున వరద నీరు ఇంకా నిలిచే ఉంది. సహాయక చర్యలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. సందర్శనకు వచ్చిన ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. తినడానికి తిండి లేదు.. తాగడానికి నీళ్లు లేవు. వరద నీరు ఎప్పుడు పోతుందో తెలియదు. దాన్ని తొలగించడానికి ఇప్పటివరకు పారిశుధ్య సిబ్బంది పనులే మొదలు పెట్టలేదు. నిల్వనీటిని బయటకు తోడేయడం ఇప్పుడు జీహెచ్ఎంసీ ముందున్న అతి పెద్ద సవాలు. ఇప్పటికీ మ్యాన్‌హోల్స్ పొంగి పొర్లుతుండడంతో డ్రైనేజీ కాల్వల్లోకి వదిలే అవకాశం లేదు.

బైటకు తోడేద్దామనుకుంటే తగినంత సంఖ్యలో డ్రెయిన్ ట్యాంకర్లు అందుబాటులో లేవు. ఇరుకైన ఇండ్లతో పాటు అపార్టుమెంట్లలోని ఫ్లాట్ల వరకూ ముంపు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఇప్పటివరకూ గడిచింది ఒక ఎత్తయితే ఇకపైన జరగాల్సింది మరొక ఎత్తుగా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ నీటిని తొలగించిన తర్వాత శుభ్రం చేసుకోవడం, అవసరాలకు తగ్గట్టుగా నిత్యావసర వస్తువులను, సామాన్లను సమకూర్చుకోవడం ప్రజలకు సవాలుగా మారింది. అసలే కరోనా కష్టకాలంలో దినదినగండంగా నెట్టుకొస్తున్న పేద, మధ్యతరగతి ప్రజానీకానికి సమీప భవిష్యత్తు గందరగోళం, అయోమయంగానే ఉంది. కష్టపడి సంపాదించుకున్న ఆహార పదార్ధాల మొదలు కిచెన్ సామాను, ఇంటి వస్తువుల వరకు నీట మునిగాయి.

సమీక్షలకే పరిమితం.. కార్యాచరణ శూన్యం

కాలనీల్లో నిలిచిపోయిన నీటిని మోటారు పంపుసెట్ల ద్వారా డ్రైనేజీ కాలువల్లోకి, మూసీ నదిలోకి, నాలాల్లోకి తరలించాల్సి ఉంటుంది. కానీ ఇంకా పడవల ద్వారా సహాయక చర్యలే జరుగుతున్నాయి. ఈ నీటిని తొలగిస్తే తప్ప ప్రజలకు మరో మార్గం లేదు. అప్పటివరకూ మురుగునీటితో, వ్యర్థాలతో ప్రజలకు శ్వాసపరమైన సమస్యలే కాక అంటురోగాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి బస్తీ స్థాయి వరకు పారిశుధ్య పనులను మొదలుపెట్టాల్సిందిగా సూచించారు. కానీ ఆ పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. మురుగునీటితో ఎన్ని రోజులు ఈ సహావాసమో అనే ఆందోళనలో ఉన్నారు ప్రజలు. వరదనీటితో ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చిన చెత్త, వ్యర్థాలు, ఇండ్ల ముందు పేరుకు పోయాయి. బురద, వాటితో పాటు క్రిమి కీటకాలు కూడా ఉన్నాయి. విషజ్వరాలు సోకే అవకాశం ఉందని పురపాలక శాఖ కార్యదర్శి ఇప్పటికే హెచ్చరించారు. ఇండ్లలోకి చేరిన నీటితో ఆహార ధాన్యాలు తడిచి పాడుకావడంతో కొన్ని పేదల కుటుంబాలు వాటినే బైటకు తీసి నీటితో కడిగి వినియోగిస్తున్నారు. మురుగునీటి తొలగింపు చర్యలు ప్రణాళికాబద్ధంగా జరగితే తప్ప మళ్ళీ సాధారణ జీవితం మొదలయ్యే అవకాశం లేదు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాన తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలు ఇంకా మొదలే కాకపోవడం గమనార్హం.

పొంగి పొర్లుతున్న మ్యాన్ హోల్స్..

నగరంలోని ప్రధాన రహదారుల్లో, బస్తీల్లో, కాలనీల్లో ఇప్పటికీ చాలా చోట్ల మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటిదాకా ఉన్న వరదనీటికి తోడు ఇప్పుడు ఈ మురుగు నీరు కూడా చేరుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీల్లోకి ప్రవహిస్తోంది. 1400 మ్యాన్ హోల్స్‌కు మరమ్మతులు చేస్తున్నామని జలమండలి చెప్తోంది. పొంగిపొర్లుతున్న చోట అక్కడక్కడా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కానీ ఆ మురుగునీరు బస్తీల్లోకి పోకుండా నివారించడానికి మాత్రం ఎలాంటి చర్యలు లేవు. మ్యాన్ హోల్స్ నుంచి వచ్చిన మురుగు నీటితో దుర్వాసన, దోమలు చేరుతున్నాయి. ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి.

బస్తీల్లో నిలిచిపోయిన నీటిని కొన్ని చోట్ల ట్యాంకర్ల ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నాలు కూడా మొదలుకాలేదు. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 1400 బస్తీలున్నాయి. వరదనీటిని యుద్ధప్రాతిపదికన తొలగించాల్సి ఉంది. ముషీరాబాద్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఖైరతాబాద్, నాంపల్లి, గోషామహాల్ ప్రాంతాల్లోని బస్తీలు మూడో రోజున కూడా వరద నీటిలోనే ఉన్నాయి. ఈ కాలనీల్లో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా దోమల వ్యాప్తి నిరోధానికి రసాయనాల పిచికారీ కూడా జరగడంలేదు. నీరు తగ్గిపోయి బురద ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్‌ను చల్లడమూ లేదు. క్లోరిన్ నీటి సరఫరా వంటివి కూడా మొదలుకాలేదు. పాడైన నిత్యావసర సరుకులు, ఆహారధాన్యాలు కోల్పోయిన కుటుంబాలకు సరుకులు అందించే చర్యలు లేవు.

జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం నగరంలో టోలీచౌక్ సమీపంలోని నదీమ్ కాలనీలో ఇప్పటికీ 12 అడుగుల ఎత్తు మేర నీరు నిలిచిఉంది. నగరంలో 77 చోట్ల ఒక అడుగు నుంచి మూడు అడుగల మేర నీరు నిలిచి ఉంది. జామ్‌బాగ్‌లోని గణేశ్ మందిర్, చుడీ బజార్ తదితర ప్రాంతాల్లో ఇంకా పది అడుగుల మేర నీరు ఉంది. జుబెయిల్ కాలనీలో మూడున్నర అడుగుల మేర వరద నీరు నిలిచే ఉంది. నగరంలో మొత్తం 72 చోట్ల 144 కాలనీల్లో 20,540 ఇండ్లలోకి నీరు చేరింది. సుమారు 35 వేల కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఎల్బీ నగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్ల పరిధిలో ఇలాంటి ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 14 ఇళ్ళు పూర్తిగా దెబ్బతినగా 65 పాక్షికంగా దెబ్బతినట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు.