హుజురాబాద్‌లో ‘కారు’ ఓవర్ లోడ్.. టీఆర్ఎస్ వ్యూహాలు ఫలించాయా.?

by  |
హుజురాబాద్‌లో ‘కారు’ ఓవర్ లోడ్.. టీఆర్ఎస్ వ్యూహాలు ఫలించాయా.?
X

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో అధికార టీఆర్ఎస్ పార్టీ వేస్తున్న ఎత్తుగడలతో కిటకిటలాడిపోతోంది. సామర్థ్యానికి మించిన నాయకులు కారు ఎక్కేస్తున్నారు. ఐదు నెలలుగా ఇదే తంతు కొనసాగుతుండటంతో ప్రత్యర్థి పార్టీల్లో కేవలం కేడర్ మాత్రమే మిగిలింది. ప్రధానంగా మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటలతో కలిసి తిరిగిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులందరి భుజాలపై గులాబీ కండువాలు కప్పేశారు. ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన వెంటనే టీఆర్ఎస్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది.

ఈటలకు మద్దతుగా ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కట్టడి చేసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అన్నీ తామై ఆయన్ను ఒంటరి చేశారు. మొదట్లో రంగనాయక్ సాగర్ కేంద్రంగా మంత్రాంగం నడిపిన ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు గత రెండు నెలలుగా రంగంలోకి దిగారు. హుజురాబాద్ నియోజకవర్గాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోవాలనే లక్ష్యంతో ఈటల వీరాభిమానులను కూడా టీఆర్ఎస్‌లో చేర్పించుకోవడంలో హరీష్ రావు సక్సెస్ అయ్యారు.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత టీఆర్ఎస్ మరింత వేగం పెంచింది. ఏ ఒక్క చిన్న అవకాశం కూడా వదులుకోకుండా టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కించింది. దీంతోపాటు చేరికలను ప్రోత్సహిస్తూ ప్రత్యర్థి పార్టీల ఉనికి లేకుండా చేయాలని సంకల్పించింది. ఓ వైపున కుల సమ్మేళనాలు, మరోవైపు ధూమ్ ధామ్ కార్యక్రమాలు చేపడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీబిజీ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే వివిధ పార్టీల నాయకుల చేరికలతో ‘కారు’ నిండి ఓవర్ లోడ్ అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ స్థానిక నాయకులు ఇతర పార్టీల్లో పలుకుబడి ఉన్న కార్యకర్తలను, తటస్తులను కూడా వదలిపెట్టవద్దని భావిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాల వారీగా డాటా సేకరించిన టీఆర్ఎస్ నాయకులు ఓటు బ్యాంకు ఉన్న ప్రతీ ఒక్కరిని గులాబీ గూటికి చేర్చాలన్న కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.

బీజేపీ అభ్యర్థి ఈటలకు అనుకూలంగా ఉన్న కార్యకర్తల బలాలు, బలహీనతలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నయానో భయానో తమ పార్టీకి అనుకూలంగా మలుచుకుంటున్నారు టీఆర్ఎస్ ముఖ్యనాయకులు. ఈటల వెంట టీఆర్ఎస్ కేడర్ లేకుండా చేసిన వీరు.. ఇతర పార్టీల నాయకులను వదిలిపెట్టడం లేదు. అయితే, 18 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలతో మమేకమైన ఈటలను.. అభిమానులకు ఎంత మేరకు దూరం చేసామన్న ప్రశ్న టీఆర్ఎస్ అధిష్టానాన్ని వెంటాడుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు నియోజకవర్గ పరిధిలో ప్రచారాన్ని ఉధృతం చేస్తుండగా, ఈటల దంపతులు ఒంటరి పోరాటం చేస్తూ ప్రజల సానుభూతి పొందుతూ ముందుకు సాగుతున్నారు.

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి హుజురాబాద్‌లో మకాం పెట్టి సంఘ్ పరివార్‌తో సమీకరణాలు జరుపుతున్నారు. అడపా దడపా బీజేపీ నేతలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నప్పటికీ, బీజేపీకి చెందిన పలువురు స్థానిక నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని ఈటలకు షాక్ ఇస్తున్నారు. బీజేపీ సీనియర్ కేడర్‌కు, ఈటలకు మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ ఆయన మాత్రం కార్యక్షేత్రంలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మిగిలిన అభ్యర్థులు బీజేపీ, టీఆర్ఎస్‌లలో ఏ పార్టీకి నష్టం కల్గిస్తారో అనే చర్చ సాగుతుండగా, దసరా పండుగ ముగిసిన తర్వాత ప్రచార వ్యూహాలకు మరింత పదును పెట్టేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు స్టార్ క్యాంపేయినర్లను రంగంలోకి దించనున్నాయి.

సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య బీజేపీ, టీఆర్ఎస్ హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహిస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ 14 రోజుల్లో నియోజక వర్గంలోని అన్ని గ్రామాలలో పర్యటించగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌కు 30 వేలకు పైగా ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ అభ్యర్థి ఎంపికలో జాప్యం కారణంగా నియోజకవర్గానికి చెందిన నాయకులు బీజేపీ, టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ మనోగతాన్ని బహిర్గతం చెయలేకపోతున్నారు. దీంతో ఎవరికి వారు తమకే సర్వేలు అనుకూలమని చెబుతున్నా అంతర్గతంగా ఆందోళన చెందుతున్నారు. ఓటింగ్ పూర్తయ్యే వరకు కూడా గెలుపోటములను అంచనా వేయలేని పరిస్థితి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.


Next Story