పొలిటికల్ పార్టీలకు వరంగా మారిన ఎన్నికల కోడ్.. ఎందుకంటే..?

by  |
పొలిటికల్ పార్టీలకు వరంగా మారిన ఎన్నికల కోడ్.. ఎందుకంటే..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఎన్నికల కోడ్ హుజూరాబాద్ నియోజకవర్గానికే పరిమితం కావడం పొలిటికల్ పార్టీలకు వరంగా మారిందా? ప్రచారం చేసుకునేందుకు ఇరుగుపొరుగు సెగ్మెంట్లు వేదికగా మార్చుకునే వెసులుబాటు లభించినట్టయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు రాజకీయ పార్టీలు కూడా ఇదే అవకాశాన్ని ఆసరాగా తీసుకుంటున్నాయి. మొదట్లోనే ఎన్నికల కమిషన్ కోడ్ జిల్లా వ్యాప్తంగా ఉంటుందని ప్రకటించినప్పటికీ, ఆ తరువాత ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గం వరకే అమల్లో ఉంటాయని ప్రకటించడం వారికి వరంగా మారిందనే చెప్పాలి.

అటు ఎన్నికల నిబంధనలు, ఇటు కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన నిబంధనలు కూడా విధిగా అమలు చేయాలని ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌లో స్పష్టం చేసింది. స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చినా.. వెయ్యి మంది మించరాదన్న నిబంధనతో పాటు ర్యాలీలు, రోడ్ షోలు వంటి వాటిని నిషేధించింది. కేవలం సమావేశాలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. దీంతోపాటు ఆయా సమావేశాలకు హాజరయ్యే వారి వివరాలను రిజిస్టర్ చేయాలని కూడా ఆదేశించింది. కఠినమైన ఈ నిబంధనలను అమలు చేస్తూ ప్రచారం చేయడం ఎలా అనుకున్న పార్టీలకు ఎన్నికల కోడ్ కేవలం హుజూరాబాద్ నియోజకవర్గం వరకే అమల్లో ఉంటుందని ప్రకటించడంతో జాక్ పాట్ కొట్టినంత పనైందనే చెప్పాలి.

పక్క ప్రాంతాలపై..

హుజూరాబాద్‌లో అయితే ఎన్నికల కమిషన్ నిఘా ఉంటుంది.. కానీ, పక్కా నియోజకవర్గాల్లో అలాంటి రూల్స్ అమలు చేసే అవకాశం లేదు కదా అని భావించిన రాజకీయ పార్టీలు భారీ సభలను సరిహద్దు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు. హుజూరాబాద్ సమీపంలోనే పెంచికల్ పేట గ్రామమే వేదికగా తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది టీఆర్‌ఎస్ పార్టీ. శనివారం నుంచే ఈ గ్రామంలో హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. నూతనంగా ఆవిర్భవించిన హన్మకొండ జిల్లాలో ఈ గ్రామం చేరడంతో పాటు హుస్నాబాద్ నియోజవకర్గంలో ఉండడం వీరికి కలిసి వస్తోంది. అంతేకాకుండా కరీంనగర్, వరంగల్ హైవేపైనే ఈ గ్రామం ఉన్నందున జన సమీకరణ చేసేందుకు కూడా ఇబ్బందులు లేకుండా పోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలన్న యోచనలో మంత్రులు ఉన్నారని తెలుస్తోంది.

అదే బాటలో…?

టీఆర్‌ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానంలోనే ఇతర పార్టీలు కూడా నడిచే అవకాశం లేకపోలేదు. నియోజకవర్గ పరిధి దాటిన తరువాత ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం మానకొండూరు నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ మండలంలోని సరిహద్దు గ్రామాల్లో తమ పార్టీ కార్యకలాపాలు చేసుకునే అవకాశం ఉంటుంది. నియోజకవర్గం చుట్టూ ఉన్న ఇతర నియోజకవర్గాలను వేదికగా చేసుకుని తమ ప్రచారాలను నిర్విఘ్నంగా కొనసాగించేందుకు ఆయా పార్టీలు వ్యూహ రచన చేయబోతున్నాయి.


Next Story

Most Viewed