హిందూస్తాన్ యూనిలీవర్ ఆదాయం 20 శాతం వృద్ధి

by  |
హిందూస్తాన్ యూనిలీవర్ ఆదాయం 20 శాతం వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనిలీవర్ నికర లాభం 18.87 శాతం పెరిగి రూ. 1,921 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 1,616 కోట్ల లాభాలను ఆర్జించింది. అలాగే, ఈ త్రైమాసికంలో సంస్థ ఆదాయాలు 20.5 శాతం పెరిగి రూ. 11,682 కోట్లకు చేరుకున్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అదేవిధంగా, గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ 20 శాతం టర్నోవర్ వృద్ధిని సాధించింది. నికర ఆదాయాల నిర్వహణ, పొదుపు నేపథ్యంలోనే మెరుగైన ఫలితాలను సాధించినట్టు కంపెనీ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. ‘వినియోగదారులకు అవసరమైన ఉత్పత్తుల ఆవిష్కరణ, మార్కెట్ అభివృద్ధికి కావాల్సిన పెట్టుబడుల కారణంగా వ్యాపారం వేగవంతంగా కొనసాగిందని కంపెనీ వెల్లడించింది.

ఎబిటా(వడ్డీ, తరుగుదల, పన్నుకు ముందు లాభాలు) మార్జిన్లు 24 శాతంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. ‘ కరోనా కేసులు తగ్గిపోయాయి. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడ్డాయి. వ్యాక్సిన్ పంపిణీ వేగవంతంగా జరగడం వల్ల ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ కొత్త ఆవిష్కరణలతో మెరుగైన వృద్ధిని సాధించినట్టు’ హిందూస్తాన్ యూనిలీవర్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా చెప్పారు. రానున్న కాలంలో డిమాండ్ దృక్పథం మెరుగుపడుతోంది. గ్రామీణ ప్రాంతాలు ప్రస్తుత ధోరణినే కొనసాగించాలని ఆశిస్తున్నాం. ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉత్పత్తులపై కనిపిస్తోంది. ఈ అంశంపై పరిశీలిస్తున్నాం. తాజా ఫలితాలతో తాము మెరుగైన స్థితిలోనే ఉన్నామనే నమ్మకం కలుగుతోందని సంజీవ్ మెహతా వెల్లడించారు.

Next Story

Most Viewed