కాలేయాన్ని కాపాడుకోవడం ఎలా…

by  |
కాలేయాన్ని కాపాడుకోవడం ఎలా…
X

దిశ,వెబ్ డెస్క్:
కాలేయం… శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం. మన శరీరంలోకి వచ్చే ఎన్నో విష పదార్థాలను డీ టాక్సిఫికేషన్ చేసి దాని ప్రభావాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా శరీరంలోని అతి ప్రమాదకరమైన అమోనియాను యూరియాగా కాలేయం మారుస్తుంది. తద్వారా మనను కాపాడుతుంది. ఇంకా మనం తిన్న ఆహారంలోని గ్లూకోజ్, ప్రోటీన్లను, కొవ్వులు వంటి పోషకాలను విడగొట్టడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాంటి కాలేయం దెబ్బతింటే శరీరంలో డీటాక్సిఫికేషన్ ప్రక్రియ ఆగిపోతుంది. దీంతో ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంది.

అయితే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. మనం తీసుకునే ఆహరంలో కొద్ది పాటి మార్పులు చేస్తే కాలేయాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలో చిక్కుళ్లు, బీన్స్,పండ్లు, ముడిధాన్యాలు, గోధుమలు లాంటివి ఉండేలా చూసు కోవాలి. దాంతో లివర్ మరింత మెరుగ్గా పని చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక మనలో ఎక్కువ మందికి జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటుంది. అయితే కాలేయానికి జంక్ ఫుడ్ కూడా హాని కలిగిస్తుందనీ వైద్యులు చెబుతున్నారు. జంక్ ఫుడ్ తింటే కాలేయం పనితీరు మందగించే ప్రమాదం ఉందని అంటున్నారు. అందుకే వీలైనంత వరకు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదని అంటున్నారు. ఇక పచ్చగోబీని తీసుకుంటే కాలేయానికి కొవ్వుపట్టకుండా కాపాడుతుందని పరిశోధనలు చెబుతన్నాయి.

కాలేయానికి ఇబ్బది కలిగించే వాటిలో షుగర్ ఒకటి. మనం చక్కెరలను తీసుకున్నప్పుడు దానిలో కొంత భాగం కొవ్వుగా మారుతుంది. ఫలితంగా కాలేయానికి కొవ్వు పట్టే అవకాశం ఉంది. అందుకే షుగర్ ఉండే పదార్థాలను తక్కువగా తీసుకుంటేనే మేలని వైద్యులు అంటున్నారు. ఇక కాలేయం పై శీతల పానీయాలు, మద్యపానం కూడా ప్రభావాన్ని చూపుతాయి. అందుకే వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది.

ఇక మన రోజూ వారి ఆహారంలో సోడియం శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే కాలేయం గట్టిపడే అవకాశం ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. అందుకే మన ఆహారంలో ఉప్పు సరైన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. పాలకూర, మెంథికూర, తోటకూర వంటి ఆకు కూరల్లో గ్లుటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాలేయం బాగా పనిచేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.


Next Story

Most Viewed