గుడ్డు ఉడికించడంపై ప్రముఖ షెఫ్ వీడియో!

94

దిశ, వెబ్‌డెస్క్: గుడ్డు ఉడికించడం ఒక కళ అంటున్నారు ప్రముఖ షెఫ్ సంజీవ్ కపూర్. దాని గురించి వివరంగా వీడియో కూడా పెట్టారు. అదేంటి గుడ్డు ఉడికించడం ఏముంది.. కొన్ని నీళ్లు పోసి, అందులో గుడ్లు వేసి, ఓ పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది కదా.. దానికి కూడా వీడియో పెట్టి హైలైట్ చేయాలా? అని అనుకోవద్దు. ఎందుకంటే సంజీవ్ కపూర్ చెప్పినట్లుగా గుడ్డు ఉడికించడం నిజంగా ఒక కళే. ఉడికించడం సులభమే కానీ, అది చక్కగా మనకు కావాల్సిన విధంగా ఉడికించడంలోనే విశేషం ఉంది. కొన్ని సార్లు గుడ్డు, నీళ్లు మరుగుతున్నప్పుడే పగిలిపోతుంది. మరికొన్నిసార్లు ఎంత ట్రై చేసినా పై పొట్టు రాదు. ఇలా జరగకుండా ఉండాలంటే సంజీవ్ కపూర్ చెప్పినవి పాటించాలి.

‘బ్యాక్ టు బేసిక్స్’ పేరుతో గుడ్డు ఉడికించే వీడియోను ఆయన పోస్ట్ చేశారు. అందులో గుడ్లను హాఫ్ బాయిల్ చేయడం, ఫుల్ బాయిల్ చేయడం సంజీవ్ నేర్పించారు. ముందుగా లోతుగా ఉండే గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలని, తర్వాత వాటిలో గుడ్లు ఒక్కొక్కటిగా వేసి కలబెట్టాలని సంజీవ్ చెప్పారు. ఇలా నెమ్మదిగా కలబెట్టడం వల్ల లోపల ఉన్న నీలం మధ్యలోనే ఉంటుందని చెప్పారు. తర్వాత మెత్తని గుడ్డు కావాలంటే ఐదు నిమిషాల పాటు ఉడికించాలని, మధ్యస్థంగా ఉడికిన గుడ్డు కోసం ఎనిమిది నిమిషాల పాటు ఉడికించాలని, బాగా ఉడికిన గుడ్డు కోసం 12 నుంచి 15 నిమిషాలు ఉడికించాలని సంజీవ్ వీడియోలో తెలిపారు.