అంచెలంచెలుగా ఎదిగిన బీజేపీ..!

by  |
అంచెలంచెలుగా ఎదిగిన బీజేపీ..!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: గ్రేటర్‎లో బీజేపీ అంచెలంచెలుగా ఎదిగింది. బల్దియా ఎన్నికల్లో అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకుంది. ముందెన్నడు లేనంతగా బలాన్ని కూడగట్టుకుంది. నలుగురు కార్పొరేటర్ల నుంచి 48 మంది స్థానాల వరకు ఎగబాకింది. ఎన్నికల ప్రచారంలోనూ వినూత్నంగా వ్యవహరించింది. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని ప్రచారం నిర్వహించింది. విమర్శలను ఎక్కుపెట్టడంలోనూ కమలం నిరూపించింది.

ఫలించిన వ్యూహం..

బీజేపీని గెలిపిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి. విపక్షాలు వాటిని అస్త్రాలుగా చేసుకుని ఎదురుదాడి చేసినా వాటిని తనదైన శైలిలో సంజయ్ తిప్పి కొట్టారు. దానికి కొనసాగింపుగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సైతం రోహింగ్యాలను తరిమివేస్తామని చెప్పడం పొలిటికల్ హీట్‌కు కారణమయ్యాయి. టీఆర్ఎస్, ఎంఐఎం పొత్తులను పదేపదే ప్రస్తావించడం కూడా బీజేపీకి కలిసొచ్చింది. మంత్రి కేటీఆర్ స్వయంగా తమకు మజ్లీస్‌తో ఈ ఎన్నికల్లో పొత్తు లేదని ప్రకటించుకునే విధంగా బీజేపీ పన్నిన వ్యూహం ఫలించిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతోపాటు మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆక్రమణలపై స్పందిస్తూ ఎన్టీఆర్, పీవీ ఘాట్‌లను కూల్చేవేయాలని చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ అంతేవేగంతో స్పందించారు. వాటికి జోలికి వస్తే దారుస్సాలం కూల్చేస్తామని చేసిన హెచ్చరిక సంచనలం సృష్టించింది.

హస్తం బలహీనత..

దుబ్బాక ఉపఎన్నిక విజయం బీజేపీకి కొండంత బలాన్ని ఇచ్చింది. ఆరేళ్లుగా రాష్ట్రంలో ఎదురులేని రాజకీయ శక్తిగా అవతరించిన గులాబీ పార్టీకి దుబ్బాకలో కొలుకోని దెబ్బ తగిలింది. దుబ్బాక సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకున్న టీఆర్ఎస్‌కు గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆధిక్యాన్ని కోల్పోయింది. గత ఎన్నికల్లో 99 స్థానాలను కైవసం చేసుకున్న గులాబీ పార్టీ, తాజా ఎన్నికల్లో 43 స్థానాలను కొల్పోయి కేవలం 55 డివిజన్లకే పరిమితమైంది. హస్తం పార్టీలో ఉన్న బలహీనతలను తనకు అనుకూలంగా మలుచుకుంది. సాధారణ ఎన్నికల నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్​ క్రమంగా తగ్గుతూ వస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించినా, అధికార పార్టీ టీఆర్ఎస్‌ను ఢీకొట్టే స్థాయిలో రాణించలేకపోయింది. అధికార పార్టీ విమర్శలను తిప్పి కొట్టడంలోనూ, సర్కారు వైఫల్యాలను ఎత్తి చూపడంలోనూ కాంగ్రెస్​ విఫలమైంది. ఇదే అదునుగా భావించిన బీజేపీ తెలంగాణ బలమైన ప్రతిపక్షంగా ఎదిగేందుకు కార్యచరణను రూపొందించింది. అదే ఊపుతో ప్రచార వ్యూహాన్ని రచించింది. గ్రేటర్ పోరులో టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ అన్న భ్రమను కలిగించింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలోనూ సక్సెస్ సాధించింది.

ఓట్ల వేటలో సక్సెస్..

గ్రేటర్ ఎన్నికల్లో కమలం ఓట్ల వేటలో సక్సెస్ అయింది. సీట్ల లెక్కన టీఆర్ఎస్ పార్టీ ముందున్నప్పటికీ, ఓట్ల లెక్కలో మాత్రం కారును కమలం ఢీ కొట్టింది. ఈ సారి బీజేపీకి అత్యధికంగా 12,13,900 ఓట్లు పోల్ (31.43 శాతం) కాగా, టీఆర్ఎస్ 11,89,250 (30.79 శాతం) ఓట్లకు పరిమితమైంది. 2016 లో జరిగిన ఎన్నికల్లో కేవలం 3,46,253 ఓట్లతో బీజేపీ నాలుగు సీట్లనే గెలుచుకుంది. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీ 8.67 లక్షల ఓట్లు ఆదనంగా సాధించి, 48 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో మజ్లీస్ 15.97 శాతం ఓట్లను సాధించగా, కాంగ్రెస్ పార్టీ 5.95 శాతం ఓట్లకే పరిమితమైంది. గ్రేటర్ ఓటర్ల తీర్పుతో పార్టీల బలబాలాలు తారుమారై రాజకీయంగా కూడా పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం స్పష్టం కనిపిస్తోంది. బల్దియా తీర్పు నేపథ్యంలో రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Next Story

Most Viewed