ఉగాది స్పెషల్ రాశిఫలాలు.. ఏ రాశులవారికి తిరుగులేని అదృష్టం?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-18 09:13:55  IST  )

చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి కొత్త తెలుగు సంవత్సరం మొదలవుతుంది. కొత్త ఏడాదిలో ద్వాదశ రాశులవారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఈ ప్రత్యేక వార్తలో తెలుసుకోండి.

ఉగాది స్పెషల్ రాశిఫలాలు.. ఏ రాశులవారికి తిరుగులేని అదృష్టం?
X

దిశ, వెబ్‌డెస్క్: ఉగాది... తెలుగువారి అసలు సిసలైన తెలుగు సంవత్సరాది. ప్రతి తెలుగు లోగిలి మామిడి తోరణాలు, రంగురంగుల రంగవల్లులతో, షడ్రుచుల పచ్చడి, పంచాంగ శ్రవణంతో కళకళలాడుతుంది. తెలుగువారికి ఉగాది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. కొత్త ఆశలకు, భవిష్యత్తు ప్రణాళికలకు నాంది. మన ఆచార వ్యవహారాలు, వ్యవసాయం, వ్యాపారం, జీవితం, జీవనం అన్నీ కాలగమనంపై.. అంటే పంచాంగంపైనే ఆధారపడి ఉంటాయని చాలా మంది నమ్మకం. ఉగాదికి చెప్పే పంచాగంలో 12 రాశుల్లో జన్మించిన వారికి ఏడాదికాలంలో ఆదాయ, వ్యయాలు, గౌరవ మర్యాదలు, అవమానాలు ఎలా ఉంటాయో, ఉద్యోగ, వ్యాపార, విద్య, కుటుంబ స్థితిగతులు, పిల్లలు, పెళ్లిళ్లు ఇతరత్రా పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఒక అంచనాగా పండితులు వివరిస్తారు.

ఈ ఏడాది అన్ని రాశుల్లో ఐదవ రాశి అయిన సింహరాశివారికి ఆదాయ, వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానాలు సరిసమానంగా ఉండటం విశేషం. ఇక పరాభవ నామ సంవత్సరానికి రాజుగా గురువు ఉండబోతున్నాడు. గురువు ఉచ్ఛస్థానంలో ఉంటే ఆ రాశివారికి తిరుగులేదంటారు. అలాంటి గురువు రాజుగా ఉండబోతున్న కొత్త సంవత్సరంలో ఏయే రాశులవారికి ఎలాంటి ఫలితాలు కలుగబోతున్నాయో చూద్దాం.

మేషరాశి

(ఆదాయం 11 : వ్యయం 5)

(రాజపూజ్యం 2 : అవమానం 4)

ఈ రాశివారికి ఈ ఏడాది వృత్తిపరంగా కొత్త బాధ్యతలు వస్తాయి. ఏలినాటి శనిప్రభావం ఉండటంతో ఆఫీసులో పనిభారం పెరగడం, తోటి ఉద్యోగులతో చిన్నపాటి అపార్థాలు రావడం వంటివి జరిగే అవకాశాలున్నాయి. డిసెంబర్ 6వ తేదీ వరకూ చేసే ప్రతీ పనికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. జూన్ 2 తర్వాత కొందరికి ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్లు, లేదా ఉద్యోగమార్పు జరిగే ఛాన్స్ ఉంది. వ్యాపారస్తులు డిసెంబర్ తర్వాత కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ 6 తర్వాత రాజకీయ, సామాజిక రంగాల వారికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది.

ఆర్థిక పరిస్థితి చూస్తే.. ఈ ఏడాది ఆర్థికపరంగా ఒక పాఠం నేర్చుకుంటారు. కుటుంబ అవసరాలు, ప్రయాణాలు, శుభకార్యాల కోసం ఊహకు మించిన ఖర్చులతో సతమతమవుతారు. కానీ.. ఖర్చులకు కావలసిన డబ్బు సమయానికి సమకూరుతుంది. అక్టోబర్ 31 నుంచి జనవరి 25 2027 వరకూ సువర్ణకాలం. ఈ సమయంలో పాతబాకీలు వసూలు కావడం, షేర్ మార్కెట్, స్థిరాస్తి అమ్మకాలతో లాభాలు చూస్తారు.

కుటుంబ జీవితంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. జూన్ 2 వరకూ తోబుట్టువులతో సత్సంబంధాలు మెరుగుపడుతాయి. ఇంటిలో పండుగ వాతావరణం నెలకొంటుంది. నూతన ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేసే ఆలోచనలు అమల్లో పెడుతారు. కానీ.. డిసెంబర్ 6 వరకూ పిల్లల చదువు, ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. అక్టోబర్ 31 తర్వాత ఇంట్లో శుభకార్యాలు, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏలినాటిశని ప్రభావంతో ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పాదాల నొప్పులు, కీళ్ల నొప్పులు, నిద్రలేమి సమస్యలు బాధిస్తాయి. ఏప్రిల్ 2 నుంచి మే 11 లోపు చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశాలున్నాయి. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ప్రతి మంగళ, శనివారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం, ప్రతి శనివారం శివాలయ దర్శనం చేసుకుని నువ్వులనూనెతో దీపారాధన చేయడం మంచిది.

వృషభ రాశి

(ఆదాయం 5 : వ్యయం 14)

(రాజపూజ్యం 5 : అవమానం 4)

ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. లాభస్థానంలో శని ఉండటంతో ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది. కష్టానికి పై అధికారుల నుంచి గుర్తింపు పొందుతారు. డిసెంబర్ 6 లోపు ఉద్యోగ బదిలీ లేదా ప్రమోషన్ రావొచ్చు. వ్యాపారస్తులు కూడా పెట్టుబడుల్లో సానుకూల ఫలితాలను చూస్తారు. జూన్ 20 నుంచి ఆగస్టు 2 మధ్య కాలంలో పార్ట్నర్లతో లేదా కస్టమర్లతో మాట్లాడేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఆర్థికపరంగా చూస్తే.. వృషభరాశివారికి ఈ ఏడాది ఆశాజనకంగానే ఉంటుంది. ఆర్థిక కష్టాలు తీరుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన పనులు, మొండి బాకీలు వసూలు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువులు, ఆస్తులు కొనుగోలు చేసేందుకు అనుకూలంగా ఉంది.

కుటుంబ జీవితంలో ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. శుభకార్యాలపై దృష్టి పెడుతారు. అక్టోబర్ 31, డిసెంబర్ 5 తర్వాత తల్లి ఆరోగ్యం లేదా ఆస్తి పంపకాల విషయంలో ఇబ్బందులు పడొచ్చు. సంతానం లేని వారికి ఈ ఏడాది సంతానం కలిగే అవకాశం ఉంది.

ఈ రాశివారిక ఆరోగ్యం అంతా బాగుంటుంది. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కానీ జూన్ 20 నుంచి ఆగస్టు 2 వరకూ అజీర్తి, ఉష్ణ సంబంధిత అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆహార నియమాలు పాటించడం మంచిది.

పరిహారాలు : ప్రతి మంగళవారం దుర్గాదేవి ఆలయంలో ఎర్రటి పూలతో పూజలు చేయండి. అదే రోజున సుబ్రహ్మణ్యస్వామిని దర్శించి కందులు దానం చేయడం మంచిది.

మిథున రాశి

(ఆదాయం 8 : వ్యయం 11)

(రాజపూజ్యం 1 : అవమానం 7)

వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్న ఈ రాశివారిక పరాభవ నామసంవత్సరంలో మంచి పునాది పడుతుంది. ఆఫీసులో బాధ్యతలు పెరుగుతాయి. పనిని చూసి పై అధికారులు మెచ్చుకుంటారు కానీ.. రెస్ట్ లేక అలసిపోతారు. జూన్ తర్వాత ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ అందుకునే ఛాన్సుంది. వ్యాపారస్తులకు జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలం లాభదాయకంగా ఉంటుంది. డిసెంబర్ 6 తర్వాత నూతన పెట్టుబడుల విషయంలో భాగస్వాములతో అపార్థాలు రాకుండా చూసుకోవాలి.

ఆర్థిక పరంగా చూస్తే.. తొలి రెండు నెలలు ఇబ్బంది పడినా ఆ తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. జూన్ 2 తర్వాత ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మొండిబాకీలు వసూలవుతాయి. పూర్వీకుల ఆస్తి కలిసిరావడం, లేదా స్థిరాస్తి కొనుగోలు చేయడం వంటివి జరగవచ్చు. 2026 చివరిలో కుటుంబంలో ఊహించని ఖర్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జూన్ తర్వాత ఇంటిలో శుభకార్యాలు, వివాహాలు జరిగే అవకాశాలున్నాయి. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 18 మధ్యకాలంలో జీవిత భాగస్వామితో వాగ్వాదాలు రావొచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే అన్ని సమస్యలు తగ్గుతాయి. డిసెంబర్ తర్వాత కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉండొచ్చు.

ఈ ఏడాది మిథునరాశివారి ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. అలసట, నీరసంగా ఉన్నా ఉల్లాసంగా ఉంటారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చర్మసమస్యలు, శరీరంలో వేడి పెరగడం వల్ల ఇబ్బంది పడుతారు. డిసెంబర్ నెల నుంచి వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు పాటించడం వల్ల బీపీ, షుగర్ వంటి వాటిని కంట్రోల్ లో ఉంచుకోవాలి.

పరిహారాలు : ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పఠించాలి. అలాగే మంగళ, శనివారాల్లో దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవడం మంచిది.

కర్కాటకం

(ఆదాయం 2 : వ్యయం 11)

(రాజపూజ్యం 4 : అవమానం 7)

వృత్తి, వ్యాపారాల్లో ఈ రాశివారు ఓపికగా వ్యవహరించాల్సిన సమయమిది. జూన్ 2 తర్వాత ఉద్యోగంలో ఊహించని మార్పులు, నచ్చని ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో ఉన్నతాధికారులతో వాదనలకు దిగకపోవడం ఉత్తమం. డిసెంబర్ 6వ తేదీ వరకూ మీ వెనుక జరిగే రాజకీయాలపై స్పందించకపోవడం బెటర్. వ్యాపారస్తులకు ఈ ఏడాది పెట్టుబడులు అనుకూలించవు. కొత్తవ్యాపారాలు ప్రారంభించేకంటే ఉన్న వ్యాపారాలను నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టడం ఉత్తమం. అక్టోబర్ 31 నుంచి జనవరి మధ్య కాలంలో వ్యాపార ఒడిదుడుకుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.

ఆర్థికపరంగా కూడా కష్టకాలమే. జూన్ 2 వరకూ ఇంట్లో శుభకార్యాలు, వరుస ప్రయాణాలు, హాస్పిటల్ ఖర్చులతో చేతిలో రూపాయి కనిపించదు. కుటుంబ ఖర్చులు ఊహించని రీతిలో పెరుగుతాయి. అక్టోబర్ 31 తర్వాత ఆర్థిక స్థితిలో మార్పు వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం చూస్తారు. పాత అప్పులు తీరుతాయి. అక్కడి నుంచి ఆచితూచి ఖర్చులు చేయడం అలవాటు చేసుకోవాలి.

కుటుంబ వాతావరణంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. కేతువు సంచారం వల్ల కుటుంబ సభ్యులతో చిన్నపాటి అపార్థాలు, మాట పట్టింపులు రావొచ్చు. మాటతీరు కఠినంగా ఉంటే కష్టం. తండ్రి ఆరోగ్యం లేదా, తండ్రి సంబంధిత ఆస్తుల విషయంలో ఆందోళనగా ఉంటుంది. డిసెంబర్ 6 తర్వాత జీవిత భాగస్వామితో సర్దుకుపోవడం ముఖ్యం.

ఆరోగ్యం విషయంలోనూ నిర్లక్ష్యం తగదు. జూన్ 2 నుంచి మానసిక ఒత్తిడి, కారణంలేకుండా భయం పెరుగుతాయి. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12 వరకూ బీపీ, తలనొప్పి, కడుపులో మంట వంటి సమస్యలు రావొచ్చు. వాహనాలు నడిపే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సమయానికి భోజనం చేయడం, ఉదయం వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పరిహారాలు : ప్రతి సోమవారం శివుడికి పాలాభిషేకం చేసి.. ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించాలి. ప్రతి గురువారం దత్తాత్రేయునికి లేదా సాయిబాబాకు దీపారాధన చేసి శనగలు దానం చేయడం మంచిది. మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి.

సింహరాశి

(ఆదాయం 5 : వ్యయం 5)

(రాజపూజ్యం 7 : అవమానం 7)

సింహరాశివారికి ఈ ఏడాది వృత్తి, వ్యాపారాలు ఒక పరీక్షలాంటిది. ఎంతకష్టపడినా తగిన గుర్తింపు లభించదు. ఫలితంగా పై అధికారులతో విభేదాలు వస్తాయి. అక్టోబర్ తర్వాత ఉన్నట్లుండి ఉద్యోగమార్పులు, బదిలీలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు తమ భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ 6 తర్వాత వృత్తిలో ఆటంకాలు పోయి.. పైచేయి సాధిస్తారు.

ఆర్థిక స్థితి చూస్తే.. ఆదాయ, వ్యయాలు సమానంగానే ఉన్నా.. ఊహించని ఖర్చులుంటాయి. జూన్ 2 లోగా పాత అప్పులు తీర్చడం, ఇతర ఆర్థిక లావాదేవీలు పూర్తిచేసుకోవడం ఉత్తమం. వైద్యం, ప్రయాణాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. పూచీకత్తుపై ఎవరికీ అప్పులు ఇప్పించకపోవడం మంచిది. నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పొదుపే ఆర్థికంగా ఆదుకునే మంత్రమని గుర్తుంచుకోవాలి.

కుటుంబ వాతావరణంలో సంయమనంగా ఉండాలి. డిసెంబర్ 6 లోగా జీవిత భాగస్వామితో గొడవలు, మాట పట్టింపులు రావొచ్చు. ప్రశాంతంగా మాట్లాడుకోవడం ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి. పెళ్లికానివారికి జూన్ లోగా మంచి సంబంధం కుదరవచ్చు. బంధువులు, స్నేహితులతో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్యం విషయంలో శ్రద్ధగా ఉండాలి. నవంబర్ నుంచి నాడీ సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటాయి. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించడం బెటర్. నవంబర్ 12 నుంచి మార్చి వరకూ నిప్పు, విద్యుత్, వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారాలు : ప్రతి శనివారం శివాలయంలో నువ్వులనూనెతో దీపారాధన, శనిదేవుడికి తైలాభిషేకం చేయాలి. ప్రతినెలా మాస శివరాత్రి రోజున మహారుద్రాభిషేకం చేయించుకోవడం అత్యంత ఫలప్రదం.

కన్యారాశి

(ఆదాయం 8 : వ్యయం 11)

(రాజపూజ్యం 3 : అవమానం 3)

వృత్తిరీత్యా ఈ రాశివారికి పరాభవనామ సంవత్సరం ఉత్తమంగా ఉంటుంది. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే ఛాన్సుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త వెంచర్లు ప్రారంభించేందుకు అనుకూల సమయం. కానీ.. పార్ట్నర్లతో మాత్రం వాగ్వాదాలు రాకుండా ఓపికగా వ్యవహరించాలి.

ఈ ఏడాది ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉన్నా.. గురుబలం ఉండటం వల్ల డబ్బుకు లోటుండదు. జూన్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అనుకోని మార్గాల్లో డబ్బు లాభాలను తెచ్చిపెడుతుంది. గతంలో ఇచ్చిన అప్పులు వసూలవుతాయి. డిసెంబర్ 6 తర్వాత షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ద్వారా ఆకస్మిక లాభాలొచ్చే సూచనలున్నాయి. ఖర్చుల పట్ల మాత్రం జాగ్రత్తగా ఉంటే.. భవిష్యత్తుకు భరోసా ఉంటుంది.

వ్యక్తిగత జీవితం మాత్రం భిన్నంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఫ్రెండ్స్, కజిన్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది. కానీ.. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు, మాట పట్టింపులు రావొచ్చు. కోపాన్ని పక్కనపెడితే అన్నీ సర్దుకుంటాయి.

ఆరోగ్యం బాగుంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు. గతంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది. జీర్ణకోశ, నడుమునొప్పి అప్పుడప్పుడూ ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి ఆహారం, నిద్ర ఉండేలా చూసుకోవాలి.

పరిహారాలు : ప్రతి బుధవారం విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి. ప్రతి శనివారం శివాలయంలో నల్ల నువ్వులు దానం చేయడం, నువ్వులనూనెతో దీపారాధన చేయడం మంచిది.

తులారాశి

(ఆదాయం 5 : వ్యయం 14)

(రాజపూజ్యం 6 : అవమానం 3)

ఈరాశిలో ఉన్న ఉద్యోగస్తులకు ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో మీపై ఉన్న వ్యతిరేకత తొలగిపోతుంది. అలాగే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారు విజయం సాధిస్తారు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో వృత్తిలో మార్పులు వచ్చే ఛాన్సుంది. పనిభారం, ఇష్టంలేని చోటికి బదిలీ కావడం జరిగినా.. అది తాత్కాలికమే. వ్యాపారస్తులు డిసెంబర్ 6 లోపు పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు చూస్తారు.

ఆదాయ స్థితిగతులు చూస్తే.. ప్రణాళిక లేకుండా డబ్బు ఖర్చు చేస్తే ఇబ్బందులు పడతారు. ఇల్లు కట్టడం, వాహనం కొనుగోలు, ఇంట్లో శుభకార్యాల కారణంగా సేవింగ్స్ డబ్బు ఖర్చవ్వచ్చు. అయితే.. జూన్ 2 వరకూ, తిరిగి అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకూ ఖర్చులకు సమయానికి డబ్బు అందుతుంది. పాత బాకీలు వసూలవుతాయి.

కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. జూన్ 2 లోగా శుభకార్యాలు జరుగుతాయి. లేదా తీర్థయాత్రలు చేస్తారు. తండ్రి సపోర్ట్ తో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. డిసెంబర్ 6 తర్వాత తల్లి తరపు బంధువులతో మాటపట్టింపులు రావొచ్చు. కాబట్టి మాటతీరులో జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్యం విషయానికొస్తే.. ఈ ఏడాది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి మెల్లగా బయటపడగలుగుతారు. శారీరక దృఢత్వం పెరుగుతుంది. డిసెంబర్ తర్వాత ఛాతీ, గ్యాస్ట్రిక్ సంబంధిత ఇబ్బందులు రావొచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవడం మంచిది.

పరిహారాలు : ప్రతి శుక్రవారం ఎర్రటి పువ్వులతో లక్ష్మీదేవిని పూజించడం, పసుపు రంగు పువ్వులతో ప్రతి గురువారం దక్షిణామూర్తి లేదా సాయిబాబాకు పూజలు చేయడం మంచిది. అలాగే మంగళ లేదా శుక్రవారం దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం.

వృశ్చిక రాశి

(ఆదాయం 11 : వ్యయం 5)

(రాజపూజ్యం 2 : అవమానం 6)

ఈ రాశివారు ఉద్యోగరీత్యా ఈ ఏడాది ఊహించని మలుపు చూస్తారు. ఆఫీసు పనుల్లో ఆలస్యం, పై అధికారులతో చిన్నపాటి అపార్థాలు రావొచ్చు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో మీ దశ తిరుగుతుంది. ఆగిపోయిన ప్రమోషన్లు అందుకుంటారు. కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ పొందుతారు. వ్యాపారస్తులు జూన్ తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలం. డిసెంబర్ 6 తర్వాత ధైర్యసాహసాలతో ఎంతటి కష్టమైన పనినైనా సునాయాసంగా పూర్తిచేస్తారు.

ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. గతంకంటే చాలా మెరుగవుతుంది. ఖర్చులకంటే రాబడి అధికం. జూన్ 2 వరకూ ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ పూచీకత్తుపై అప్పులు ఇప్పించడం మంచిదికాదు. పెట్టుబడుల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలి.

కుటుంబ, వ్యక్తిగత జీవితం జూన్ తర్వాతి నుంచి ఆనందంగా ఉంది. ఇంట్లో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. సంతానం చదువు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. గర్భిణులు ఆరోగ్యం, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ 6 వరకూ తల్లి ఆరోగ్యం విషయంగా జాగ్రత్తగా ఉండాలి.

పరాభవనామ సంవత్సరం ఆరంభంలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు, నీరసం బాధిస్తాయి. జూన్ తర్వాత ఆరోగ్యం కుదుటపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

పరిహారాలు : ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడిలో లేదా శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి, హనుమాన్ చాలీసా పఠించండి. మంగళవారం దుర్గా దేవికి నిమ్మకాయ దీపాలు వెలిగించండి.

ధనస్సు రాశి

(ఆదాయం 14 : వ్యయం 11)

(రాజపూజ్యం 5 : అవమానం 6)

వృత్తి, ఉద్యోగాల్లో ఈ ఏడాది సాధారణంగా ఉంటుంది. ఆఫీసులో పై అధికారుల మన్ననలు పొందుతారు. కానీ జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో వృత్తిలో తీవ్రమైన ఒత్తిడి, అకారణంగా నిందలు వల్ల స్థానచలనం రావొచ్చు. వాదనలకు దూరంగా ఉండటం ఉత్తమం. అక్టోబర్ 31 తర్వాత ఈ పరిస్థితులు మారుతాయి. పాత సమస్యలు తీరి ప్రమోషన్ పొందుతారు. వ్యాపారులు జూన్ - అక్టోబర్ మధ్యకాలంలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.

ఆర్థిక స్థితి విషయానికొస్తే.. ఆదాయానికి లోటు లేకపోయినా ఇంటి మరమ్మతులు, వాహన రిపేర్లు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఊహించని ఖర్చులు చేస్తారు. జూన్ - అక్టోబర్ మధ్య కాలంలో చేతిలో డబ్బు నిలవదు. డిసెంబర్ 6 లోగా పాతబాకీలు వసూలవుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ వాతావరణం సామాన్యంగా ఉంటుంది. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావొచ్చు. మాటతీరు కఠినంగా ఉండటం వల్ల బంధుమిత్రులతో విరోధాలు రావొచ్చు.

ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. గుండె, ఛాతీ సంబంధిత, జీర్ణకోశ వ్యాధులు బాధిస్తాయి. నిద్రలేమి సమస్య వేధిస్తుంది. డిసెంబర్ తర్వాత ప్రయాణాలు, రాత్రివేళల్లో వాహనాలు నడిపేటపుడు అప్రమత్తంగా ఉండాలి.

పరిహారాలు : ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి లేదా శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. మంగళవారం దుర్గా దేవికి కుంకుమార్చన చేయించడం శుభప్రదం.

మకర రాశి

(ఆదాయం 2 : వ్యయం 8)

(రాజపూజ్యం 1 : అవమానం 2)

వృత్తి, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశివారికి ఈ ఏడాది సువర్ణకాలం. ఆఫీసులో పైచేయి మీదే అవుతుంది. గతంలో ఇబ్బంది పెట్టినవారు సైలెంట్ అవుతారు. పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. కొత్తవ్యాపారాలు ప్రారంభించేందుకు, భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు మంచి సమయం. అక్టోబర్ - జనవరి 2027 వరకూ పనుల్లో ఆటంకాలు వచ్చినా పట్టుదలతో వాటిని సాధిస్తారు.

ఆర్థిక స్థితి గమనిస్తే.. డిసెంబర్ 6 వరకూ వృధా ఖర్చులు, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. కానీ.. ఏదొక రూపంలో డబ్బు సమయానికి చేతికందుతుంది. బడ్జెట్ వేసుకుని ఖర్చు చేయడం, పొదుపుపై దృష్టి పెట్టడం ముఖ్యం. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.

కుటుంబ పరంగా జూన్ 2 నుంచి ఆనందంగా ఉంటారు. పెళ్లికానివారికి వివాహ యోగం చూపిస్తోంది. డిసెంబర్ 6 తర్వాత కుటుంబంలో కొత్త సవాళ్లు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. అనవసర వాదనలకు దూరంగా ఉండి, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ సమయాన్ని ప్రశాంతంగా గడపవచ్చు.

ఏలినాటి శనికారణంగా కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. డిసెంబర్ తర్వాత మానసిక ఒత్తిడి, అకారణంగా ఆందోళన కలగవచ్చు. కళ్లు, తలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రావొచ్చు.

పరిహారాలు: మంగళవారం లేదా శుక్రవారం దుర్గా దేవికి కుంకుమార్చన చేయించడం లేదా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం శుభప్రదం. నిత్యం "ఓం నమః శివాయ" పంచాక్షరీ మంత్రాన్ని జపించండి.

కుంభ రాశి

(ఆదాయం 2 : వ్యయం 8)

(రాజపూజ్యం 4 : అవమానం 2)

కుంభరాశివారికి జూన్ 2 వరకూ వృత్తిపరంగా ఆశాజనకంగా ఉంటుంది. ప్రమోషన్లు, కొత్త అవకాశాలు వస్తాయి. జూన్ నుంచి అక్టోబర్ 31 మధ్య సమయంలో ఆఫీసులో శత్రువుల బెడద, పనిలో ఎక్కడలేని ఒత్తిడి ఉంటాయి. అధికారులతో మాట్లాడేటపుడు సహనంగా వ్యవహరించాలి. వ్యాపారస్తులు తమ పార్ట్నర్లతో జాగ్రత్తగా ఉండాలి. కొత్తవ్యక్తుల్ని గుడ్డిగా నమ్మి వ్యాపారం చేయడం మంచిదికాదు. అక్టోబర్ చివరి నుంచి పరిస్థితులు నియంత్రణలోకి వస్తాయి.

ఆర్థిక స్థితి గందరగోళంగా ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చైపోతూ ఉంటుంది. ఈ సమయంలో అప్పు ఇవ్వకపోవడం మంచిది. ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. అలాగే ఎవరికీ జామీనుపై అప్పు ఇప్పించకపోవడం బెటర్. డిసెంబర్ తర్వాత ఆస్పత్రులు, ప్రయాణాల ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. సో.. ఉన్నదానిలోనే పొదుపు చేసుకోవడం మంచిది.

కుటుంబ విషయంలో నిదానమే ప్రధానమన్నట్లు ఉండాలి. మాట కఠినత్వం వల్ల కుటుంబ సభ్యులే అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. వివాదాలకు దూరంగా, మౌనంగా ఉండటం బెటర్. జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. పెళ్లి కానివారికి జూన్ 2లోగా పెళ్లి కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు, కొత్త సంబంధాల విషయంగా జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఊహించని మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు బాధిస్తాయి. కళ్లు, పళ్లు, గొంతుకకు సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు రావొచ్చు. జూన్ - అక్టోబర్ మధ్య కాలంలోఉదర సంబంధిత లేదా డయాబెటిస్ వ్యాధులు ఉన్నవారు ఆహార నియమాలు పాటించాలి.

పరిహారాలు : ప్రతి శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి, ఏకాదశ రుద్రాభిషేకం లేదా శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం మంచిది. మంగళవారం, శుక్రవారం దుర్గా దేవికి కుంకుమార్చన చేయించి, నిమ్మకాయ దీపాలు వెలిగించండి.

మీన రాశి

(ఆదాయం 14 : వ్యయం 11)

(రాజపూజ్యం 7 : అవమానం 2)

ఈ రాశివారు వృత్తి, ఉద్యోగాల్లో ఓర్పుగా వ్యవహరించాలి. కష్టానికి తగిన గుర్తింపు లేకపోగా.. తోటి ఉద్యోగుల వల్ల సమస్యల్లో చిక్కుకునే అవకాశాలున్నాయి. జూన్ 2 తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. బాధ్యతలు పెరిగి, పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారస్తులకు జూన్ - అక్టోబర్ మధ్య సమయం పెట్టుబడులు, కొత్త ఒప్పందాలకు అనుకూలం.

సమయానికి చేతికి డబ్బందుతుండటం వల్ల ఖర్చులకు లోటు ఉండదు. కానీ కుటుంబ, ఇంటి మరమ్మతులకు ఖర్చులు పెరుగుతాయి. జూన్ 2 తర్వాత గతంలో పెట్టిన పెట్టుబడులతో లాభాలు చూస్తారు. పాత అప్పులు వసూలవుతాయి.

కుటుంబ జీవితం మిశ్రమంగా ఉంటుంది. తరచూ మూడీగా ఉండటం, చిన్న చిన్న విషయాలకు చిరాకు పడటం వల్ల కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ప్రశాంతంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. జూన్ - అక్టోబర్ మధ్య సమయంలో పెళ్లికానివారికి పెళ్లి కుదిరే ఛాన్సుంది. సంతానం లేనివారు కూడా శుభవార్త వింటారు. పిల్లల చదువులపై మాత్రం దృష్టిసారించాల్సి ఉంటుంది.

ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ తగదు. ఎముకలు, కీళ్ల నొప్పులు, అలసట తీవ్రంగా ఉంటాయి. వాహనాలు నడిపేటపుడు, కరెంట్ తో పనిచేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. నిద్రలేమి సమస్య బాధిస్తుంది.

పరిహారాలు : ప్రతి శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి, దశరథకృత శని స్తోత్రాన్ని పఠించండి. వీలైతే శని భగవానుడికి అభిషేకం చేయించండి. నిత్యం హనుమాన్ చాలీసా చదవడం అత్యంత శుభప్రదం.

గమనిక: పైన తెలిపిన రాశిఫలాల సమాచారం ఇంటర్నెట్, పండితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిని నమ్మాలని దిశ ప్రోత్సహించదు.

Next Story