ఆమెపై అలా జరగడం బాధాకరం: హోం మంత్రి

by  |
ఆమెపై అలా జరగడం బాధాకరం: హోం మంత్రి
X

దిశ, అమరావతి బ్యూరో: నెల్లూరులో మహిళా ఉద్యోగినిపై దాడి ఘటనపై హోంమంత్రి సుచరిత స్పందించారు. మహిళా ఉద్యోగినిపై దాడి జరగడం బాధాకరం అన్నారు. దాడి చేసిన వ్యక్తిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. ఆ కేసును దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి డీఎస్పీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించామని స్పష్టం చేశారు. ఈ విషయమై ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. దిశ చట్టం అమలులోకి వస్తే జరిగే మేలు గురించి ప్రతిపక్షాలు తెలుసుకోవాలని సూచించారు. త్వరితగతిన ముద్దాయిలకు శిక్ష పడేలా దిశ చట్టం రూపొందించడం జరిగిందన్నారు. దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా వన్ స్టాప్ సెంటర్లను బలోపేతం చేశామని ఆమె చెప్పుకొచ్చారు. నేరం చేసిన వారికి వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

నెల్లూరులో జరిగిన ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారని హోంమంత్రి సుచరిత తెలిపారు. రానున్న రోజుల్లో దిశ చట్టం మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తుందన్నారు. దిశ యాప్‌ను అందరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో గుంటూరులో యువతిపై అత్యాచారం ఘటనపైనా ఆమె స్పందించారు. గుంటూరులో యువతి వీడియోలను నెట్‌లో పెట్టిన కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశామని చెప్పారు. మూడో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. పోలీసులకు చెందిన వారే కాదు.. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని సుచరిత హెచ్చరించారు.

Next Story

Most Viewed