మీ కోరికలపై హెచ్​ఎండీఏ సర్వే.. సర్వత్రా ఆసక్తి

by  |
మీ కోరికలపై హెచ్​ఎండీఏ సర్వే.. సర్వత్రా ఆసక్తి
X

దిశ, న్యూస్​బ్యూరో: అన్‌లాక్‌ 2.0 ఈ నెలాఖరుతో ముగియనుంది. మార్చి 24న లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రజా రవాణా స్తంభించిపోయింది. బస్సులూ, రైళ్లూ నడవడం లేదు. ప్రైవేట్​, ఐటీ కంపెనీలు ఉద్యోగులతో ‘వర్క్​ ఫ్రం హోం’ చేయించుకుంటున్నాయి. ప్రస్తుతం సడలింపులు అమలవుతున్న నేపథ్యంలో ఆఫీసులు, కార్యాలయాలకు వెళ్లేవారి కోసం ప్రజారవాణాను పునరుద్ధరించాలనే డిమాండ్​ వస్తోంది. ఆగస్టు ఒకటి నుంచి అమలయ్యే అన్‌లాక్‌​ 3.0లో కేంద్ర ప్రభుత్వం మెట్రో రైళ్లకు అనుమతినివ్వకపోవచ్చని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కట్టడి అనంతరం గ్రేటర్ ప్రజలు రవాణా సదుపాయాలు, ఎలాంటి వసతులను కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు హైదరాబాద్​ మెట్రో పాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ (హెచ్​ఎండీఏ), హైదరాబాద్​ యూనిఫైడ్ మెట్రోపాలి టన్​ ట్రాన్స్​పోర్ట్​ అథారిటీ, (హెచ్​యూఎంటీఏ) సంయుక్తంగా సర్వే నిర్వహిస్తున్నాయి. కుటుంబంలో ఎన్ని బైకు​లు, కార్లు ఉన్నాయో ఆరా తీస్తున్నాయి. లాక్డౌన్​ కు ముందు ఇంటి నుంచి ఆఫీస్​ వరకూ ఎలా వెళ్లేవారో తెలుసుకుంటున్నారు. బస్, మెట్రో, ఎంఎంటీఎస్​, ఆటో, క్యాబ్​, కార్​, కంపెనీ వెహికల్స్ దేనిలో ప్రయాణించేవారో తెలుసుకుంటే ఎక్కువ మంది ఉపయోగించే రవాణా సదుపాయాలపై ఓ అంచనాకు రావచ్చని భావిస్తున్నారు. ఇంటి నుంచి ఆఫీస్ ఎంత దూరం? ఆఫీస్​ నుంచి బస్టాప్​, మెట్రో, ఎంఎంటీఎస్​ స్టేషన్​ వరకూ ఎలా చేరుకుంటున్నారు? ప్రజారవాణా సదుపాయాన్ని ఉపయోగిస్తున్నారా? లేదా? అనే ప్రశ్నలూ సర్వేలో ఉన్నాయి.

లాక్​డౌన్​కు ముందు.. ఆ తర్వాత

లాక్​డౌన్​ కు ముందు వారంలో ఆరు రోజులు ఆఫీసులకు, కంపెనీలకు వెళ్లినవారు, ఆ తర్వాత సగం రోజులు మాత్రమే వెళ్తున్నట్టు సర్వేలో తేలింది. కంపెనీ ట్రావెల్​ వెహికిల్స్​, పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ అందుబాటులో లేకపోవడం ఇందుకు ఒక కారణంగా పేర్కొంటున్నారు. పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్ సర్వీసులను ప్రారంభిస్తే, మళ్లీ ఉపయోగిస్తారా అన్న ప్రశ్నకు మెజారిటీగా అవుననే సమాధానం వస్తోంది. ప్రజారవాణా వ్యవస్థలను పునరుద్ధరిస్తే తీసుకోవాల్సిన జాగ్రతల గురించి ప్రజల అభిప్రాయాన్ని కోరుతున్నారు. పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​, షేరింగ్​ ఆటో, క్యాబ్​ల్లో సోషల్​ డిస్టెన్స్​ పాటించడంతో పాటు, మాస్క్​లు ధరించాలనే డిమాండ్​ వస్తోంది. కార్లు, బస్​, మెట్రోలతో పాటు ఆఫీస్​, ఇతర పనుల కోసం వెళ్లేటపుడు సైక్లింగ్​ చేస్తున్నారా? సిటీలో సైక్లింగ్​ ట్రాక్​లను అభివృద్ధి చేస్తే సైకిల్​ వాడేందుకు సిద్ధంగా ఉన్నారా అని కూడా అడుగుతున్నారు. రద్దీగా ఉండే సమయాలతోపాటు ఎక్కువగా ఏ ప్రయాణ సాధానాలు వాడుతున్నారో సర్వే ద్వారా తెలుసుకుంటున్నారు. ‘వర్క్​ ఫ్రం హోం’ ప్రయోజనకరంగా ఉందా? లాక్​డౌన్​ ముగిసినా కొనసాగించాలనుకుంటున్నారా లేక కార్యాలయాలకు వెళ్లాలనుకుంటున్నారా? అనే ప్రశ్నలూ సంధిస్తున్నారు.


Next Story