IAS ఆఫీసర్‌కు ఆ మాత్రం తెలీదా : హైకోర్టు

by  |
IAS ఆఫీసర్‌కు ఆ మాత్రం తెలీదా : హైకోర్టు
X

దిశ‌, ఖ‌మ్మం : ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ వ్యవహారంలో రూ.500 జరిమానా విధిస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కలెక్టర్ దాఖలు చేసిన అప్పీల్‌పై సీరియస్ అయింది. సింగిల్ జడ్జి ముందుస్తుగానే ఒక నిర్ణయానికి వచ్చి ఉత్తర్వులు వెలువరించారంటూ పేర్కొనడాన్ని కోర్టు తప్పుబట్టింది.

కోర్టు ధిక్కరణ అప్పీల్‌లో పేర్కొన్న అంశాలనే.. కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించరాదో చెప్పాలంటూ ఖమ్మం కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ న్యాయవాదికి సైతం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరోపణలను తొలగించడంతో పాటు క్షమాపణతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించడంతో హైకోర్టు అనుమతిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.

ప్రభుత్వ పథకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఖమ్మం ప్రజలు కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌కు ఫిర్యాదులు ఇచ్చారు. వాటిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ కలెక్టర్ వాటిని పట్టించుకోలేదు. దీంతో ఖమ్మం జిల్లా పెనుబల్లికి చెందిన కర్రి వెంకట్రామయ్య కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్‌ జడ్జి కలెక్టర్‌కు రూ.500 జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కలెక్టర్‌ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.

దానిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. చివరి అవకాశంగా కోర్టుకు వస్తారని.. కానీ కోర్టు ఉత్తర్వులు ఎందుకు అమలు చేయరని నిలదీసింది. కలెక్టర్ తరపున న్యాయవాది జోక్యం చేసుకొని.. తెలియక పొరపాటు చేశారని, ఇది మొదటి తప్పని సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారికి ఈ మాత్రం తెలియదంటే ఎలా? అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.


Next Story

Most Viewed