సడెన్‌గా లాక్‌డౌన్ అంటే ఎలా? ముందుచూపు ఉండదా..? హైకోర్టు తీవ్ర ఆగ్రహం

by  |
సడెన్‌గా లాక్‌డౌన్ అంటే ఎలా? ముందుచూపు ఉండదా..? హైకోర్టు తీవ్ర ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా విజృంభిస్తున్నదన్న కారణంతో రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుంటే ఎలా అని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. లాక్‌డౌన్ నిర్ణయం తీసుకునేంత వరకు కనీసం వీకెండ్ లాక్‌డౌన్ పెట్టాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. హఠాత్తుగా ఒక్క రోజు వ్యవధిలోనే లాక్‌డౌన్ అంటూ ప్రకటన చేస్తే దూర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇంత తక్కువ సమయంలో వారి సొంతూళ్ళకు ఎలా వెళ్తారని ప్రశ్నించింది. లాక్‌డౌన్ గురించి నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాల నుంచి ఎందుకు ఆలోచించలేకపోయిందని అడ్వొకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. లాక్‌‌డౌన్ పెట్టడం ద్వారా ఇతర రాష్ట్రాల్లో సత్ఫలితాలే వచ్చాయని హైకోర్టు అభిప్రాయపడింది.

కరోనా పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య చికిత్సకు హైదరాబాద్ నగరం కేంద్రంగా ఉందని, ఎక్కడెక్కడి నుంచో ట్రీట్‌మెంట్ కోసం ఇక్కడకు వస్తుంటారని, సరిహద్దుల దగ్గరే అంబులెన్సులను ఆపివేయాలని ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించింది. అన్ని రకాల వైద్య సౌకర్యాలు ఉన్నందునే ఇక్కడికి వస్తుంటారని, కానీ ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అంబులెన్సులను ఆపేయడం, తిప్పి పంపడం రాజ్యాంగంలోని 14, 19(1)(డి) అధికరణాలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం మౌఖిక ఆదేశాలు ఉన్నాయో లేవో కూడా అడ్వొకేట్ జనరల్‌కు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

కేవలం ఒక రోజు కూడా అవకాశం ఇవ్వకుండా లాక్‌డౌన్ అమలవుతుందంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇతర రాష్ట్రాల ప్రజలు, వలస కార్మికులు వారి సొంతూళ్ళకు ఎలా వెళ్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని హైకోర్టు ప్రశ్నించింది. వలస కార్మికులు గతేడాది పడిన ఇబ్బందులు ఈసారి పడకుండా చూడాలని స్పష్టం చేసింది. దీనికి స్పందించిన అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, ఇప్పటికే యాభై శాతం మంది వలస కార్మికులు వారి సొంతూళ్ళకు వెళ్ళిపోయారని బదులిచ్చారు. సాయంత్రం సమయాల్లో ఏవైనా ఆంక్షలు సడలిస్తారా అని హైకోర్టు ప్రశ్నించగా, ఎలాంటి సడలింపులు ఉండవని అడ్వొకేట్ జనరల్ క్లారిటీ ఇచ్చారు.

Next Story

Most Viewed