రోడ్డు ప్రమాదం.. కారులో భారీగా గంజాయి

by  |
రోడ్డు ప్రమాదం.. కారులో భారీగా గంజాయి
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: అది హైదరాబాద్- విజయవాడ ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారి. ఓ కారు రయ్యిమంటూ విజయవాడ నుంచి హైదరాబాద్ వైపునకు దూసుకెళ్తోంది. సరిగా నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామ సమీపంలోకి రాగానే ముందు వెళుతున్న ఓ వాహనాన్ని కారు ఢీకొట్టింది. అయ్యో.. యాక్సిడెంట్ అయ్యిందంటూ క్షతగాత్రులను కాపాడాదామంటూ కొంతమంది వాహనదారులు, స్థానికులు ప్రమాదానికి గురైన కారు వద్దకు చేరుకున్నారు. ఇంతలోనే కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మినహా మిగతా వారు పరారయ్యారు. అక్కడ ఉన్నవారికి ఏం అర్థం కాలేదు. కారులో ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని కారులోకి తొంగి చూశారు. అంతే అందులో కుప్పలు తెప్పలుగా గంజాయి పడి ఉంది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన కారు లోపల పరిశీలించగా 50 కేజీల గంజాయి బయటపడింది. దీంతో పోలీసులు గంజాయితో పాటు కారులో పరారైన వారితో కలిసి ప్రయాణిస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదిలావుంటే.. ఇటీవలే కట్టంగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 200 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే.



Next Story