టౌరిన్ సప్లిమెంట్లు మనుషులను ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచగలవా?

by Naga Rani Yarlagadda |

యాంటీ-ఏజింగ్ పరిశోధనలో టౌరిన్ అనే అమైనో ఆమ్లం కేంద్ర బిందువుగా మారింది. బయోహాకింగ్ ఫోరమ్‌ల నుంచి లాంగెవిటీ ల్యాబ్‌ల వరకు, ఈ సహజ అమైనో ఆమ్లం వృద్ధాప్యాన్ని నెమ్మదించే సామర్థ్యం కలిగిన గేమ్-ఛేంజర్‌గా పరిగణించబడుతోంది.

టౌరిన్ సప్లిమెంట్లు మనుషులను ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచగలవా?
X

దిశ, వెబ్‌డెస్క్: యాంటీ-ఏజింగ్ పరిశోధనలో టౌరిన్ అనే అమైనో ఆమ్లం కేంద్ర బిందువుగా మారింది. బయోహాకింగ్ ఫోరమ్‌ల నుంచి లాంగెవిటీ ల్యాబ్‌ల వరకు, ఈ సహజ అమైనో ఆమ్లం వృద్ధాప్యాన్ని నెమ్మదించే సామర్థ్యం కలిగిన గేమ్-ఛేంజర్‌గా పరిగణించబడుతోంది. మానవ శరీరంలో, కొన్ని ఆహారాల్లో లభించే టౌరిన్, ల్యాబ్ జంతువులలో వృద్ధాప్య ఛాయల్ని తగ్గించి.. జీవన్మితిని పెంచినట్లు చూపింది. కానీ టౌరిన్ సప్లిమెంట్లు మనుషులను ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచగలవా? దీనిపై ఇటీవల ‘సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైన కొత్త అధ్యయనం ఈ అంశంపై సంక్లిష్టతను జోడిస్తోంది.

వయస్సు పెరిగే కొద్దీ టౌరిన్ స్థాయిలు తగ్గుతాయని కొన్ని పాత అధ్యయనాలు సూచించాయి. ఇది టౌరిన్ సప్లిమెంట్లను యాంటీ-ఏజింగ్ థెరపీగా ఉత్సాహపరిచింది. అయితే, ఈ అధ్యయనాలు ఎక్కువగా క్రాస్-సెక్షనల్‌గా ఉండేవి. అంటే ఒకే సమయంలో విభిన్న వయస్సు గల వ్యక్తులను పరిశీలించాయి. ఇలాంటి అధ్యయనాలు తరచూ వైరుధ్య ఫలితాలను ఇచ్చాయి. కొన్ని టౌరిన్ స్థాయిలు తగ్గుతాయని, మరికొన్ని స్థిరంగా లేదా పెరుగుతాయని చూపించాయి. ఈ అంశాన్ని లోతుగా పరిశోధించేందుకు, యు.ఎస్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ (NIA), ఇతర సంస్థల పరిశోధకులు క్రాస్-సెక్షనల్ మరియు లాంగిట్యూడినల్ డేటాను కలిపి కొత్త అధ్యయనం నిర్వహించారు. ఇందులో ఒకే వ్యక్తులను కొంత కాలం పాటు ట్రాక్ చేశారు.

“వృద్ధాప్యంతో టౌరిన్ తగ్గడం సార్వత్రిక లక్షణం కాదు,” అని ఈ అధ్యయనంలో పాల్గొనని పెన్సిల్వేనియా పెరెల్మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫిజియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ బౌర్ లైవ్ సైన్స్‌కు చెప్పారు. ఈ అధ్యయనం బాల్టిమోర్ లాంగిట్యూడినల్ స్టడీ ఆఫ్ ఏజింగ్ నుంచి 26 నుంచి 100 సంవత్సరాల వయస్సు గల 740 మంది, స్పెయిన్‌లోని బాలేరిక్ ఐలాండ్స్ స్టడీ నుంచి 20-85 ఏళ్ల వారు, అట్లాంటాలోని ప్రిడిక్టివ్ మెడిసిన్ రీసెర్చ్ కోహోర్ట్ నుంచి 20-68 ఏళ్ల 160 మంది, అలాగే రీసస్ మకాక్‌లు, ల్యాబ్ ఎలుకలను వివిధ జీవన దశలలో పరిశీలించింది.

చాలా సందర్భాల్లో, టౌరిన్ స్థాయిలు స్థిరంగా ఉన్నాయి లేదా పెరిగాయి. NIA పోస్ట్‌డాక్టరల్ ఫెలో, అధ్యయన సహ రచయిత మరియా ఎమిలియా ఫెర్నాండెజ్ జూన్ 3 న్యూస్ కాన్ఫరెన్స్‌లో వివరిస్తూ, “వ్యక్తుల మధ్య టౌరిన్ స్థాయిలలోని తేడాలు, వయోజన దశలో చోటు చేసుకునే మార్పుల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి.” తక్కువ టౌరిన్ స్థాయిలు వృద్ధాప్యానికి మంచి బయోమార్కర్‌గా పనిచేయలేవని ఆమె నిర్ధారించారు.

2023లో, రట్జర్స్ న్యూజెర్సీ మెడికల్ స్కూల్‌కు చెందిన విజయ్ యాదవ్ సహ రచయితగా చేసిన అధ్యయనంలో.. మధ్య వయస్సు ఎలుకలకు టౌరిన్ ఇవ్వడం వల్ల చక్కెర జీవక్రియ మెరుగుపడటంతో పాటు DNA దెబ్బతినడం తగ్గింది. కొత్త అధ్యయనం ఈ ప్రభావాలను పరిశీలించలేదు. ఆరోగ్య స్థితిని బట్టి టౌరిన్ స్థాయిలు విపరీతంగా మారుతాయి. ఊబకాయం ఉన్నవారిలో టౌరిన్ తగ్గుతుంది. కానీ తీవ్ర ఊబకాయంలో పెరుగుతుంది. క్యాన్సర్ రోగులలో లుకేమియాలో పెరుగుతుంది, కానీ రొమ్ము క్యాన్సర్‌లో టౌరిన్ తగ్గుతుంది.

టౌరిన్ మిరాకిల్ బయోమార్కర్ కాదని NIA ట్రాన్స్‌లేషనల్ జెరాంటాలజీ బ్రాంచ్ చీఫ్, సహ రచయిత రాఫెల్ డి కాబో న్యూస్ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. టౌరిన్ పై చేసిన విభిన్న అధ్యయనాల మధ్య తేడా ఉందని, దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Next Story