పిల్లలకు నిద్ర ఎందుకు ముఖ్యం? ఏ వయసు పిల్లలు ఎన్ని గంటలు నిద్రపోవాలి?

by Sujitha Rachapalli |   (  Updated:2026-02-21 21:18:26  IST  )

పిల్లలకు నిద్ర అనేది చాలా ముఖ్యం. బ్రెయిన్ డెవలప్మెంట్ మాత్రమే శారీరక అభివృద్ధిలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. లేదంటే అనేక రకాల వ్యాధులకు దారితీస్తుంది.

పిల్లలకు నిద్ర ఎందుకు ముఖ్యం? ఏ వయసు పిల్లలు ఎన్ని గంటలు నిద్రపోవాలి?
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు. వారి నుంచే అన్నీ నేర్చుకుంటారు. ఒత్తిడిని ఎలా మేనేజ్ చేయాలి.. భావోద్వేగాలను ఎలా వ్యక్తపరచాలి.. అనేవి మాత్రమే కాదు ఫోన్ వినియోగాన్ని కూడా నేర్చుకుంటున్నారు. దీనివల్ల పిల్లల నిద్ర దెబ్బతింటోంది. ముఖ్యంగా రాత్రి సమయంలో స్క్రీన్ ఎక్స్‌పోజర్ మెలటోనిన్‌ను భంగపరుస్తుంది. స్లీప్ సైకిల్స్‌ను దెబ్బతీస్తుంది. నిజానికి నిద్ర అనేది జీవ విజ్ఞాన ప్ర్రక్రియ. శారీరక అభివృద్ధి, బ్రెయిన్ డెవలప్మెంట్, ఎమోషనల్ మేనేజ్మెంట్‌తోపాటు పూర్తి ఆరోగ్యానికి అవసరం. సరైన పోషకాహారం, వ్యాక్సిన్స్ ఎంత ఇంపార్టెంటో తగినంత, నాణ్యమైన నిద్ర కూడా అంతే ముఖ్యం. కానీ మోడ్రన్ లైఫ్ స్టైల్ కారణంగా నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు.

పిల్లలకు ఎన్ని గంటల నిద్ర అవసరం?

పెద్దవాళ్లకు రోజుకు ఎనిమిది గంటల నిద్ర ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. అలాగే నవజాత శిశువులు, టాడ్లర్స్, ప్రీస్కూల్ చిల్డ్రెన్, స్కూల్ స్టూడెంట్స్‌కు ఎంత నిద్ర అవసరమో చెప్తున్నారు నిపుణులు.

* నవజాత శిశువులు (0–3 నెలలు): రోజుకు 14–17 గంటలు.

* శిశువులు (4–12 నెలలు): 12–16 గంటలు. రాత్రి నిద్ర క్రమంగా స్థిరపడుతుంది.

* టాడ్లర్లు (1–2 సంవత్సరాలు): 11–14 గంటలు. ఒకటి లేదా రెండుసార్లు పగలు నిద్రతో కలిపి.

*ప్రీస్కూల్ పిల్లలు (3–5 సంవత్సరాలు): 10–13 గంటలు. మధ్యాహ్నం నిద్రతో కలిపి.

* స్కూల్ వయస్సు పిల్లలు (6–12 సంవత్సరాలు): 9–12 గంటలు.

*టీనేజర్స్ (13–18 సంవత్సరాలు): 8–10 గంటలు. సహజంగా ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా మేల్కొనే ధోరణి ఉంటుంది.

తల్లిదండ్రులూ.. మీదే బాధ్యత..

సాధారణ నిద్ర అనేది క్రమబద్ధంగా, వయస్సుకు తగిన విధంగా, రిఫ్రెష్ అయ్యేలా, అంతరాయం లేకుండా ఉండాలి. దీనివల్ల పిల్లలు ఉదయం చురుకుగా ఉంటారు. ఇందుకోసం తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి పేరెంట్స్ ఈ విషయంలో కీలకపాత్ర పోషిస్తారు. రోజు బెడ్‌టైమ్, మేల్కొనే సమయాన్ని క్రమం తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. స్నానం, స్టోరీస్ చెప్పడం, ప్రేయర్, సాఫ్ట్ మ్యూజిక్, ఇష్టమైన బొమ్మలు బ్లాంకెట్స్‌తో కంఫర్ట్ చేయడం వంటివి పడుకునే ముందు రొటీన్‌గా ఉండేలా చూసుకోవాలి. పడుకునే ఏరియా చీకటిగా, సైలెంట్‌గా, చల్లగా, కంఫర్ట్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పడుకునే సమయానికి కనీసం రెండు గంటల ముందు స్క్రీన్ ఎక్స్‌పోజర్ తగ్గిస్తే.. నిద్రకు ఆటంకం ఉండదు. ఇక పిల్లలు పగటిపూట శారీరకంగా అలసిపోవడం, సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ కావడాన్ని ప్రోత్సహిస్తే మంచిది. దీనికారణంగా వారు అలిసిపోయే ఎర్లీగా పడుకునే అవకాశం ఉంటుంది. ఇక బెడ్ టైమ్‌లో ఎక్కువగా తినడం, కెఫీన్ కలిగిన డ్రింక్స్ తీసుకోవడం మానేయాలి. ముఖ్యంగా రొటీన్ టైమ్ అనేది బాడీని అంతర్గత గడియారాన్ని బలోపేతం చేసేలా చేసి.. నిద్రకు ఉపక్రమించేలా శరీరాన్ని తయారు చేస్తుంది.

స్లీప్.. ఎందుకంత ముఖ్యం?

నిద్ర పిల్లల అభివృద్ధిలో దాదాపు ప్రతి అంశంలో కీలక పాత్ర పోషిస్తుంది. డీప్ స్లీప్ సమయంలో గ్రోత్ హార్మోన్ స్రావం గరిష్టంగా ఉంటుంది. ఇది ఎత్తు, శారీరక వృద్ధిని ప్రభావితం చేస్తుంది. మెమరీ కన్సాలిడేషన్, న్యూరల్ కనెక్టివిటీకి నిద్ర అవసరం. దీని వల్లనే మెదడు అభివృద్ధి జరుగుతుంది. కొత్తగా నేర్చుకుంటారు. అంతేకాదు రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది. భావోద్వేగ నియంత్రణ మెరుగుపడుతుంది. చిరాకు, మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. మెటబాలిక్ ఆరోగ్యం రక్షించబడుతుంది. ఊబకాయం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రిస్క్ తగ్గుతుంది.

చాలా కాలంగా నిద్ర డిస్టర్బ్ ఉంటే..

దీర్ఘకాలంగా స్లీప్ డిస్టర్బెన్స ఉన్నట్లయితే పరిణామాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పేలవమైన నిద్ర పిల్లల్లో ప్రవర్తనా సమస్యలకు దారితీస్తుందని చెప్తున్నారు. హైపర్ యాక్టివిటీ, శ్రద్ధ లేకపోవడం, చదువులో వెనుకబడిపోవడం, చిరాకు, దూకుడు, ఆందోళన, డిప్రెషన్ లక్షణాలు ఉంటాయి. సామాజిక సంబంధాలు కూడా తక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా టీనేజర్స్‌లో యాంటీసోషల్ బిహేవియర్, హింస, నేరాలకు పాల్పడటం, డ్రగ్స్ వినియోగం, రిస్క్ టేకింగ్ బిహేవియర్‌ను పెంచుతుంది. నైతికంగా ఆలోచించే శక్తిని దెబ్బతీస్తుంది.

Next Story