గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌ సంస్థ మందుతో సైడ్ ఎఫెక్ట్స్

by Disha Web Desk 2 |
గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌ సంస్థ మందుతో సైడ్ ఎఫెక్ట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గతేడాది భారత్‌కు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసిన దగ్గు మందు సేవించి గాంబియా, ఉజ్బెకిస్థాన్ దేశాల్లో చిన్నారులు మరణించారనే వార్త మరువక ముందే భారత్‌కు చెందిన మరో సంస్థపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. తమిళనాడులోని చెన్నైలో తయారైన కంటి చుక్కల మందుతో అమెరికాలో పలువురు తమ చూపును కోల్పోవడమే కాకుండా ఈ మందు ఉపయోగించడం వల్ల ఒక మరణం సంభవించడంతో ఔషధ నియంత్రణ సంస్థ రంగంలోకి దిగింది. శుక్రవారం అర్ధరాత్రి చెన్నైలోని గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ సంస్థపై తనిఖీలు నిర్వహించింది.

గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ తయారు చేసిన ఎజ్రీకేర్‌ కంటి చుక్కల మందు ఉపయోగించడం వల్ల అమెరికాలోని 12 రాష్ట్రాల్లో కనీసం 55 మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఇందులో ఒకరు ఇన్ఫెక్షన్ కారణంగా మరణించగా, మరో ఐదుగురికి కంటి చూపు పోయిందని అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌ (సీడీసీ)అధికార ప్రతినిధి ఆరోపించారు. అలాగే న్యూయార్క్‌, వాషింగ్టన్‌తో పాటు మరో 10రాష్ట్రాల్లో పలువురు కంటి చుక్కలు వేసుకున్న తర్వాత పలువురిలో బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ఊపిరితిత్తులు, రక్తం, మూత్రంలో ఇన్ఫెక్షన్‌ వంటి లక్షణాలు కనిపించాయి.

దీంతో ఈ మందు చుక్కల వినియోగం తక్షణమే నిలిపివేయాలని అమెరికా అధికారులు ఆ దేశ ప్రజలకు హెచ్చరించారు. ఈ ఘటనతో గ్లోబల్ ఫార్మా హెల్త్ కేర్ స్పందించింది. వెంటనే అమెరికా మార్కెట్ నుంచి తమ సంస్థకు చెందిన ఐ డ్రాప్ లను రికాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అమెరికాలో సంభవించిన ఈ ఘటనతో భారత్ అలర్ట్ అయింది. కేంద్రంతో పాటు తమిళనాడుకు చెందిన ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు కలిసి గ్లోబల్ ఫార్మాలో గత అర్థరాత్రి తనిఖీలు చేపట్టారు.

అమెరికాకు పంపిన బ్యాచ్‌లకు చెందిన నమూనాలతో పాటు అందులో వాడిన ముడిపదార్థాల శాంపిల్స్‌ను సేకరించారు. యూఎస్ నుంచి రికాల్ చేసి ఓపెన్ చేయకుండా ఉన్న మందు నమూనాలను కూడా సేకరించారు. తక్షణ చర్య కింద ఈ సంస్ధ మందు తయారీపై నిషేధం విధించారు. కాగా గ్లోబల్‌ ఫార్మాకు ఔషధం తయారీ, ఎగుమతి విషయంలో వ్యాలిడ్ లైసెన్స్ కలిగి ఉందని అధికారులు వెల్లడించారు. కాగా భారత్‌కు చెందిన ఔషధ సంస్థల ఉత్పత్తుల కారణంగా ఇలాంటి దుష్ప్రభావాలు వెలుగు చూడటం అంతర్జాతీయ మార్కెట్లో హాట్ టాపిక్ అవుతోంది.



Next Story

Most Viewed