భారత్‌లో వేగంగా వ్యాపిస్తున్న స్థూలకాయం.. జనాభాలో మూడో వంతు బాధితులు!

by Yella Dhawani Reddy |

ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లులో కూడా చాలా మార్పులు వచ్చాయి.

భారత్‌లో వేగంగా వ్యాపిస్తున్న స్థూలకాయం.. జనాభాలో మూడో వంతు బాధితులు!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవనశైలితో పాటు (Lifestyle) ఆహారపు అలవాట్లులో (Food habits) కూడా చాలా మార్పులు వచ్చాయి. మనలో చాలా మంది జంక్‌ఫుడ్, చిరుతిళ్లు, ప్రాసెస్డ్ ఫుడ్.. వంటి అధిక కొవ్వులు, క్యాలరీలు ఉండే ఆహార పదార్థాలకు ఎక్కువగా తింటున్నారు. పైగా శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డంతో అధిక బరువు, స్థూలకాయం (Obesity) బారిన పడుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఇటీవల కాలంలో చాలా మంది స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజా అధ్యయనం మరిన్ని షాకింగ్ విషయాలను వెల్లడించింది.

భారతదేశంలో స్థూలకాయం సమస్య చాప కింద నీరులా నిశ్శబ్ధంగా వ్యాపిస్తోందని లాన్సెట్‌లో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరించింది. 2050కల్లా భారత జనాభాలో మూడోవంతు మంది అంటే.. 44.9 కోట్ల మంది స్థూలకాయ బాధితులవుతారని అంచనా వేసింది. పురుషులతో పోలిస్తే స్త్రీలలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని తెలిపింది. టైప్‌-2 మధుమేహం, గుండె-రక్తనాళ వ్యాధులు, ఫ్యాటీ లివర్, హార్మోన్ల లోపం, వంధ్యత్వం, కొన్ని రకాల క్యాన్సర్ల వల్ల స్థూలకాయుల సంఖ్య పెరిగిపోతోందని పేర్కొంది. అయితే, పట్టణాలకు మాత్రమే స్థూలకాయం పరిమితం కాదని, గ్రామీణుల్లోనూ ఈ సమస్య కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థూలకాయ నివారణ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు.

కాగా, చాలా మంది అధిక బ‌రువు, స్థూల‌కాయం ఒక్క‌టేన‌ని అనుకుంటారు. కానీ అధిక బ‌రువు వేరు. స్థూల‌కాయం వేరు. స్థూలకాయం బారిన పడిన వారికి శ‌రీర‌మంత‌టా కొవ్వు చేరుతుంది. దీంతో బ‌రువు ఎక్కువ‌గా ఉంటారు. అధిక బరువు పెరిగితే తగ్గించుకోవచ్చు. కానీ, స్థూల‌కాయం బారిన ప‌డ్డారంటే మాత్రం ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. బ‌రువును త‌గ్గించుకోవ‌డం కోసం చాలా తీవ్రంగా శ్ర‌మించాల్సి వ‌స్తుంది. అంతేకాదు, గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం పెరుగుతుంది. ఎముక‌లు తీవ్రంగా నొప్పి వ‌స్తాయి. జ్ఞాప‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది. త‌ర‌చూ ఆయాస ప‌డుతుంటారు. ఎక్కువ‌గా విశ్రాంతి తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు.

స్థూల‌కాయం ఉన్న‌వారు పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను అధికంగా తింటుండాలి. క్యాల‌రీలు త‌క్కువ‌గా, ఫైబ‌ర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అలాగే, క్యాల‌రీలు అధికంగా ఉండే ఆహారాల‌ను, తీవ్రంగా ప్రాసెస్ చేయ‌బ‌డిన ఫుడ్స్‌ను, అనారోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, చ‌క్కెర‌లు ఉండే ఆహారాలు, సోడియం అధికంగా ఉండే ఆహారాల‌ను స్థూల‌కాయం ఉన్న‌వారు అస్సలు తినకూడదు. నీళ్ల‌ను అధికంగా తాగాలి. రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు తేలిక‌పాటి వ్యాయామం అయినా చేయాలి. ఆఫీసుల్లో ప‌నిచేసే వారు ప్ర‌తి 20 నిమిషాల‌కు ఒక‌సారి బ్రేక్ తీసుకోవాలి. ఇలా జీవ‌న‌శైలిలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే క‌చ్చితంగా స్థూల‌కాయం త‌గ్గుతుంది.

Next Story