వైన్ తాగితే బరువు పెరుగుతారా? ఆరోగ్యానికి మంచిదేనా?

by Sujitha Rachapalli |

డిన్నర్ పార్టీల్లో బెస్ట్ ఆప్షన్ వైన్. రిచ్ రెడ్ వైన్ నుంచి క్రిస్ప్ వైట్ వైన్ వరకు.. చీజ్, పాస్తా, సాల్మన్‌ను జోడించి తీసుకుంటే కిక్కే వేరంటారు వైన్ ప్రియులు. కానీ బరువు తగ్గాలనుకుంటున్న వారు మాత్రం ఈ ఎంజాయ్‌ను మిస్ అవుతుంటారు.

వైన్ తాగితే బరువు పెరుగుతారా? ఆరోగ్యానికి మంచిదేనా?
X

దిశ, వెబ్ డెస్క్: డిన్నర్ పార్టీల్లో బెస్ట్ ఆప్షన్ వైన్. రిచ్ రెడ్ వైన్ నుంచి క్రిస్ప్ వైట్ వైన్ వరకు.. చీజ్, పాస్తా, సాల్మన్‌ను జోడించి తీసుకుంటే కిక్కే వేరంటారు వైన్ ప్రియులు. కానీ బరువు తగ్గాలనుకుంటున్న వారు మాత్రం ఈ ఎంజాయ్‌ను మిస్ అవుతుంటారు. కారణం బరువు పెరుగుతారనే భయం. నిజంగా వైన్ తాగితే బరువు పెరుతామా? ఇది ఎంత వరకు నిజం? తెలుసుకుందాం.


న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. తక్కువ లేదా మితంగా వైన్ తీసుకోవడం బరువు పెరగడంపై ప్రభావం చూపలేదు. తరుచూ ఎక్కువ మొత్తంలో తీసుకుంటేనే బరువు పెరగడానికి కారణమవుతుంది. యుఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ ఆల్కహాల్ అబ్యూస్ అండ్ ఆల్కహాలిజం ప్రకారం.. స్త్రీలు 30 రోజులలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ రోజులు తాగితే.. తాగిన ప్రతిసారి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గ్లాసులు తీసుకుంటే ప్రాబ్లమ్. పురుషులు అయితే.. ఐదు లేదా అంతకంటే ఎక్కువ గ్లాసులు తాగితే సమస్య ఉండొచ్చు.

వైన్ బరువు పెరగడానికి ఎలా కారణమవుతుంది?

* ఫ్యాట్ బర్న్ ప్రాసెస్

మీ శరీరం ఆల్కహాల్‌ను (వైన్‌) విషంగా భావించి.. ముందుగా దానిని జీవక్రియ చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇది ఆల్కహాల్ తొలగించబడే వరకు ఫ్యాట్ బర్నింగ్ ప్రక్రియను నెమ్మదిస్తుంది. వైన్‌తో పాటు తీసుకున్న ఆహారం నుండి వచ్చే కేలరీలు కొవ్వుగా.. ముఖ్యంగా పొట్ట కొవ్వుగా నిల్వ చేయబడే అవకాశం ఎక్కువ.

* ఆకలి పెరుగుదల

వైన్ ఆకలి హార్మోన్లను (గ్రెలిన్ మరియు లెప్టిన్) ఉత్తేజపరుస్తుంది. ఎక్కువగా తినే అవకాశాన్ని పెంచుతుంది. ఎక్కువ ఆహారం తీసుకోవడం, ముఖ్యంగా అవి ఎక్కువ కేలరీలతో ఉంటే, బరువు పెరగడానికి దారితీస్తుంది. సాధారణంగా ఆల్కహాల్ ప్రభావంలో తీసుకునే ఆహార ఎంపికలు కార్బోహైడ్రేట్లు లేదా కొవ్వులలో ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువును మరింత పెంచుతాయి.

* హార్మోన్లు, నిద్రపై ప్రభావం

ఎక్కువ వైన్ తాగడం వల్ల ఆకలి హార్మోన్లు మాత్రమే కాకుండా... ఇన్సులిన్, కార్టిసాల్ వంటి కొవ్వు నిల్వ, ఆకలిని నియంత్రించే హార్మోన్లపై కూడా ప్రభావం చూపుతుంది. నీరసమైన నిద్ర ఆకలిని పెంచి, కాలక్రమేణా బరువు పెరగడానికి దారితీస్తుంది.

దుష్ప్రభావాలు?

- కాలేయం ఆల్కహాల్‌ను ప్రాసెస్ చేయగలదు. కానీ ఈ సామర్థ్యం పరిమితం. ఎక్కువగా తీసుకుంటే ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు దారితీస్తుంది.

- ఎక్కువ వైన్ జీర్ణకోశ లైనింగ్‌ను చికాకు గురి చేసి ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తుంది. ఇది కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ వంటి పరిస్థితులను మరింత దిగజార్చవచ్చు.

- సాయంత్రం ఎక్కువ వైన్ తాగితే నిద్రను ఆటంకపరుస్తుంది. ఇది నీరసమైన నిద్ర నాణ్యతకు, మరుసటి రోజు అలసటకు దారితీస్తుంది.

- వైన్ ఒక డైయూరెటిక్. ఇది చర్మం పొడిబారడం, తలనొప్పి, మైకము వంటి సమస్యలను కలిగిస్తుంది.

- ఎక్కువ వైన్ తీసుకోవడం స్త్రీలలో ఈస్ట్రోజెన్ సమతుల్యతను ప్రభావితం చేయవచ్చు. ఎందుకంటే ఇది ఆరోమాటేస్ అనే ఎంజైమ్‌ను ఉత్తేజపరుస్తుంది. ఇది ఆండ్రోజెన్‌లను ఈస్ట్రోజెన్‌లుగా మారుస్తుంది. అలాగే ఎక్కువ ఆల్కహాల్‌తో కాలేయం దెబ్బతినడం వల్ల ఈస్ట్రోజెన్‌ను విచ్ఛిన్నం చేసి తొలగించే సామర్థ్యం తగ్గుతుంది. ఇది కడుపు తిమ్మిరి, ఉబ్బరం వంటి ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాలను మరింత దిగజార్చవచ్చు.

Next Story