అధిక బరువు పిల్లల్లో ఈ అసాధారణ వ్యాధులు.. కారణం తల్లిదండ్రులే..

by Sujitha Rachapalli |

పిల్లల్లో ఊబకాయం.. ప్రపంచంలో రెండో స్థానంలో ఇండియా.. ఐదేళ్ల లోపు పిల్లల్లో దాదాపు 127% పెరుగుదల.. అధిక స్క్రీన్ టైమ్ ప్రధాన శత్రువు.. డయాబెటిస్, రక్తపోటు, ఫ్యాటీ లివర్ వ్యాధులకు దారి

అధిక బరువు పిల్లల్లో ఈ అసాధారణ వ్యాధులు.. కారణం తల్లిదండ్రులే..
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలో పిల్లల్లో ఊబకాయం (Childhood Obesity) వేగంగా పెరుగుతోంది. NFHS-5 డేటా ప్రకారం ఐదేళ్ల లోపు పిల్లల్లో అధిక బరువు 127% పెరిగింది. టీనేజ్ అమ్మాయిల్లో 125%, టీనేజ్ అబ్బాయిల్లో 288% పెరుగుదల కనిపిస్తుండగా.. 2030 నాటికి ఇండియాలో 27 మిలియన్లకు పైగా పిల్లలు, టీనేజర్స్ ఊబకాయంతో ఉండవచ్చని అంచనా. కాగా ఇది ప్రపంచ భారంలో సుమారు 11%గా ఉంది. 2026 World Obesity Atlas ప్రకారం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉండగా.. ఈ క్రమంలోనే బాల్య ఊబకాయం పెరగడానికి ప్రధాన కారణాలు వివరిస్తున్నారు నిపుణులు.

1. గంటల కొద్దీ ఫోన్లు చూడటం.. బయట ఆడుకోవడం, వ్యాయామం చేయకపోవడం.. ఊబకాయం ప్రమాదానికి ప్రధాన కారణం.

2. షుగర్ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ పెరిగి కొవ్వు నిల్వ అవుతుంది.

3. తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఏదైనా తినాలనే కోరిక పెరిగి... అధిక క్యాలరీల ఆహారం వైపు అట్రాక్ట్ అవుతున్నారు.

4. చదువు ఒత్తిడి, పోటీ, సామాజిక ఆందోళనల వల్ల పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు. దీన్ని తగ్గించుకునేందుకు చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్థాలు తింటున్నారు.

5. జన్యువులు కొంత ప్రభావం చూపవచ్చు. తల్లిదండ్రుల ఆహారం, వ్యాయామం, స్క్రీన్ అలవాట్లను పిల్లలు అనుసరిస్తారు కాబట్టి కుటుంబం మొత్తం ఆరోగ్యకరమైన అలవాట్లు పాటిస్తే మంచిది.

ఆరోగ్య పరిణామాలు :

ఆధునిక జీవనశైలి.. అంటే నగరీకరణ, స్మార్ట్ ఫోన్లు వాడటం, జంక్ ఫుడ్ తీసుకోవడం సమస్యను మరింత పెంచుతోంది. గతంలో అరుదుగా కనిపించే వ్యాధులు ఇప్పుడు సాధారణమవుతున్నాయి. టైప్-2 డయాబెటిస్, రక్తపోటు (హైపర్‌టెన్షన్), ఫ్యాటీ లివర్ వ్యాధులు వచ్చేస్తున్నాయి. అందుకే స్క్రీన్ టైమ్ తగ్గించి, రోజూ బయట ఆడుకోవడాన్ని ప్రోత్సహించాలంటున్న నిపుణులు.. ఇంటి వంటలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఇవ్వాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్ తగ్గించి.. స్లీప్ షెడ్యూల్ పాటించాలని సూచిస్తున్నారు. కుటుంబంలో మంచి వాతావరణం సృష్టించాలని.. ఇది ఒత్తిడి నిర్వహణకు కారణమై.. ఎమోషనల్ ఈటింగ్‌ను నిరోధిస్తుందని చెప్తున్నారు.

Next Story