నిద్ర అందరికీ అవసరమే కానీ.. స్త్రీలకు మరింత ఎక్కువ అవసరం..! ఎందుకంటే..

by Javid Pasha |   (  Updated:2025-07-15 11:05:20  IST  )

నిద్ర అందరికీ అవసరమే కానీ.. స్త్రీలకు మరింత ఎక్కువ అవసరం..! ఎందుకంటే..

నిద్ర అందరికీ అవసరమే కానీ.. స్త్రీలకు మరింత ఎక్కువ అవసరం..! ఎందుకంటే..
X

దిశ, ఫీచర్స్ : మానవ సహజ లక్షణాల్లో నిద్రపోవడం ఒకటి. ఇది ఆనందానికి, ఆరోగ్యానికి, మెరుగైన జీవితానికి దారితీస్తుంది. అయితే పురుషులతో పోలిస్తే సహజంగానే స్త్రీలకు మరింత ఎక్కువ నిద్ర అవసరమని ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. స్త్రీల మెదడు నిర్మాణం బహుళ పనులు(మల్టీ టాస్కింగ్) చేయడానికి అనుగుణంగా ఉండటం, రోజంతా క్రియాశీలంగా పనిచేయడం వంటి బ్రెయిన్ యాక్టివిటీస్ ఇందుకు కారణమని పేర్కొన్నది.

అమ్మాయిలు లేదా స్త్రీలు ఎక్కువ నిద్రపోవడాన్ని కొందరు సోమరితనంతో పోలుస్తుంటారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవమని లఫ్‌బరో యూనిర్సిటీలోని స్లీప్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనం చెబుతున్నది. నిజానికి మెదడును ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఎక్కువ విశ్రాంతి, పునరుద్ధరణ(More rest, restorative) అవసరం అవుతాయి. స్త్రీలలో ఎక్కువ నిద్రకు కూడా ఇదే వర్తిస్తుందని తెలిపింది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో మల్టీ టాస్కింగ్ బ్రెయిన్ యాక్టివిటీ అధికంగా ఉండటం కారణంగా సహజంగానే సగటున 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవసరం అవుతుందని అధ్యయనం పేర్కొన్నది.

నిద్రవల్ల కలిగే ప్రయోజనాలు

* మెదడు పనితీరులో మెరుగుదల : నిద్ర జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్‌ను మెరుగుపరుస్తుంది. రాత్రి నిద్ర సమయంలో మెదడు రోజంతా సేకరించిన సమాచారాన్ని ప్రాసెస్ చేసి, జ్ఞాపకాలుగా మారుస్తుంది.

*శారీరక ఆరోగ్యం : నిద్ర శరీర కణాల పునరుద్ధరణను ప్రేరేపిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఫలితంగా హార్మోన్ల సమతుల్యతకు దోహదపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని రక్తపోటును నియంత్రించడం ద్వారా మెరుగుపరుస్తుంది. జీవక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడుతుంది.

*మానసిక ఆరోగ్యం : తగినంత నిద్రపోవడమనేది ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది మానసిక స్థిరత్వాన్ని, భావోద్వేగ నియంత్రణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా నిద్ర శరీరానికి శక్తిని పునరుద్ధరిస్తుంది, రోజువారీ కార్యకలాపాలలో ఉత్సాహాన్ని, ఉత్పాదకతను పెంచుతుంది.

స్త్రీ, పురుషులకు కలిగే వేర్వేరు బెనిఫిట్స్

*స్త్రీలు : లఫ్‌బరో యూనివర్సిటీ అధ్యయం ప్రకారం.. స్త్రీలకు పురుషుల కంటే సగటున 20 నిమిషాలు ఎక్కువ నిద్ర అవసరం. మల్టీ టాస్కింగ్ బ్రెయిన్ యాక్టివిటీస్ కారణంగా మహిళలకు ఎక్కువ పునరుద్ధరణ, విశ్రాంతి కూడా కావాలి. అలాగే స్త్రీలలో ఈస్ట్రోజెన్ అండ్ ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలు నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా రుతుచక్రం, గర్భం, లేదా మెనోపాజ్ సమయాల్లో మానసిక సమతుల్యత, హార్మోన్ల నియంత్రణకు నిద్ర మరింత కీలకం కావచ్చు.

* పురుషులు : పురుషుల విషయంలో నిద్ర సాధారణంగా శారీరక పునరుద్ధరణ(Physical recovery), టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది. పురుషులు సాధారణంగా తక్కువ మల్టీటాస్కింగ్ చేసే అవకాశం ఉండటం వల్ల వారి మెదడుకు అదనపు నిద్ర అవసరం కొంత తక్కువగా ఉండవచ్చు. అయితే, ఒత్తిడి లేదా శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నప్పుడు పురుషులకు కూడా తగినంత నిద్ర అవసరం. ఇక నిద్ర ప్రయోజనాల విషయానికి వస్తే స్త్రీ పురుషులిద్దరూ నిద్రవల్ల కలిగే సాధారణ ప్రయోజనాలను పొందుతారు, కానీ స్త్రీలకు మల్టీటాస్కింగ్ అండ్ హార్మోన్ల సంక్లిష్టత(hormonal complications.) వల్ల నిద్ర కాస్త ఎక్కువే అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి.

Next Story