కరోనా నిరోధానికి మార్గదర్శకాలు

by  |
కరోనా నిరోధానికి మార్గదర్శకాలు
X

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ ఒక్కో దేశానికి వ్యాప్తి చెందుతుండటంతో చాలా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. భారత్‌లో సైతం పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మొదలు రాష్ట్రాల మంత్రుల వరకు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వైరస్ వ్యాప్తి నిరోధకంపై దృష్టి పెట్టారు. తెలంగాణలో ఒక పాజిటివ్ కేసు నమోదు కావడంతో వరుసగా రెండు రోజుల పాటు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి నేతృత్వంలో వివిధ శాఖల మంత్రులు, అధికారులు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అనుమానితులకు చికిత్స అందించే వైద్యులు, మెడికల్ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు తయారవుతున్నాయి.

ప్రస్తుతానికి నిమ్స్ వైద్యులు ఒక బృందంగా ఏర్పడి పదిహేను మార్గదర్శకాలను తయారుచేశారు. మరో రెండు రోజుల్లో ఇంకొన్ని రూపొందించనున్నారు. ఇవే మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల్లో అమలుచేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ మార్గదర్శకాలు వైద్యులు, మెడికల్ సిబ్బందిని ఉద్దేశించి తయారుచేస్తున్నవే. కానీ ఆసుపత్రి నుంచి ఇళ్ళకు వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులకు కూడా సోకే అవకాశం ఉన్నందున ఇళ్ళల్లోనూ పాటించడంపై వైద్యులు ఈ మార్గదర్శకాల్లో ప్రస్తావించారు. కేవలం ఆసుపత్రులకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బందికి కూడా ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు పాటించేలా ప్రభుత్వం వర్తింపజేసే అవకాశం ఉంది. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఇప్పటికే కొన్ని పోస్టర్లను ప్రభుత్వం తయారుచేసింది. పాటించాల్సినవి, చేయకూడని అంశాలపై ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలను చేపట్టింది.

ముఖ్యంగా విదేశాల్లో సెమినార్లు, మీటింగులకు హాజరయ్యేవారితో పాటు ఇక్కడ కూడా పాటించాల్సిన అంశాలపై నిమ్స్ వైద్యులు కసరత్తు చేశారు. కేరళలో పాజిటివ్ కేసులతో పాటు అనుమానితులకు చికిత్స అందించే క్రమంలో వైద్యులకు, నర్సులకు సోకిన ఇన్‌ఫెక్షన్ అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ పునరావృతం కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది. తెలంగాణ భౌగోళిక వాతావరణంలో కరోనా వైరస్ ఎక్కువకాలం ఉనికిలో ఉండదనే భరోసా ఉన్నప్పటికీ ఏయే రీతుల్లో వ్యాప్తిచెందే అవకాశం ఉందో అధ్యయనం చేస్తున్నారు వైద్యులు. వేసవికాలంలో తీవ్రమైన ఎండ సమయంలో ఈ వైరస్ బతకలేదన్న దీమాను కొద్దిమంది వైద్యులు వ్యక్తం చేశారు. అప్పటివరకూ పాటించాల్సిన కొన్ని మార్గదర్శకాలను మాత్రం రెండు మూడు రోజుల్లో వెల్లడించనున్నారు. అందులో మచ్చుకు కొన్ని…

– వ్యక్తులతో షేక్ హ్యాండ్ చేయరాదు. ఈ విషయాన్ని సమావేశానికి వచ్చిన ప్రతినిధులకు అర్థం చేయించాలి.
– వీలైనంతవరకు చేతికి గ్లౌజులు వేసుకోవాలి.
– ముక్కు, నోటికి మాస్క్ ధరించాలి.
– వైరస్ ఎక్కడైనా ఉండే అవకాశం ఉన్నందువల్ల గ్లౌజులు లేకుండా తలుపులు, గడి, టేబుళ్ళు తదితరాలను ముట్టుకుంటే వెంటనే శానిటైజర్‌తో చేతుల్ని శుభ్రం చేసుకోవాలి లేదా సబ్బుతో కడుక్కోవాలి.
– ఈ వైరస్ గాలిద్వారా వ్యాపించే అవకాశం లేనందువల్ల మాట్లాడే సమయంలో లాలాజలం తుంపరల ద్వారా, స్పర్శ ద్వారా వ్యాపిస్తుంది. అందువల్ల ఆసుపత్రుల్లో తరచుగా శుభ్రతా పనులు (శానిటైజేషన్) జరుగుతుండాలి.
– వైరస్ అనుమానితులతో మాట్లాడేటప్పుడు కనీసంగా ఒక మీటరు దూరాన్ని పాటించాలి.
– పబ్లిక్ స్థలాల్లోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూనే ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసే నీటిలో కనీసంగా 75 గ్రాముల ఉప్పును వేసుకుని స్నానం చేయాలి.
– గుడ్డతో తయారుచేసిన కర్చీఫ్‌లకు బదులుగా పేపర్‌తో తయారుచేసిన డిస్పోజబుల్ పేపర్ నాప్‌కిన్‌లను వినియోగించాలి.
– వీలైనంత వరకు చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలను మరింత ఎక్కువగా ఆచరించాలి.


Next Story