52 ఏళ్ల వయసులో పీజీ చేస్తున్న ఇంగ్లాండ్ మహిళ

9

దిశ, వెబ్‌డెస్క్: చుట్టూ యంగ్ స్టూడెంట్స్.. వారి మధ్యలో ఓ యాభై ఏళ్ల మహిళ కూర్చొని ఉంది. తనకన్నా వయసులో చిన్నోళ్లే అక్కడ ప్రొఫెసర్లుగా పాఠాలు చెబుతున్నారు. కానీ తను మాత్రం శ్రద్ధగా క్లాసులు వింటూ, నోట్స్ రాసుకుంటోంది. అయితే, ఆమె క్లాసులు ఎలా చెబుతున్నారో వినడానికి వచ్చిన కళాశాల డీన్ కాదు, ప్రొఫెసర్ అంతకన్నా కాదు. ఆమె కూడా చదువుకోవడానికి వచ్చిన ఓ సాధారణ గృహిణి. చదువుకోవాలనే తపన ఉంటే, వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్న ఆ మహిళే.. ఇంగ్లాండ్‌కు చెందిన 52 ఏళ్ల మారిసా ఒహరా. అబెరిస్ట్‌విత్ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సు చేస్తున్న మారిసా గురించిన విశేషాలేంటో తెలుసుకుందాం.

మారిసాకు ఐదుగురు పిల్లలు. అంతేకాదు మనవలు, మనవరాళ్లు కూడా ఉన్నారు. ఇన్నేళ్లు ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిన మారిసా.. ఇప్పుడు తన కోసం కూడా కాస్త టైమ్ కేటాయించుకోవాలనుకుంది. తన కోరికలను కూడా నెరవేర్చుకోవాలనుకుంది. పదిహేనేళ్ల క్రితమే డిగ్రీ చేసిన తను.. మళ్లీ కాలేజీలో అడుగుపెట్టాలనుకుంది. చదువుకోవాలనే తన తపనకు కుటుంబ సభ్యుల సహకారం కూడా తోడైంది. ఇక ఆలస్యం చేయకుండా.. అబెరిస్ట్‌విత్ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుకు దరఖాస్తు చేసింది. ఆగస్టులో స్కైప్ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొన్న మారిసా.. ఇంటర్వ్యూ క్లియర్ చేసి, యూనివర్సిటీలోని పీజీసీఈ కోర్సులో జాయిన్ అయ్యింది.

‘నా వయసు 52 అనేది నా చదువుకు ఏ మాత్రం అడ్డంకి కాదు. మన మనసులో ఏది చేయాలనిపిస్తే అది చేయాలి. ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయరు. మనకు మనమే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. మన కలలను సాకారం చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదని అందరూ గుర్తుంచుకోవాలి. పదిహేనేళ్ల తర్వాత క్లాసులో అడుగుపెడుతుంటే చాలా సంతోషంగా ఉంది. మొదట నేను యూనివర్సిటీ హాస్టల్‌లో ఉండటానికి కాస్త ఆలోచించాను. కానీ యూనివర్సీటి వారి సహకారంతో నేను కాస్త మెచ్చూర్డ్ స్టూడెంట్స్‌తో ఉండేలా ప్లాన్ చేశారు. 29, 28,24 ఏళ్ల వయసు వారితో నా బ్లాక్‌లో ఉంటున్నాను. ఇవి చాలా ఆనందమైన క్షణాలు. నేను చదువుకోవడానికి నా కుటుంబం ఎంతో సపోర్ట్‌గా నిలిచింది. ప్రతిరోజు వారితో మాట్లాడుతున్నాను’ అని మారిసా చెప్పుకొచ్చింది.

‘మా అమ్మ యూనివర్సిటీ క్లాసులోకి అడుగుపెట్టింది. డ్రీమ్స్‌ను అచీవ్ చేసేందుకు వయసు అడ్డంకి కాదని మరోసారి నిరూపించింది. అమ్మను చూస్తే.. చాలా గర్వంగా ఉంది’ అని మారిసా కూతురు కత్రిన ట్వీట్ చేసింది.