దేశీయంగా 5జీ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతి!

by  |
దేశీయంగా 5జీ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతి!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో 5జీ టెక్నాలజీ, స్పెక్ట్రమ్ ట్రయల్స్ నిర్వహించేందుకు టెలికమ్యూనికేషన్ విభాగం అనుమతిచ్చింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్(టీఎస్‌పీ)కి టెలికమ్యూనికేషన్ విభాగం(డీఓటీ) మంగళవారం ఆమోదం తెలిపింది. దీనికోసం దరఖాస్తు చేసుకున్న భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎమ్‌టీఎన్ఎల్ కంపెనీలు ట్రయల్స్ నిర్వహించవచ్చని పేర్కొంది. ఇదే సమయంలో ఈ కంపెనీలు చైనాకు చెందిన టెక్నాలజీ పరిజ్ఞానాన్ని వినియోగించకూడదని స్పష్టం చేసింది. ఈ టెలికాం ప్రొవైడర్లు ట్రయల్స్ నిర్వహించడానికి ఎరిక్సన్, శాంసంగ్, నోకియా, రిలయన్స్ జియో అభివృద్ధి చేసిన టెక్నాలజీ ప్రొవైడర్లతో ఒప్పందం చేసుకున్నాయని కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ సొంత దేశీయ టెక్నాలజీ పరిజ్ఞానంతో ట్రయల్స్ నిర్వహించనుంది. ఈ 5జీ ట్రయల్స్ నిర్వహణను పట్టణాల్లో మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిర్వహించేందుకు కేంద్రం అనుమతిచ్చింది. దీనివల్ల 5జీ టెక్నాలజీ ప్రయోజనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని మంత్రిత్వ శాఖ అనుమతుల్లో పేర్కొంది. కాగా, దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి 5జీ టెక్నాలజీ ట్రయల్స్‌ని డీఓటీ ప్రోత్సహిస్తోంది. ఈ టెక్నాలజీని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ వైర్‌లెస్ టెక్నాలజీ, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్‌లు అభివృద్ధి చేస్తున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే గనక డ్రోన్ ఆధారిత వ్యవసాయం, టెలీ ఎడ్యుకేష, టెలీ మెడిసిన్, ఆరోగ్య, రవాణా, స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ సిటీలు, ట్రాఫిక్ నిర్వహణ వంటి వాటిలో అనేక మార్పులు జరగనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



Next Story