సర్వేలతో సరి.. పరిహారం ఏది మరి..?

by  |
సర్వేలతో సరి.. పరిహారం ఏది మరి..?
X

దిశ, భూపాలపల్లి: జిల్లాలో గత రెండు సంవత్సరాలుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట తీవ్రంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. కేవలం సర్వేలకి పరిమితమైన అధికారులు పరిహారం చెల్లించడంలో శ్రద్ధ వహించడం లేదు. భారీ వర్షాలు వచ్చిన సమయంలో అధికారులు, నాయకులు కంటి తుడుపు చర్యగా రైతులకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీలు ఇస్తున్నారు తప్ప వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్నారు. 2020 ఖరీఫ్ కాలంలో ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని 11 మండలాల్లో పత్తి, వరి పంట భారీగా నష్టం పోయింది.

రైతులు వేసిన పత్తి పంటలు నీట మునిగిపోవడంతో ఎర్ర పడిపోయి దిగుమతి పూర్తిగా తగ్గిపోయింది. ముఖ్యంగా గోదావరి, మానేరు, మోరంచ, చలివాగు పరివాహక ప్రాంతంలోని రైతులకు తీవ్ర నష్టం ఏర్పడింది. దీంతో కనీసం రైతులకు వరి ప్రత్తి పంటలో పెట్టుబడి రాలేదు. ఆ సమయంలో అప్పటి కలెక్టర్ అబ్దుల్ అజీం పంట నష్ట విషయంపై సర్వేలు చేయించి, పరిహారం అందేలా తీసుకుంటామని ప్రభుత్వానికి నివేదిక పంపానని రైతులకు భరోసా ఇచ్చినప్పటికి.. ఇప్పటికీ అది మాత్రం అమలు కాలేదు. జిల్లాలోని కాటారం, మహదేవ్ పూర్, మహాముత్తారం, మల్హర్,మొగుళ్లపల్లి ,టేకుమట్ల, భూపాలపల్లి, రేగొండ, చిట్యాల మండలంలో రైతుల పరిస్థితి గత రెండేళ్లుగా ఆగమ్యగోచరంగా తయారైంది. గత సంవత్సరం కేవలం పండించిన రైతులకు పంట దిగుబడి రాలేదు, ధర లేదు, కనీసం పెట్టుబడిరాలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారు. ఈ ఏడాది సెప్టెంబర్లో 6 నుంచి 8 వరకు కురిసిన భారీ వర్షాల వలన జిల్లాలో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు.

ఈ ఏడాది భూపాలపల్లి జిల్లాలో ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు ఎకరాల్లో పంట నష్టం జరగగా 4075 మంది రైతులు పంట నష్టపోయారు. పలిమెల మండలంలో 375 ఎకరాల్లో పంట నష్టం 159 మంది రైతులు నష్టపోయారు. మహ దేవపూర్ లో 2358 పంట నష్టం జరగగా 1757 మంది రైతులు నష్టపోయారు. కాటారం మండలం లో 1250 రెండు ఎకరాల్లో పంట నష్టం జరగగా 593 మంది రైతులు నష్టపోయారు. మహాముత్తారం మండలంలో 30 ఎకరాల్లో పంట నష్టం 50 మంది రైతులు నష్టపోయారు. టేకుమట్ల మండలంలో 936 ఎకరాలలో పంట నష్టం జరగగా 702 మంది రైతులు పంట నష్ట పోయారు. మొగుళ్లపల్లి మండలంలో 43 ఎకరాల్లో పంట నష్టం జరగగా 31 మంది రైతులు పంట నష్టపోయారు. రేగొండ మండలంలో 144 ఇతరులు పంట నష్టం జరగగా 220 మంది రైతులు నష్టపోయారు. చిట్యాల మండలం లో 458 ఎకరాల్లో పంట నష్టం జరగగా 352 మంది రైతులు నష్టపోయారు. ఘన్ పూర్ మండలంలో 54 ఎకరాల్లో పంట నష్టం జరిగగా 36 మంది రైతులు నష్టపోయారు. భూపాలపల్లి మండలంలో ఎనభై ఐదు ఎకరాల్లో పంటనష్టం జరగగా 49 మంది రైతులు నష్టపోయారు.

పరిహారం అందించడంలో జాప్యం ఎందుకు..?

పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని ఆ సమయంలో అధికార, ప్రతిపక్ష నాయకులు, రైతులకు హామీలు ఇస్తూ మరిచిపోతున్నారు. అధికారులు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించి హామీలు ఇస్తున్నారు తప్ప పరిహారం అందించడంలో విఫలం అవుతున్నారు. గత రెండు సంవత్సరాల నుండి భూపాలపల్లి జిల్లాలో రైతులు కన్నీరు పెడుతున్న, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, రైతులకు పరిహారం అందించడంలో శ్రద్ధ వహించడం లేదు. నీట మునిగిన వరి పత్తి పంటలకు దిగుబడి రాక రైతులు అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రైతాంగానికి పరిహారం చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Next Story

Most Viewed