ఏప్రిల్‌లో బంగారం దిగుమతుల్లేవ్!

by  |
ఏప్రిల్‌లో బంగారం దిగుమతుల్లేవ్!
X

దిశ, సెంట్రల్ డెస్క్: ఏప్రిల్‌లో బంగారం దిగుమతులు దారుణంగా పడిపోయాయి. వరుసగా ఐదో నెలలో దిగుమతులు తగ్గడం గమనార్హం. ఏప్రిల్‌లో బంగారం దిగుమతులు 28.3 లక్షల డాలర్లు అంటే రూ. 21 కోట్లకు పడిపోయాయి. 2019 ఇదే నెలలో 397 కోట్ల డాలర్లు అంటే రూ. 29,775 కోట్ల విలువైన బంగారం దిగుమతులు దేశంలో జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. బంగారం దిగుమతులు గతేడాది డిసెంబర్ నుంచి ప్రతి నెలా తగ్గుతూనే ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 2,820 కోట్ల డాలర్ల విలువైన బంగారం దిగుమతులు జరగ్గా, అంతకుముందు 2018-19లో 3,291 కోట్ల డాలర్ల విలువైన బంగారం దిగుమతులు జరిగాయి. బంగారం దిగుమతులు వరుసగా ఐదవ నెలలోను పడిపోవడంతో దేశ వాణిజ్య లోటు 1,533 కోట్ల డాలర్ల నుంచి 680 కోట్ల డాలర్లకు దిగొచ్చింది. అలాగే, ముత్యాలు, ఆభరణాల ఎగుమతులు సైతం ఏప్రిల్ నెలలో 360 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ. 270 కోట్లకు పరిమితమయ్యాయి. వాల్యూమ్ పరంగా కూడా బంగారం దిగుమతులు ప్రతి ఏటా 800 నుంచి 900 టన్నులు ఉంటాయి. అయితే, ఏప్రిల్ నెలలో ఇందులో 98.74 శాతం పడిపోయింది. అంటే దాదాపు వంద శాతానికి సమీపం.

కారణాలు..

గత కొంత కాలంగా బంగారం ధరలు స్థిరంగా లేవు. అంతకుముందు వరకూ ఆర్థిక మందగమనం వల్ల డిమాండ్ క్షీణించడంతో దిగుమతులు తగ్గాయి. ఈ ఏడాది గత మూడు నెలలుగా కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ ఆంక్షలతో బంగారం విక్రయాలు నిలిచిపోయాయి. దీనికి తోడు ఈక్విటీ మార్కెట్లు నష్టాల పాలవడం, చమురు మార్కెట్ పడిపోవడంతో పెట్టుబడిదారులు ఎక్కువగా బంగారంపై ఆసక్తి చూపించారు. ఈ పరిణామాలతో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇలా పలు కారణాలతో బంగారం దిగుమతులు తగ్గుముఖం పట్టాయి.



Next Story