సర్వే లొల్లి.. ఉద్యోగులకు బెదిరింపులు 

by  |
సర్వే లొల్లి.. ఉద్యోగులకు బెదిరింపులు 
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయేతర ఆస్తుల సర్వే జీహెచ్ఎంసీ అధికారులకు, సిబ్బంది ఉద్యోగానికి ఎసరు పెడుతోంది. సర్వే సిబ్బందికి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకోకుండానే ఉన్నతాధికారులు వేటు వేస్తున్నారు. కుటుంబ సమస్యలున్నా, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా సర్వేలో పాల్గొనాల్సిందేనని ఉన్నతాధికారులు సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు. ఇదిలా ప్రజలు తమ ఆస్తుల వివరాలు ఎందుకివ్వాలి, సర్వే లేదు ఏం లేదు.. వెళ్లిపోవాలంటూ ప్రజలు ఎదురు మాట్లాడుతున్నారు. చార్మినార్ జోన్‌లో సిబ్బందిపై దురుసుగా మాట్లాడుతూ.. దాడి చేసినంత పని చేస్తున్నారు. ఏమీ మాట్లాడలేని స్థితిలో సర్వే ముందుకు సాగడం లేదు. విద్యార్హత, అనుభవం లేని సిబ్బంది వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. వాటిని పరిష్కరించిన తర్వాతే సర్వే విధులు కేటాయించాలని గ్రేటర్ కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే కోసం అధికారులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో కేటాయించారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లే సర్వే సిబ్బందిలో బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల కిందిస్థాయి మాత్రమే ఉంటారు. ఇంటర్ కంటే ఎక్కువ విద్యార్హతలేని శానిటేషన్, ఎంటమాలజీ, సీఎఫ్ఏ, జవాన్లుగా పనిచేస్తున్న సిబ్బంది నేరుగా ప్రజలను ప్రశ్నలడుగుతూ సర్వే చేస్తున్నారు. సర్వే చేస్తున్న సమయంలో వివరాలు ఎందుకు చెప్పాలి, అసలు మీరు జీహెచ్ఎంసీ సిబ్బందేనా.. ఐడీ కార్డులేవీ అంటూ ప్రశ్నిస్తున్నారు. చార్మినార్ జోన్ పరిధిలో కొందరైతే సిబ్బందిని బూతులు తిడుతూ దాదాపు కొట్టినంత పనిచేస్తున్నారు.

వివరాలు నమోదు చేయడంలో ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో, వ్యవహరించాలో ప్రభుత్వం నుంచి ఎలాంటి శిక్షణనివ్వలేదు. దీంతో ఆస్తుల యజమానుల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో సిబ్బంది తడబడితే వాగ్వాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చార్మినార్ జోన్‌లో కొన్ని సర్కిళ్లలో సిబ్బందిని గేటు లోపలికి రానివ్వడం లేరు. బూతులు తిడుతూ దాడులకు దిగుతున్నారని చెబుతున్నారు. చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, డబుర్ పురా వంటి ఏరియాల్లో సిబ్బందిపై దాడులకు దిగుతున్న ఘటనలు గుర్తు చేస్తున్నారు.

బల్దియా సిబ్బందిపై వేటు భయాలు…

సర్వే విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బల్దియా పరిధిలోని అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారు. వివాదాస్పదంగా మారుతున్న చార్మినార్ జోన్‌లోనే నలుగురి సిబ్బందిపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. వీరిలో ఒక డిప్యూటీ కమిషనర్ కూడా ఉండటం గమనార్హం. ఈ జోన్ పరిధిలోని కొందరు రాజకీయ పార్టీలు, ఓ వర్గానికి చెందిన యువత సిబ్బందిపై దురుసుగా వ్యవహరిస్తున్నారు. కొందరైతే భయభ్రంతులకు గురిచేస్తూ సిబ్బందిని తిప్పి పంపిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులైతే పర్వాలేదు గానీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని అయితే ఆట ఆడుకుంటున్నారు. దీంతో అయినంత వరకే సర్వేలను సిబ్బంది పూర్తి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ విధులు సరిగా నిర్వహించడం లేదంటూ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు ఇస్తున్నారు. చార్మినార్ జోన్‌లో ఇద్దరు శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లను జోనల్ కమిషనర్ సస్పెండ్ చేశారు. రోజుల వ్యవధిలోనూ సంతోష్ నగర్ డిప్యూటీ కమిషనర్‌తో పాటు మరో ఉద్యోగిపై వేటు పడింది.

సర్వేలో పాల్గొనకున్నా కష్టమే…

శిక్షణ లేకపోయినా సర్వేలో పాల్గొంటూ సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో వారికెలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో చెప్పేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏదీ కనిపించడం లేదు. మరో వైపు అనారోగ్యం, కుటుంబ సమస్యలున్నా సర్వే డ్యూటీకి రావాల్సిందేనని సిబ్బందిపై జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారు. సెంట్రల్ జోన్ పరిధిలోని ఓ కార్మికుడి కొడుకు నాలుగు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. దీంతో తనకు నాలుగు రోజులు సెలవు మంజూరు చేయాలని కోరినా ఉన్నతాధికారులు స్పందించలేదు. సర్వే డ్యూటీకి రాకుంటే ఇక ఉద్యోగానికి రానవసరం లేదంటూ చెప్పేశారు. దీంతో తోటి కార్మికులతో కన్నీళ్లు పెట్టుకుంటూ తన కష్టాన్ని చెప్పుకొచ్చారు.

శిక్షణతో పాటు బందోబస్తు ఏర్పాటు చేయాలి

జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లనే కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంతగా చదువుకోని వారిని సర్వే విధులకు కేటాయించారు. కొన్ని సర్కిళ్లలో సిబ్బందిపై ఎంత దురుసుగా మాట్లాడుతున్నారో అధికారులు తెలుసుకోవాలి. వారిని ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు. కొట్టేందుకు వెళ్తుండటంతో కార్మికులు వెనుదిరిగి వస్తున్నారు. చార్మినార్ జోన్ పరిధిలో సర్వేకు వెళ్తున్న సిబ్బందికి పోలీస్ బందోబస్తు ఇవ్వాలి. కార్మికుల ప్రాణాలంటే అధికారులకు లెక్కలేదు. చదువుకున్న వారిని సర్వేకు కేటాయించాలి. – ఊదరి గోపాల్, బీఎంఎస్ కార్మిక నాయకుడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed