‘చెత్త’ ఫిర్యాదులు రావొద్దు : మేయర్

by  |
‘చెత్త’ ఫిర్యాదులు రావొద్దు : మేయర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఖైరతాబాద్ జోన్ పరిధిలో మరో పది రోజుల తర్వాత చెత్తకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రావొద్దని మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులకు సూచించారు. పబ్లిక్ టాయిలెట్లను ధ్వంసం చేయడంతో పాటు వాటిలోని పరికరాలను దొంగిలించేవారిని గుర్తించి కేసులు నమోదు చేయాలన్నారు. గురువారం ఖైరతాబాద్‌లో జోనల్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో గ్రీనరీని పెంపొందించడంతో పాటు నగర సుందరీకరణకు అధిక సంఖ్యలో చెట్లను నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిబంధనలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని బిన్ లెస్ సిటీగా మార్చడాన్ని ప్రస్తావిస్తూ వీధుల్లో పేరుకుపోయే చెత్తను వెంటనే తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పబ్లిక్ టాయిలెట్ల పర్యవేక్షణను సమీపంలోని స్ట్రీట్ వెండర్లకు అప్పగించాలని సూచించారు. 60 ఏళ్లకు పైబడ్డ పారిశుధ్య కార్మికులను గుర్తించి వారి స్థానంలో వారు సూచించిన కుటుంబ సభ్యులకు నియామకాలు జరపాలని మేయర్ తెలిపారు. నగరంలో కరోనా తిరిగి ఉధృతమవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫాగింగ్, స్ప్రేయింగ్, శానిటైజేషన్‌లను నిర్వహించాలని ఎంటమాలజి అధికారులను ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాల్లో నగర పౌరులను భాగస్వామ్యం చేసేందుకు పరిచయం కార్యక్రమం, శానిటేషన్ సిబ్బంది వివరాలను తెలిపే వాల్ రైటింగ్‌లను తిరిగి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జోనల్ కమిషనర్ ప్రావీణ్యతో పాటు డిప్యూటీ కమిషనర్లు, విభాగాల అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed