మెజార్టీ అక్కర్లే.. గ్రేటర్ పీఠం టీఆర్ఎస్‌దే!

by  |
మెజార్టీ అక్కర్లే.. గ్రేటర్ పీఠం టీఆర్ఎస్‌దే!
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం150 డివిజన్లలో మూడు ప్రధాన పార్టీలకూ మ్యాజిక్ ఫిగర్ (50%) లభించలేదు. దీంతో మేయర్ ఎన్నికపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఏ పార్టీ మద్దతుతో ఏ పార్టీ అభ్యర్థి మేయర్ అవుతారన్నది చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ అత్యధిక కార్పొరేటర్లను గెల్చుకున్న పార్టీగా మేయర్ పదవిని దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇందుకోసం మజ్లిస్ లేదా మరో పార్టీ లేదా ఇతర కార్పొరేటర్ల మద్దతు కూడా అవసరం లేదు. ఎక్కువ మంది కార్పొరేటర్ల మద్దతు లభిస్తే సరిపోతుంది. మ్యాజిక్ ఫిగర్ రావాల్సిన అవసరమే లేదు. గెలిచిన కార్పొరేటర్లతోపాటు ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొనవచ్చు. ఎక్స్ అఫీషియో సభ్యులు పోటీ చేయడానికి అర్హత లేకున్నా ఓటు వేయవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. ప్రిసైడింగ్ అధికారి పర్యవేక్షణలో సభ్యులు చేతులు ఎత్తడం ద్వారా వారి ఓటు నమోదవుతుంది. ఎవరికి ఎక్కువ ఓట్లు (ఎక్కువ మంది చేతులెత్తడం) లభిస్తే ఆ అభ్యర్థే మేయర్ అవుతారు. ఆ తరువాత డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా ఇలాగే జరుగుతుంది. మేయర్‌ను ఎన్నుకోకుండా డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకునే అవకాశం ఉండదు.

మేయర్ ఎన్నిక ఎలా?

రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా కొత్త కార్పొరేటర్ల జాబితాను విడుదల చేస్తుంది. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారి హోదాలో ఈ ఎన్నికను నిర్వహిస్తారు. ఎన్నికకు మూడు రోజుల ముందు కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు సమాచారం అందించే బాధ్యత ప్రిసైడింగ్ అధికారిదే. పోటీ చేయదల్చుకున్నవారు ప్రిసైడింగ్ అధికారికి నామినేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. కార్పొరేటర్లకు మాత్రమే మేయర్, డిప్యూటీ మేయర్ పదవికి అర్హత ఉంటుంది. అభ్యర్థి రాష్ట్రంలో లేదా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీకి చెందినవారు అయితే, ఆ పార్టీ అధ్యక్షుడు లేదా వారి తరఫున నామినేట్ చేసిన వ్యక్తి లిఖితపూర్వకంగా ధ్రువీకరించాల్సి ఉంటుంది.

నో మ్యాజిక్ ఫిగర్

మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్యలో 50 శాతం మంది (కోరం) సమావేశానికి హాజరైతే సరిపోతుంది. అప్పటికే కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తవుతుంది. మేయర్, డిప్యూటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నవారి వివరాలను ఆ సమావేశాన్ని నిర్వహించే ప్రిసైడింగ్ అధికారి తొలుత ప్రకటిస్తారు. పోటీచేస్తున్న అభ్యర్థులను ఒకరు ప్రతిపాదిస్తే మరొకరు బలపర్చాల్సి ఉంటుంది. అలాంటి ఫార్మాలిటీ సక్రమంగా ఉందో లేదో అధికారి పరిశీలిస్తారు. అభ్యర్థుల పేర్లను ప్రకటించిన తర్వాత కోరం ఉందో లేదో సరిచూసుకుని ఎన్నిక ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ప్రకటిస్తారు. అభ్యర్థి పేరును ప్రకటించి అతనికి మద్దతుగా ఓటు వేసేవారిని చేతులెత్తాల్సిందిగా కోరుతారు. ఎంత మంది చేతులెత్తారో చూసి అన్ని ఓట్లు పడినట్లుగా రాసుకుంటారు. మిగిలిన అభ్యర్థులందరికీ ఇదే పద్ధతిని పాటిస్తారు. అంతా ముగిసిన తర్వాత ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు లభిస్తే వారు గెలిచినట్లు ప్రకటిస్తారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్‌గా ఫలానా సంఖ్యలో ఓట్లు రావాలన్న నిబంధనమీ లేదు.

సమానంగా ఓట్లు వస్తే..

ఈ సమావేశంలో అభ్యర్థులకు సమాన సంఖ్యలో ఓట్లు లభించినట్లయితే వారి సమ్మతితో ప్రిసైడింగ్ అధికారి లాటరీ తీస్తారు. అందులో ఎవరి పేరు వస్తే వారు గెలిచినట్లుగా ప్రకటిస్తారు. డిప్యూటీ మేయర్‌కు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. మేయర్ ఎన్నిక పూర్తికాకుండా డిప్యూటీ మేయర్ ఎన్నిక జరపడానికి వీల్లేదు.

కోరం లేనట్లయితే..

ఒకవేళ 50 శాతం మంది కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు రాక, కోరం లేనట్లయితే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించడానికి వీల్లేదు. ఈ విషయాన్ని సమావేశంలోనే వెల్లడించి మరుసటి రోజున ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. మరుసటి రోజు సెలవుదినమైనా దానితో నిమిత్తం లేకుండా సమావేశం జరగాల్సిందే. రెండో రోజు కూడా కోరం లేనట్లయితే ఎన్నిక మళ్లీ వాయిదా పడుతుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రిసైడింగ్ అధికారి తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోరంతో సంబంధం లేకుండా ఎంత మంది హాజరైనా సమావేశాన్ని నిర్వహించి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగేలా ఎన్నికల సంఘం చొరవ తీసుకుని ప్రిసైడింగ్ అధికారి ద్వారా ఆ ప్రక్రియను పూర్తిచేస్తుంది.

మజ్లిస్ మద్దతు అవసరమా?

టీఆర్ఎస్ పార్టీకి 55 మంది కార్పొరేటర్లు, బీజేపీకి 48, మజ్లిస్ పార్టీకి 44 మంది చొప్పున ఉన్నారు. నేరెడ్ మెట్ ఫలితం కూడా వస్తే ఈ పార్టీల బలాబలాల్లో ఒక అంకె మారుతుంది. టీఆర్ఎస్‌కు 28 మంది ఎక్స్ అఫీషియోల బలం ఉంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఏ పార్టీ మద్దతు అవసరం లేకుండా ఎక్కువ సంఖ్యా బలంతో సులభంగా గెలిచే అవకాశం ఉంది. సమావేశానికి మాత్రం కోరం కావాల్సి ఉంటుంది. మజ్లిస్, బీజేపీ కార్పొరేటర్లు హాజరు కాకపోతే కోరం లేని కారణంగా తొలి రెండు సమావేశాల్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడుతుంది. ఆ తర్వాత ఎన్నికల సంఘం ప్రకటనతో ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది.

మజ్లిస్, బీజేపీ సభ్యులు హాజరైనా వారు టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థికి మద్దతు తెలియజేయాల్సిన అవసరం లేదు. ఎలాగూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల బలం ఎక్కువగా ఉన్నందున మరే పార్టీకంటే ఎక్కువ మద్దతు ఈ పార్టీకే ఉంటుంది. అందువల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను నిలబెట్టినా గెలిచే అవకాశం లేదు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరు కాకుండా, బీజేపీ, మజ్లిస్ సభ్యులు మాత్రమే హాజరైతే ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారే ఎన్నికవుతారు. ఇలాంటి పరిస్థితులలో ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే మజ్లిస్ పార్టీకే ఛాన్స్ ఉంటుంది. ఈ పార్టీకి 44 మంది కార్పొరేటర్లు, పది మంది ఎక్స్ అఫీషియో బలం ఉంది. కానీ బీజేపీకి మాత్రం 48 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్ అఫీషియో బలం మాత్రమే ఉంది.


Next Story

Most Viewed