గ్రేటర్‎లో కొనసాగుతున్న పోలింగ్

by  |
గ్రేటర్‎లో కొనసాగుతున్న పోలింగ్
X

దిశ, వెబ్ డెస్క్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతుండగా.. 1,122 అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 9101 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 48,000 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. 74,44,260 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

గ్రేటర్‎లో శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా 58 వేల మంది పోలీసులను బందోబస్తుకు నియమించారు. 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. వాటిలో 1,752 కేంద్రాలను తీవ్ర సమస్యాత్మకంగా, 2,934 సమస్యాత్మకంగా గుర్తించారు. క్రిటికల్ కేంద్రాలలో మైక్రో పరిశీలకులను నియమించారు. సిసీ కెమెరాలను బిగించారు. లైవ్ వెబ్ క్టాసింగ్ నిర్వహించేందుకు 2,277 పోలింగ్ కేంద్రాలలో సిబ్బందిని నియమించారు. దివ్వాంగులు, 80 ఏండ్లు దాటిన వృద్ధుల కోసం అన్ని పోలింగ్ స్టేష‌న్ల వ‌ద్ద ర్యాంప్‌ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. వీల్ చైర్లను అందుబాటులో ఉంచారు. కేంద్రాల వద్ద మౌలిక స‌దుపాయాలు క‌ల్పించారు. పోలింగ్ సిబ్బందికి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా తగిన ఏర్పాట్లు చేశారు. కొవిడ్ పాజిటివ్ పేషంట్ల కోసం సాయంత్రం 5 నుంచి ఆరు గంటల వరకూ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించారు. వీరు లైన్లలో వేచి ఉన్న ఓటర్లతో సంబంధం లేకుండా నేరుగా వెళ్లి ఓటేయొచ్చు.

కొవిడ్ నిబంధనలు

జీహెచ్ఎంసీ ఎన్నికలను కొవిడ్ నిబంధనలు అనుసరించి నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లోనూ భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. ప్రతి పోలింగ్ కేంద్రంలో శానిటైజేషన్ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి పది చొప్పున కొవిడ్ కిట్స్ అందజేశారు.

రాజకీయ పార్టీలకు నిబంధనలు

ముందుగా అనుమతి పొంది పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్ల దూరంలో కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. 1 టేబుల్, 2 కుర్చీలు, ఇద్దరు వ్యక్తులకు సరిపోయే గొడుగు లేదా టార్పాలిన్ కు అనుమతి ఉంటుంది. అధికారులు అడిగినపుడు అనుమతి పత్రాలను చూపించవలసి ఉంటుంది. పోలింగ్ బూత్‌కు వంద మీటర్ల పరిధి లోపల ఎన్నికల ప్రచారం చేయకూడదు. పోలింగ్ స్టేషన్ లోపలా, బయట వంద మీటర్ల పరిధి వరకూ మొబైల్ ఫోన్లు, కార్డ్‌ లెస్ ఫోన్లు, వైర్లెస్ సెట్లు ఉపయోగించుటకు వీలు లేదు. ఎన్నికల పరిశీలకులు, సూక్మ పరిశీలకులు, ప్రిసైడింగ్ అధికారి, రిటర్నింగ్ అధికారి, భద్రతా సిబ్బంది మొబైల్ ఫోన్ కలిగి ఉండటానికి అనుమతి ఉంది. వారు కూడా వీటిని సైలెన్స్ మోడ్ లోనే ఉపయోగించాలి. ప్రతి అభ్యర్థి తిరగడానికి ఒక వాహనాన్ని మాత్రమే అనుమతిస్తారు. ఏజెంట్, కార్యకర్తలు, ఇతర రాజకీయ నాయకులకు వేరే వాహనాన్ని అనుమతించరు. ఒక అభ్యర్థి పేరుతో కేటాయించిన వాహనం, ఇతర అభ్యర్థి ఉపయోగించడానికి వీలు లేదు.


Next Story

Most Viewed