రెట్టింపైన తలసరి ఆదాయం

by Shyam |

<p>అభివృద్ధంతా హైదరాబాద్ చుట్టే దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర సగటు తలసరి ఆదాయం భారీగా పెరిగింది. 2015 సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర సగటు తలసరి ఆదాయం రూ. 95 వేల 361 ఉండగా.. ప్రస్తుతం అది 2 రెట్లకు పైన పెరిగి ఏకంగా రూ.2 లక్షల 28 వేల 216 రూపాయలకు చేరింది. ఈ లెక్కలను తాజాగా ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్‌తో పాటు ఇచ్చిన 2020 సోషియో ఎకనమిక్ [&hellip;]</p>

రెట్టింపైన తలసరి ఆదాయం
X

అభివృద్ధంతా హైదరాబాద్ చుట్టే

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర సగటు తలసరి ఆదాయం భారీగా పెరిగింది. 2015 సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర సగటు తలసరి ఆదాయం రూ. 95 వేల 361 ఉండగా.. ప్రస్తుతం అది 2 రెట్లకు పైన పెరిగి ఏకంగా రూ.2 లక్షల 28 వేల 216 రూపాయలకు చేరింది. ఈ లెక్కలను తాజాగా ప్రవేశపెట్టిన 2020-21 బడ్జెట్‌తో పాటు ఇచ్చిన 2020 సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్‌ నివేదికలో ‌ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర మొత్తం స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ)ని ఆ సంవత్సరం జనాభాతో భాగిస్తే వచ్చేదే రాష్ట్రంలో నివసించే ఒక్కొక్క వ్యక్తి ఆదాయం. దీనినే తలసరి ఆదాయం లేదా జీడీపీ‌ పర్ క్యాపిటాగా పేర్కొంటారు. ఇది రాష్ట్ర జీడీపీతోపాటే సమానంగా పెరుగుతుంది. ఉమ్మడి ఏపీలో అత్యంత ఎక్కువ జీఎస్‌డీపీ కలిగిన హైదరాబాద్ నగరం, రంగారెడ్డి జిల్లాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత 10 జిల్లాల తెలంగాణకే చెందడంతో తెలంగాణ సగటు జీడీపీ పర్ క్యాపిటా ( తలసరి ఆదాయం) కూడా ఒక్కసారిగా పెరిగింది. అనంతరం తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించి కొత్త నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, పవర్ ప్రాజెక్టుల నిర్మాణం, పెండింగ్ నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం వంటి వాటికి పెట్టుబడుల విషయంలో ప్రాధాన్యమిచ్చింది. దీంతో తెలంగాణ జీఎస్డీపీలో వృద్ధి 2015 సంవత్సరం నుంచి రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20 దాకా చేసిన బడ్జెట్ కేటాయింపులతోపాటు కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులు కలుపుకొని ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్ల మేర పెట్టుబడి వ్యయం చేసినట్లు బడ్జెట్ లెక్కలు చెబుతున్నాయి. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఒక్కో ఏడాది జీడీపీ పర్ క్యాపిటా డబుల్ డిజిట్‌లో వృద్ధి చెందుతూ వస్తోంది.

జిల్లాల పునర్విభజనతో కొన్ని ప్రాంతాలకు మెరుగైన స్థానాలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత 2017లో రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలను ప్రభుత్వం 33 జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతంలో వెనుకబడ్డ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ప్రత్యేక జిల్లాలుగా అవతరించి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఉదాహరణకు 2015 సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్ నివేదిక లెక్కల ప్రకారం రూ.78678 జీడీపీ పర్ క్యాపిటాతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఒకప్పటి తెలంగాణ 10 జిల్లాల్లో కింది నుంచి 4వ స్థానంలో ఉండేది. ప్రస్తుతం రూ.1 లక్షా 91 వేల జీడీపీ పర్ క్యాపిటాతో 33 జిల్లాల్లో ఏకంగా 4వ స్థానానికి ఎగబాకింది. అయితే జిల్లాల విభజనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ టౌన్ విడిపోయి కొత్త జిల్లాగా ఏర్పడటమే ర్యాంకింగ్ మెరుగయ్యేందుకు కారణంగా తెలుస్తోంది. కాగా, ఇదే ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయి కొత్త జిల్లాలుగా ఏర్పడ్డ గ్రామీణ వెనుకబడ్డ ప్రాంతాలైన నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జీడీపీ పర్ క్యాపిటా విషయంలో ఇంకా చివరి స్థానాల్లోనే ఉన్నాయి. అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మెజారిటీ ప్రాంతం ఇప్పటికీ వెనుకబడిందనే స్పష్టమవుతోంది. 2015 సంవత్సరంలో రూ.68 వేల 511 జీడీపీ పర్ క్యాపిటాతో చివరి స్థానంలో ఉన్న ఆదిలాబాద్ ప్రస్తుతం 33 జిల్లాల తెలంగాణలో రూ. లక్షా 56 వేల 940లతో 11వ స్థానంలో ఉంది. 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్విభజన చేయడంతో అంతకముందు జీడీపీ పర్ క్యాపిటా విషయంలో వెనుకబడి ఉన్న పలు జిల్లాల్లోని కొన్ని అభివృద్ధి చెందిన ప్రాంతాలు, జనాభా సాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు అగ్రస్థానంలోకి వచ్చి చేరాయి. దీనికి వరంగల్ జిల్లా నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడ్డ ములుగు ప్రాంతాన్నే ఉదాహరణగా చెప్పొచ్చు. 2015లో రూ.73496లతో చివరి నుంచి 3వ స్థానంలో ఉన్న వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ప్రస్తుత ములుగు జిల్లా, 2020 సోషియో ఎకనమిక్ అవుట్‌లుక్ లెక్కల ప్రకారం రూ. లక్షా 69 వేల 211ల తలసరి ఆదాయంతో 33 జిల్లాల్లో 9వ స్థానానికి చేరింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత హైదారాబాద్ నగర ఆదాయం కలిసి రావడంతో ప్రభుత్వం ప్రతి ఏడాది భారీగా చేసిన పెట్టుబడి వ్యయం వల్ల కొన్ని ప్రాంతాలు త్వరితగతిన అభివృద్ధి చెందాయి. అయితే ఇప్పటికీ తెలంగాణలో రాజధాని హైదరాబాద్ విస్తరించి ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, సంగారెడ్డిలే జీడీపీ పర్‌ క్యాపిటాలో అగ్రస్థానాల్లో ఉండగా చివరి నుంచి 5 స్థానాల్లో కింద నుంచి వరుసగా నారాయణపేట, జగిత్యాల, నాగర్ కర్నూల్, వనపర్తి, కామారెడ్డి జిల్లాలున్నాయి. జిల్లాల విభజన జరగకుండా ఉంటే జీడీపీ పర్ క్యాపిటా అంశంలో తెలంగాణ ఏర్పడ్డప్పటి జిల్లాల వరుస క్రమమే ఇప్పటికీ కొనసాగేదని, అభివృద్ధి విషయంలో ఇప్పటికీ తెలంగాణలో భారీ అసమానతలున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో పర్యటించిన 15వ ఆర్థిక సంఘం సభ్యులు కూడా తెలంగాణలో అభివృద్ధంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైందని అప్పట్లో వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, నీటిపారుదల రంగాలపై చేస్తున్న పెట్టుబడుల వల్ల పరిస్థితులు మారే అవకాశముందని వారు అప్పట్లో పేర్కొన్నారు.

Tags: gdp per capita, telangana, hyderabad, trs, mahaboobnagar

Next Story