సిద్దిపేటలో ఇక ఇంటింటికీ గ్యాస్‌ కనెక్షన్..

by  |

సిద్దిపేట అభివృద్ధి పథంలో మరో ముందడుగు వేసింది. ఈ జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్‌ కనెక్షన్లు అందించనున్నట్టు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. దీంతో పట్టణ ప్రజలకు ఆర్థికంగా లాభాదాయకంతో పాటు జిల్లాను కాలుష్య రహిత పట్టణంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నదని తెలిపారు. తొలుత జీ+2 తరహాలో దేశానికే ఆదర్శంగా నిర్మించిన నర్సాపూర్ డబుల్ బెడ్రూం కాలనీలో ఇంటింటికీ పైపులైన్ ద్వారా గ్యాస్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కలెక్టరేట్‌లో శనివారం ఉదయం కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, మున్సిపల్ అధికారులు, టోరెంటో సంస్థ ప్రతినిధులు, ఇతర జిల్లా అధికారిక సిబ్బందితో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. పట్టణంలోని పలు మున్సిపల్ వార్డుల్లో సుమారు 2 వేల ఇళ్లకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని రూపకల్పన చేసినట్లు వివరించారు. గ్యాస్ పంపిణీ వ్యవస్థలోనే నాణ్యత, పర్యావరణహితం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీతో నవశకానికి నాంది పలికేలా కొత్త ప్రాజెక్టును జిల్లాకు తీసుకొచ్చినట్టు తెలిపారు. ఇంటి అవసరాలకే కాకుండా, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకూ పైపుల ద్వారా గ్యాస్‌ పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ఇప్పటికే వేములవాడ కమాన్ వద్ద ఆటో మొబైల్ రంగంలో గ్యాస్ సరఫరా కోసం సీఎన్జీ స్టేషన్ ప్రారంభించినట్టు గుర్తుచేశారు. తొలి విడతలో భాగంగా పట్టణ పరిధిలోని రెండు, మూడు కాలనీల్లో 11 కిలో మీటర్ల మేర పైపు లైను నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు టోరెంటో సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ యూనిట్‌లో లక్ష ఇళ్లకు గ్యాస్ సరఫరా చేస్తామని వివరించారు. ఈ మేరకు పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో వ్యవహరించి టోరెంటో ప్రతినిధులకు సహకరించాలని మంత్రి సూచించారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story