బుక్ చేసిన 45 నిమిషాల్లో గ్యాస్ సిలిండర్ !

39

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత రోజుల్లో పల్లె అయినా పట్నం అయినా గ్యాస్ లేనిది పూట గడవడం లేదు. కట్టెల పొయ్యికి స్వప్తి చెప్పిన వంటింటి మహారాణులు.. గ్యాస్ స్టౌలకు పూర్తిగా అలవాటు పడిపోయారు. అయితే సిలిండర్ నిండుగా ఉంటే చకచక వంటలు చేయోచ్చు కానీ అది నిండుకుంటే వారి తిప్పలు అన్నీఇన్నీ కావు. సిలిండర్ బుక్ చేసి వారం, పది రోజులైనా గ్యాస్ రాక ఇబ్బందులు పడే వారు. ఇక పండగ సీజన్ లో అయితే వారి బాధలు వర్ణణాతీతం. వీటిన్నీటికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) చెక్ పెట్టబోతోంది.

ఐఓసీఎల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త చెప్పనుంది. సిలిండర్ బుక్ చేసిన రోజునే ఇంటికి సరఫరా చేసేందుకు సిద్ధం అవుతుంది. ఇందుకోసం తత్కాల్ ఎల్పీజీ సేవలను ఆవిష్కరించనుంది. తత్కాల్ లో బుక్ చేసిన సిలిండర్ ను కస్టమర్లకు కేవలం 30 నుంచి 45 నిమిషాల్లో డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐఓసీఎల్ టాప్ మేనేజ్ మెంట్ తెలిపింది. అయితే ఈ సేవలు ఫిబ్రవరి మొదటి వారంలో అందుబాటులోకి వస్తాయని సూచన ప్రాయంగా తెలిసింది. కానీ దీనిపై ఐఓసీఎల్ అధికారికంగా ప్రకటన చేయలేదు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే వినియోగదారుల కష్టాలు తీరినట్టే.