కొత్త బార్లకు అదిరిపోయిన రెస్పాన్స్.. ఎక్సైజ్ శాఖకు పండగే!

by  |
కొత్త బార్లకు అదిరిపోయిన రెస్పాన్స్.. ఎక్సైజ్ శాఖకు పండగే!
X

దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలోని 72 కొత్త మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయబోయే బార్‌లకు దరఖాస్తులు జోరందుకున్నాయి. ఒక్కో బార్ ఒక్కరికే దక్కే అవకాశం ఉండగా.. దానిని ఎలాగైనా దక్కించుకునేందుకు వందల మంది టెండర్లు వేయడం గమనార్హం. కొత్త బార్లకు ప్రభుత్వం విధించిన గడువు మంగళవారంతో ముగిసింది. వీటిలో యాదాద్రి దేవాలయం పున: నిర్మాణంతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతున్న యాదగిరి గుట్టలోని ఒకే ఒక్క బార్‌కు అత్యధికంగా 317 మంది పోటీ పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో అత్యల్ప దరఖాస్తులు వచ్చాయి. ఈ పోటీలో టెండర్లు దక్కించుకున్న తర్వాత డిపాజిట్ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం రావడం ఒక విషయమైతే, టెండర్లలో దరఖాస్తుల దారుల నుంచి కూడా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలోనే ఆదాయం సమకూరనుంది.

ఒక్క బార్‌కు వందలాదిగా టెండర్లు..

రాష్ట్ర వ్యాప్తంగా 159 బార్లకు జనవరి 25 నుంచి ఎక్సైజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 13తో గడువు ముగిసిన తర్వాత మొత్తం 159 బార్లకు 7,360 దరఖాస్తులు అందాయి. అయితే, ప్రభుత్వం మరో మూడ్రోజులు ఈనెల 16వ తేదీ మంగళవారం నాటికి గడువును పొడిగించింది. ఈ ప్రకారం ఈ నెల 16 టెండర్లకు గడువు ముగిసే నాటికి మొత్తం 8,464 దరఖాస్తులు అందాయి. టెండర్లకు మూడ్రోజులు గడువు పెంచడం కారణంగా అదనంగా మరో 1,104 దరఖాస్తులు పెరిగాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు జిల్లాల పరిధిలో మొత్తం 55 బార్లకు 1,388 దరఖాస్తులు అందగా, యాదాద్రి-భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో ఒకే ఒక్క బార్‌కు ఏకంగా 317 టెండర్లను దరఖాస్తులు వచ్చాయి. యాదాద్రి అభివృద్ధి నేపథ్యంలో ఇక్కడి బార్‌కు పెద్ద మొత్తంలో ఒక్కసారిగా డిమాండ్ పెరగడం విశేషం. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్లలోని ఒక్క బార్‌కు 276, తిరుమలగిరిలో 211, ఖమ్మం జిల్లా వైరాలో 2 బార్లకు 381 దరఖాస్తులు వచ్చాయి. కాగా, మంచిర్యాలలో 10 బార్లకు 513, మహబూబాబాద్ జిల్లాలో 3 బార్లకు 552 దరఖాస్తులు అందాయి.

రూ.84.64 కోట్ల ఆదాయం..

రాష్ట్రంలో యాదగిరిగుట్ట, ఖమ్మం జిల్లా వైరా, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యధిక దరఖాస్తులు అందాయి. నిజామాబాద్ జిల్లాలో మాత్రం మొత్తం 12 బార్లకు కేవలం 92 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వీటిలో బోధన్‌లో 3 బార్లకు 9 దరఖాస్తులు, ఆర్మూర్‌లో 1 బార్‌కు 14 దరఖాస్తులు, భీంగల్‌లో 1 బార్‌కు 46 దరఖాస్తులు వచ్చాయి. అయితే, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న బార్ల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం చేకూరనుంది. టెండర్‌లో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 8,464 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.1 లక్ష చెల్లించాల్సి రావడంతో మొత్తం దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.84.64 కోట్ల ఆదాయం వచ్చింది. గడువు పెంచకముందు ఈ నెల 13వ తేదీ నాటికీ 7,360 దరఖాస్తులకు రూ.73.60 కోట్ల ఆదాయం రాగా, గడువు పెంచిన తర్వాత మూడ్రోజుల్లోనే అదనంగా మరో రూ.11 కోట్ల ఆదాయంతో మొత్తం రూ.84.64 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చినట్లయింది. ఇదిలాఉండగా, టెండర్లు దక్కించుకున్న తర్వాత బార్ యాజమానులు ప్రభుత్వానికి చెల్లించే డిపాజిట్ సొమ్ముతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ గల్లా పెట్టె నిండుకోనుంది.

Next Story

Most Viewed