వ్యాక్సినేషన్‌కు ఫ్రంట్​లైన్ వారియర్స్ వెనుకంజ

by  |
వ్యాక్సినేషన్‌కు ఫ్రంట్​లైన్ వారియర్స్ వెనుకంజ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనా వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ఫ్రంట్​లైన్ వారియర్స్ వెనుకడుగు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వ్యాక్సినేషన్​లో భాగంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 12,307 మంది వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని గుర్తించగా, సోమవారం వరకు 2,675 మంది టీకాలను తీసుకోలేదని తెలుస్తోంది. ముందుగా రిజిస్ట్రేషన్​ చేయించుకున్న వారు వ్యాక్సిన్​ వేసుకునేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. మరొకొందరికి సమాచారం ఇచ్చినా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అయితే కొవిడ్​నియంత్రణపై తొలి నుంచీ పోరాడుతూ, ప్రజలందరికీ అవగాహన కల్పించేవారే వెనుకడుగు వేస్తుండడం గమనార్హం.

కొవిడ్​పేరు చెబితేనే ప్రపంచం మొత్తం గజగజ వణికిపోయింది. మహమ్మారి నియంత్రణ కోసం ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. వైరస్ తీవ్రత తగ్గినప్పటికీ వ్యాక్సిన్ పై ప్రయోగాలు మాత్రం జోరుగా జరిగాయి. ఈ నేపథ్యంలో యూకే నుంచి కొత్త వైరస్ రావడంతో ప్రజలు భయపడి పోయారు. ఈ క్రమంలో దేశీయంగా రెండు కరోనా వ్యాక్సిన్లను తయారు చేసి ప్రయోగాల తరువాత అందరికీ టీకాలను ఇవ్వాలని ప్రభుత్వాలు సంకల్పించాయి. ఇందులో భాగంగా ఫ్రంట్​లైన్ వారియర్స్ గా పేరొందిన వైద్యారోగ్య, అంగన్ వాడీలతో పాటు, ప్రైవేట్ వైద్య రంగంలో పనిచేస్తున్న వారికి మొదట కొవిషీల్డ్ టీకాలు వేసేందుకు రిజిస్ర్టేషన్ ప్రక్రియను ప్రారంభించి, ట్రయల్ రన్ సైతం నిర్వహించాయి.

దశల వారీగా టీకాల పంపిణీ

ఉమ్మడి జిల్లాలో 12,307 మందిని ఫ్రంట్​లైన్ వారియర్స్ ను గుర్తించిన యంత్రాంగం టీకాలు వేసే కార్యక్రమాన్ని ఈనెల 16న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. మొదటి రోజు నిజామాబాద్ లో ఆరు కేంద్రాలు, కామారెడ్డి జిల్లాలో నాలుగు కేంద్రాల్లో టీకాలు వేశారు. మొదటి రోజు ఒక్కో కేంద్రంలో 30 మందికి టీకా వేయాలని నిర్ణయించి, ఆ మేరకు నిజామాబాద్ జిల్లాలో 180 , కామారెడ్డిలో 175 మందికి టీకాలు వేశారు. ఆ తరువాత రోజు నుంచి కేంద్రాలను పెంచి దశలవారీగా టీకాలు వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖలు కొవిషీల్డ్ టీకాలపై అవగాహన కల్పించడంతో పాటు ముందుగా రిజిస్ర్టేషన్ల ఆధారంగా, ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న వారికి లేదా ఆఫ్​లైన్​లో ముందుకు వచ్చిన వారికి టీకాలు వేస్తున్నారు. కానీ, సోమవారం ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫ్రంట్​లైన్ వారియర్స్ కు టీకా పంపిణీ ప్రారంభమైనా ఉమ్మడి జిల్లాలో మాత్రం టీకాల పంపిణీ పూర్తి కాలేదు. అంటే ముందుగా రిజిస్ర్టేషన్​ చేయించుకున్న టీకాలు వేసుకునేందుకు ముఖం చాటేశారని తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 7,941 మందికి గాను 5,643 మంది టీకాలు తీసుకోగా 1,809 వేసుకోలేదు. అలాగే కామారెడ్డి జిల్లాలో 4,366 మందికి గాను సోమవారం వరకు 3,500 మంది టీకాలు తీసుకోగా 866 మంది మాత్రం ఆసక్తి చూపలేదు. మొత్తంగా ఉమ్మడి జిల్లా పరిధిలో 2,675 మంది టీకాలను తీసుకోలేదని తెలుస్తోంది.

569 మందికి టీకా తీసుకున్నది 80 మందే..

కరోనాపై తొలి నుంచీ పోరాడిన, పోరాడుతున్న వైద్యారోగ్య శాఖ కు చెందిన అధికారుల కేడర్​తోపాటు రెండు, మూడు తరగతుల ఉద్యోగులే వ్యాక్సిన్​వేసుకునేందుకు ముందుకు రాలేదని లెక్కలు చెబుతున్నాయి. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) లో 569 మంది పని చేస్తుంటే ఇప్పటి వరకు 80 మంది మాత్రమే టీకా తీసుకోవడం గమనార్హం. ఇంకా చాలమంది ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్టున్న వైద్యులు కుడా ఇప్పటికీ టీకాలు తీసుకోకపోవడం దారుణం. కరోనా బాధితులకు సేవలు చేసే ఫ్రంట్ లైన్​వారియర్స్​వివిధ శాఖలకు చెందిన వారే వెనుకంజ వేస్తే భవిష్యత్ త్తులో సాధారణ ప్రజలు తీసుకునేందుకు వెనుకడుగువేస్తారనే సందేహలు ఉన్నాయి. ఈ విషయంలో జిల్లా అధికార యంత్రాంగంతోపాటు ఫ్రంట్​లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న ఆయా శాఖల అధిపతులు కరోనా యోధులందరికీ టీకాలు వేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Next Story

Most Viewed