ఉచిత హామీల కట్టడి అవసరం!

by Ravi |   (  Updated:2025-07-06 01:01:11  IST  )

సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వరంగా మారాలే గానీ, పార్టీలకు ఓట్ల వరంగా మారకూడదు. రాజకీయ పార్టీల భవిష్యత్తును ఉచిత పథకాలు నిర్ణయిస్తున్నాయి. తద్వారా పాలనా వ్యవస్థలో

ఉచిత హామీల కట్టడి అవసరం!
X

సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వరంగా మారాలే గానీ, పార్టీలకు ఓట్ల వరంగా మారకూడదు. రాజకీయ పార్టీల భవిష్యత్తును ఉచిత పథకాలు నిర్ణయిస్తున్నాయి. తద్వారా పాలనా వ్యవస్థలో సానుకూల, వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. సరైన ప్రణాళికతో సమాజ సమస్యలను నిర్మూలించేలా పథకాలు రూపొందిస్తే సామాజిక అభివృద్ధి జరుగుతుంది. కానీ జరుగుతున్నది పూర్తిగా విరుద్ధం, ఎన్నికల వేళ ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు అవసరమైన ప్రతి అవకాశాన్ని రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకోకుండా మేనిఫెస్టోలు తయారవుతున్నాయి..

అధికారమే పరమావధిగా..

విద్యా, వైద్యం కోసం నిధులు లేవని గగ్గోలు పెట్టే ప్రభుత్వాలు, ఎన్నికల వేళ మాత్రం ఉచితంగా ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తున్నారు.. ఎన్నికల సమయంలో పార్టీ ప్రణాళికలను విడుదల చేయడం చట్టబద్ధమైనప్పటికీ వాటి అమలుకు నైతిక బాధ్యత వహించవలసిన అవసరం పార్టీలకు ఉండటం లేదు. అధికారమే పరమావధిగా సరికొత్త ఉచిత హామీలు ఇవ్వడంలో పార్టీలు తమలో తామే పోటీపడుతున్నాయి. ఈ విషయాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఉచిత హామీలు ఇవ్వడం, జనాలను ప్రలోభపెట్టడం, గెలిచాక నిలబెట్టుకోలేక పోవడం మనకు మామూలు విషయంగా మారింది. తమిళనాడు నుంచి మొదలైన ఈ సంస్కృతి దేశం మొత్తం వ్యాపించింది. కొన్ని సమయాల్లో ప్రతిపక్ష పార్టీలు మేనిఫెస్టోల అమలుకు గట్టిగా పట్టుబడితే, అప్పుల ద్వారా ఆయా ఉచితాలను కొంత వరకు నెరవేర్చే ప్రయత్నాలు జరుగుతాయి.

అప్పులు అందుకే పెరుగుతున్నాయ్!

అందుకే ప్రతి యేటా మన దేశ అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. పాలకుల మొదటి కర్తవ్యం ప్రజా సేవ. ప్రజలు పేదరికం నుంచి బయటపడడం, ప్రజలకు కనీస అవసరాలు తీర్చడం, ప్రజల డబ్బును పొదుపు వైపు మళ్లించడం, వృత్తిపై జీవించే వారికి విద్యా, వైద్య భద్రతతో పాటు వృద్ధులు అసహాయులకు, ఆర్థికంగా సహకారం అందించాలి. విద్య, వైద్య సదుపాయాల వల్ల జీవన ప్రమాణం పెరుగుతుంది. ప్రజల వ్యక్తిగత ఆదాయాలు పెరిగి వస్తు వినియోగం పెరగడంతో ఉత్పాదక రంగం ఎదుగుతుంది, తద్వారా ఉద్యోగ అవకాశాలతో పాటు, అంతర్జాతీయ ఎగుమతులు కూడా ఊపందుకుంటాయి.

ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి!

రాజకీయ పార్టీలు ఉచితాలకు సంక్షేమ పథకాలకు మధ్య ఉన్న వ్యత్యాస రేఖను చేరిపివేశాయి. సంక్షేమం సమాజ ఎదుగుదలకు పనికి వస్తే, ఉచితం బిక్ష లాంటిది. ఇది కేవలం కొంత మంది ప్రజల వరకే పరిమితం అవుతుంది. ఈ వ్యత్యాసాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజలకు అంతగా అవసరం లేని ఆకర్షక పథకాలను, ఉచితాలను ప్రకటిస్తూ, అధికారం చేజిక్కిన తర్వాత, వాటి అమలుకు రాష్ట్రాన్ని, దేశాన్ని, ఋణ గ్రస్తులుగా చేయడం. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలహీన పడి, ధరల పెరుగుదలతో పాటు అప్పుల దేశంగా మారి ప్రజల జీవన విధానంలో విపరీతమైన ఇబ్బందులు రావడం మనమంతా చూస్తూనే ఉన్నాం.

ఈ చట్టం వస్తే..

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచాక మేనిఫెస్టో లోని హామీలు అమలు చేయని పార్టీల గుర్తింపును రద్దు చేసే చట్టం రావాలి. అందులో ఉచితాలకు బదులు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలి. మేనిఫెస్టోలోని అంశాలను ఎలా, ఎంత కాలం వరకు అమలు చేయగలరో వివరణ తీసుకోవాలి. నిర్ధారిత సమయంలో అమలు చేయకుంటే ఆయా పార్టీ ల నాయకులను 'రీకాల్' చేయాలి. అప్పుడే గాడి తప్పుతున్న మన దేశ ఎన్నికల విధానం సరికొత్త రూపంలోకి మారవచ్చు.

ఎన్. రాజ్ కుమార్

90305 82670

Next Story